ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దగాపడ్డ చెరకు రైతు

ABN, First Publish Date - 2022-10-17T07:12:44+05:30

తమ ప్రభుత్వం వస్తే మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తామని ఎన్నికల సమయంలో జిల్లా రైతాంగాన్ని నమ్మించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వారిని వంచించారు.

గాజులమండ్యం షుగర్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరుతున్న అత్తూరు రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహకార చక్కెర ఫ్యాక్టరీలపై 

మాట తప్పిన సీఎం 

 జీవో 15 జారీతో ఫ్యాక్టరీలు 

తెరిచే అవకాశమే లేదు

 అప్పట్లో హడావిడి చేసిన వైసీపీ నేతలు నేడెక్కడ?

తమ ప్రభుత్వం వస్తే మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తామని ఎన్నికల సమయంలో  జిల్లా రైతాంగాన్ని నమ్మించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక వారిని వంచించారు. ఫ్యాక్టరీలు తెరిపించడానికంటూ కమిటీలతో హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతూ ఏడు నెలల కిందటే గుట్టుచప్పుడు కాకుండా జీవో ఎంఎస్‌ నెంబరు 15 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఇక ఫ్యాక్టరీలను తెరిచే అవకాశమే లేదు. ఈ సంగతి తెలియని చెరకు రైతులు ఇప్పటికీ  ఫ్యాక్టరీలు తెరుస్తారన్న ఆశతో నిరీక్షిస్తుండడమే అసలు విషాదం!

                 - తిరుపతి (తిలక్‌ రోడ్‌) 

చిత్తూరులో 1962లోనూ, రేణిగుంట మండలం గాజులమండ్యంలో 1978లోనూ ప్రారంభమైన చక్కెర ఫ్యాక్టరీలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సహకార రంగానికి తలమానికంగా నిలిచాయి. సామర్థ్యానికి మించిన చెరకు క్రషింగ్‌తో సుమారు 30వేల చెరకు రైతుల కుటుంబాల మనుగడకు ఆలంబనగా మారాయి. ఏటా రూ.కోట్ల లాభాలు కళ్ల చూశాయి. అయితే నిర్వహణపరమైన లోపాలతో క్రమేపీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడ్డాయి. చిత్తూరు ఫ్యాక్టరీని 2003-04లో అప్పటి ప్రభుత్వం బహిరంగ వేలంలో రూ.16 కోట్లకు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. రైతుల న్యాయపోరాటంతో విక్రయం రద్దయింది. 2004-05 క్రషింగ్‌ సీజన్‌లో తిరిగి ప్రారంభమైన ఫ్యాక్టరీలు రెండూ పదేళ్లపాటు నడిచాయి. మరోసారి ఆర్థిక సంక్షోభానికి లోనై తిరిగి మూతపడ్డాయి. రెండు ఫ్యాక్టరీల్లో రైతులకు చెరకు బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు మాత్రం అప్పటి నుంచి జీతభత్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫ్యాక్టరీల మూసివేతతో చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీలపై ఆధారపడాల్సి రావడంతో గిట్టుబాటు ధర లభించలేదు. దీంతో క్రమేపీ జిల్లాలో చెరకు పంట సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది.

 ప్రతిపక్షంలో జగన్‌ హామీలు.. వైసీపీ నేతల ఆందోళనలు

జిల్లాలో మూతపడిన చిత్తూరు, గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించాలని గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. రైతులకు, ఉద్యోగులకు మద్దతుగా ఫ్యాక్టరీల ఎదుట కూడా ఆందోళనలు నిర్వహించారు. ప్రత్యేకించి ప్రస్తుత మంత్రి రోజా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మఽధుసూదన్‌రెడ్డిలు అప్పట్లో ఈ ఆందోళన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. అదే విధంగా అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వై.ఎ్‌స.జగన్‌ జిల్లాలో చేపట్టిన తన పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ పలుచోట్ల ప్రజలకు బహిరంగ హామీలు గుప్పించారు. తాను అధికారంలోకి వస్తే మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తానని మాట ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక కమిటీల పేరిట హడావిడి

అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చిత్తూరు, గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీలతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు ఫ్యాక్టరీలను తెరిపించడం కోసం కమిటీలు వేసి హడావిడి చేసింది. 2020లో అధ్యయనానికి మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ చిత్తూరు, గాజులమండ్యం ఫ్యాక్టరీలను సందర్శించింది.  ఫ్యాక్టరీలు తెరుచుకున్నట్టేనంటూ జిల్లావ్యాప్తంగా చెరకు రైతుల్లోనూ, ఫ్యాక్టరీల ఉద్యోగుల్లోనూ సంబరం నెలకొంది. కానీ ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా బహిరంగంగా వెలువడలేదు. కొంత ఆలస్యమైనా ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయని జిల్లా రైతాంగం, ప్రజలు ఆశతో ఉండగా ప్రభుత్వంలో మాత్రం దానికి భిన్నంగా నిర్ణయాలు జరిగిపోయాయి. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా. మంత్రుల కమిటీ అధ్యయనం చేసి తీరా తేల్చింది ఏమిటంటే ఫ్యాక్టరీల పరిధిలో చెరకు సాగు గణనీయంగా తగ్గిపోయిందట. ఫ్యాక్టరీలను తెరిపించే పరిస్థితి లేదట. దానికి బదులు ఉద్యోగులకు వలంటరీ రిటైర్మెంట్‌ స్కీమ్‌ ప్రకటించి, వేతన బకాయిలు చెల్లించాలని సిఫారసు చేసింది. ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించడానికంటే వాటిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు వినియోగించుకోవాలని సూచించింది.



