నారాయణగిరి శ్రీవారిపాదాల వద్ద 9న ఛత్రస్థాపనోత్సవం
ABN, First Publish Date - 2022-08-04T06:47:42+05:30
తిరుమలలోని నారాయణగిరి శ్రీవారిపాదాల వద్ద ఈనెల తొమ్మిదో తేదీన ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరగనుంది.
తిరుమల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని నారాయణగిరి శ్రీవారిపాదాల వద్ద ఈనెల తొమ్మిదో తేదీన ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారిపాదాలకు తిరుమంజనం నిర్వహించి.. అర్చకబృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి మొదటగా కాలుమోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రావణ శుద్ధ ద్వాదశి రోజు ఛత్రస్థాపనోత్సవం జరుగుతుంది. ఈఉత్సవానికి సంబంధించి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈకాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండటంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈగాలులు నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుడిని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు.
Updated Date - 2022-08-04T06:47:42+05:30 IST