ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శివమణి’ ఇక లేరు

ABN, First Publish Date - 2022-07-10T06:30:59+05:30

నిజాయతీగా పనిచేశారు. నేరస్తులకు సింహస్వప్నంగా నిలిచారు. పోలీసు శాఖకు వన్నె తెచ్చారు. ప్రజల్లో గుండెల్లో నిలిచారు.

సీఐ రుషికేశవ (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనారోగ్యంతో సీఐ రుషికేశవ మృతి

పుంగనూరులో అంత్యక్రియలు


పుంగనూరు, జూలై 9: నిజాయతీగా పనిచేశారు. నేరస్తులకు సింహస్వప్నంగా నిలిచారు. పోలీసు శాఖకు వన్నె తెచ్చారు. ప్రజల్లో గుండెల్లో నిలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘శివమణి’గా పేరొందిన సీఐ రుషికేశవ(47) ఇక లేరు. ఏడాదిగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. వందలాదిమంది జనం కన్నీటి వీడ్కోలు మధ్య శనివారం అంత్యక్రియలు జరిగాయి. 


అనంతపురానికి చెందిన సుంకర రుషికేశవ 2002లో ఎస్‌ఐగా చేరారు. తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, గంగవరం, పీటీఎం, తంబళ్లపల్లెల్లో పనిచేశారు. 2013లో సీఐగా పదోన్నతి పొందారు. చిత్తూరు డీటీసీ, టాస్క్‌ఫోర్స్‌, ములకలచెరువు, చిత్తూరు ట్రాఫిక్‌, స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేశారు. ఏడాదిన్నర కిందట కర్నూలు సీబీసీఐడీకి బదిలీపై వెళ్లిన ఆయన.. ఏడాది కిందట అనారోగ్యంపాలై మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, వేలూరు సీఎంసీ, తిరుపతి, మదనపల్లె ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. కొద్దిరోజులుగా మదనపల్లెలోని రోజా ఫ్లాట్స్‌లో నివాసముంటూ చికిత్స తీసుకుంటున్నారు. రెండురోజుల కిందట పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈయనకు భార్య సుశీల, కుమారుడు జయసింహ, కుమార్తెలు పల్లవి (ఎంబీబీఎస్‌), ఇంటర్‌ చదువుతున్న రోహిత ఉన్నారు.


కొంతకాలంగా మదనపల్లెలో రుషికేశవ ఉండటంతో ఆయన పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురాగా పలువురు నివాళులర్పించారు. పుంగనూరులోని ఆయన పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలియడంతో వందలాది మంది ప్రజలు కడచూపు కోసం వేచి చూశారు.  అనంతరం పూలతో అలంకరించిన శాంతిరథంలో  పార్థివదేహాన్ని తీసుకురాగా ఆయన అభిమానులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించి కన్నీటి పర్యంతమయ్యారు.  చిత్తూరు రిజర్వ్‌ ఎస్‌ఐ మురగ ఆధ్వర్యంలో పార్థివదేహానికి పోలీస్‌ గౌరవవందనం చేసి గాలిలోకి కాల్పులు జరిపారు. పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌, టీడీపీ నేతలు శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్‌ గాంధీ వెంకటరెడ్డి, డీఎస్పీ రవిమనోహరచారి, విశ్రాంత డీఎస్పీ నంజుండప్ప, సీఐలు గంగిరెడ్డి, సాదిక్‌అలీ, లక్ష్మీకాంత్‌రెడ్డి, నరసింహులు పలువురు ఎస్‌ఐలు, పోలీసులు, ప్రజలు, పలమనేరు పెద్దపంజాణి, మొలకలచెరువు, కదిరి, మదనపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు పాల్గొన్నారు. 


శివమణిగా గుర్తింపు ఇలా.. 

2004లో పెద్దపంజాణి, పుంగనూరులో ఎస్‌ఐగా ఈయన నేరస్థుల ఆట కట్టించారు. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అన్యాయం జరిగిందని తెలిస్తే ఎంతటి వారినైనా జైలుకు పంపించారు. సివిల్‌ దుస్తులు, మారువేషాల్లో గ్రామాల్లో తిరుగుతూ నాటుసారా తయారీ, పేకాట, కోడిపందెం స్థావరాలపై దాడులు నిర్వహించారు. నిందితులను అరెస్టు చేసేవారు. మహిళా కేసుల విషయంలో సీరియ్‌సగా ఉండేవారు. ఆ సమయంలో నాగార్జున నటించిన శివమణి సినిమా విడుదలైంది. నీతినిజాయితీగా పనిచేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్న రుషికేశవకు ప్రజలే శివమణిగా నామకరణం చేశారు. ఉన్నతాధికారులూ అలాగే పిలిచేవారు. ఈయన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు.


పలువురికి సాయం 

ములకలచెరువు సీఐగా రుషికేశవ ఉన్నప్పుడు పొలాల్లో భారీగా మోటార్లు, స్టార్టరు పెట్టెలు చోరీకి గురయ్యాయి. దీంతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందిపడతారనే ఉద్దేశంతో ఆయనే సొంత డబ్బుతో తంబళ్లపల్లె, ములకలచెరువు, పీటీఎం, పెద్దమండ్యం మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ సామగ్రి వితరణ చేశారు. పేద విద్యార్థులకు రూ.5-10 వేల వరకు ఉపకార వేతనాలు అందించారు. 


ప్రజల పోలీసుగా.. 

ఎస్‌ఐగా పుంగనూరు నుంచి 2006లో మొలకలచెరువుకు బదిలీ కాగా.. దానిని రద్దు చేయాలంటూ పుంగనూరులో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేశారు. మరికొందరు యువకులు గుండు కొట్టుకుని నిరసనలు తెలిపారు. ఆయన ప్రజలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత, 2009 ఎన్నికల సందర్భంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రచారానికి పుంగనూరు వచ్చారు. ఆ సమయంలో బందోబస్తుగా  రుషికేశవ ఇక్కడకు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆయనపై పూలవర్షం కురుపిస్తూ పైకి ఎత్తుకుని ఊరేగించారు. అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన రుషికేశవ.. పోలీసు శాఖకు వన్నె తెచ్చారు. స్ఫూర్తిగా నిలిచారు.



Updated Date - 2022-07-10T06:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising