పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు
ABN, First Publish Date - 2022-12-16T00:56:02+05:30
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీలు) సీసీ కెమెరాలను అమర్చారు. డాక్టర్లతో పాటు సిబ్బంది హాజరుపై ప్రతిరోజూ పరిశీలించడానికి వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అమరావతి నుంచి రాష్ట్రవైద్యశాఖ పర్యవేక్షణ
గంగాధరనెల్లూరు, డిసెంబరు 15: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీలు) సీసీ కెమెరాలను అమర్చారు. డాక్టర్లతో పాటు సిబ్బంది హాజరుపై ప్రతిరోజూ పరిశీలించడానికి వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే గంగాధరనెల్లూరు, తూగుండ్రం పీహెచ్‌సీలలో నెల కిందట ఓ కాంట్రాక్టర్‌కు చెందిన సిబ్బంది వచ్చి సీసీ కెమెరాలను బిగించారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ప్రధానంగా డాక్టర్లు, వివిధ స్థాయిల్లో పనిచేసే సిబ్బంది ఏ సమయానికి వస్తున్నారు? ఏ సమయానికి వెళ్తున్నారు? డ్యూటీలో ఉన్న సిబ్బంది మొత్తం యూనిఫామ్‌లో వస్తున్నారా లేదా, రోగులతో సిబ్బంది వ్యవహారశైలి ఎలా ఉంది? లేదంటే రోగులే డాక్టర్లతో పాటు వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారా వంటి విషయాలను అమరావతి నుంచే రాష్ట్రవైద్యశాఖ తరపున ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా వీటిని ఏర్పాటు చేశారు. ఈ సీసీ ఫుటేజీని స్థానికంగా పరిశీలించడానికి అవకాశం లేదు. అమరావతిలోని రాష్ట్ర వైద్యశాఖకు అనుసంధానించి ఉంటారు. వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయా పీహెచ్‌సీల్లో ఏం జరుగుతుంది? డాక్టర్లు, సిబ్బంది పనితీరుని పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Updated Date - 2022-12-16T00:56:05+05:30 IST