ఊసలగడ్డలో ఒంటరి ఏనుగు విధ్వంసం
ABN, First Publish Date - 2022-12-16T00:46:15+05:30
సోమల మండలం నంజంపేట పంచాయతీ ఊసలగడ్డ యానాదకాలనీలో బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు విధ్వంసం సృష్టించింది. మదురమలై అటవీ శివారులోని ఈ కాలనీలో రామయ్య, సిద్దయ్య, భూదేవికి చెందిన గుడిసెలను ఒంటరి ఏనుగు తొక్కివేసింది.
సోమల: సోమల మండలం నంజంపేట పంచాయతీ ఊసలగడ్డ యానాదకాలనీలో బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు విధ్వంసం సృష్టించింది. మదురమలై అటవీ శివారులోని ఈ కాలనీలో రామయ్య, సిద్దయ్య, భూదేవికి చెందిన గుడిసెలను ఒంటరి ఏనుగు తొక్కివేసింది. వస్తువులను ధ్వంసం చేసి చిందరవందరగా పడేసింది. రాత్రి 2గంటల సమయంలో ఏనుగు భీకర అరుపుతో గ్రామస్తులు నిద్ర లేచి అప్రమత్తమయ్యారు. సమీపంలో ఒంటరి ఏనుగును గుర్తించి పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఊసలగడ్డ గుడిసెలను ధ్వంసం చేసింది. కాలనీవాసులు అగ్నిమంటలు వేసుకొని డప్పులు వాయిస్తూ రాత్రంతా జాగారం చేశారు. తాగునీటి బోరు వద్ద ఏర్పాటు చేసిన స్టార్టర్‌ను ఏనుగు ధ్వంసం చేసింది. మంగళవారం రాత్రి ఆవులపల్లె పంచాయతీ ఇర్లపల్లెలో జంట ఏనుగులు సంచరించి హల్‌చల్ చేశాయి. అటవీ శివారుల్లో నివాసాలు ఉన్న ఎస్టీ కాలనీ వాసులు ఏనుగుల సంచారంతో భయాందోళన చెందుతున్నారు.
కడపనత్తంలోనూ..
బైరెడ్డిపల్లె మండలం కడపనత్తం పంటపొలాలపై బుధవారం రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసింది. వరి, టమోట, అరటి, కంది, మొక్కజొన్న పంటలను తొక్కి నాశనం చేయడంతో తీవ్రనష్టం వాటిల్లింది. ఏనుగుల సంచారంతో రాత్రిళ్లు పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.
- బైరెడ్డిపల్లె
Updated Date - 2022-12-16T00:46:17+05:30 IST