ఫ్యాక్టరీలు తెరిపించాలి: రైతుల డిమాండ్‌

ముఖ్యమంత్రి ఇచ్చిన మాటపై నిలబడాలని చెరకు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గాజులమండ్యం చక్కెర కర్మాగారాన్ని నమ్ముకుని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, నారాయణవనం, వడమాలపేట, పుత్తూరు, నగరి, కార్వేటినగరం ప్రాంతాల్లో పది వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేదని గుర్తు చేస్తున్నారు. ఫ్యాక్టరీల మూసివేతతో జిల్లావ్యాప్తంగా కేవలం 4,927 ఎకరాలకు చెరకు సాగు కుదించుకుపోయిందంటున్నారు. చెరకు సాగైన భూములు ఇపుడు పశువుల మేత భూములుగా, బీళ్లుగా, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారుతున్నాయని వాపోతున్నారు. తక్షణం ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలని జిల్లా రైతు నాయకుడు మాంగాటి గోపాల్‌రెడ్డి, రేణిగుంట మండలం అత్తూరుకు చెందిన చెరకు రైతులు దేవరాజులురెడ్డి, రామచంద్రారెడ్డి, నీలకంఠారెడ్డి తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు. 

జిల్లా రైతు నాయకుడు మాంగాటి గోపాల్‌రెడ్డి



రామచంద్రాపురం మండలంలోనే 1,650 ఎకరాల్లో చెరకు సాగు

రామచంద్రాపురం, అక్టోబరు 16: రామచంద్రాపురం మండలంలో 1,650 ఎకరాల్లో రైతులు చెరకు సాగు చేశారు. ప్రస్తుతం బలిజపల్లె, రాయలచెరువుకట్ట ప్రాంతాల్లో చెరకు కటింగ్‌ జరుగుతోంది. జిల్లాలో షుగర్‌ఫ్యాక్టరీలు లేకపోవడంతో తమిళనాడు రాష్ట్రం పల్లెపట్టు ప్రాంతానికి చెందిన ఫ్యాక్టరీలపై ఆధారపడాల్సి వస్తోంది. అంతదూరం చెరకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. 



గుట్టుచప్పుడు కాకుండా 

ఉద్యోగుల వీఆర్‌ఎ్‌సపై జీవో జారీ 

మంత్రుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 16న జీవో ఎంఎస్‌ నెంబరు 15 జారీ చేసింది. దాని ప్రకారం ఈ ఫ్యాక్టరీలు ఇక తెరిచే అవకాశమే లేదు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో పండే ఇతర పంట ఉత్పత్తులతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంటే దానికోసం ఈ ఫ్యాక్టరీలను వినియోగించుకోవాలని జీవోలో పేర్కొన్నారు. అలాగే వీఆర్‌ఎ్‌సకు అర్హులైన ఉద్యోగులకు వేతన బకాయిలు, ఇతర బెనిఫిట్స్‌ చెల్లింపుల కోసం రూ.105 కోట్లు కేటాయించారు. ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ వీఆర్‌ఎ్‌సకు అర్హులైన ఉద్యోగులకు వేతన బకాయిలు, ఇతర బెనిఫిట్స్‌ అందలేదు. ఈ విషయం అలా ఉంచితే ఫ్యాక్టరీలు తిరిగి తెరిపించే అవకాశం లేదని తేల్చేసిన జీవో ఎంఎస్‌ నెంబరు 15ను జారీ చేసిన సంగతి ఎక్కడా బయట పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. దీనిపై నోరు విప్పితే ఎక్కడ తమకు వేతన బకాయిలు కూడా రాకుండా పోతాయోనన్న భయంతో ఉద్యోగులున్నారు. మొత్తంమీద జిల్లాలో చెరకు రైతులకు నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను ప్రస్తుత సీఎం జగన్‌ సంబంధిత జీవో సాక్షిగా తుంగలో తొక్కారని, జిల్లా రైతుల్ని, ప్రజలను, ఫ్యాక్టరీల ఉద్యోగులను దారుణంగా వంచించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే చెరకు రైతులను దగా చేయడమేనని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Updated Date - 2022-10-17T07:12:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising