‘అమరావతి’ నేతలకు అపూర్వ స్వాగతం
ABN, First Publish Date - 2022-03-05T07:18:40+05:30
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 800రోజులకు పైగా నిరాఘాటంగా ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలకు తిరుపతిలో శుక్రవారం అపూర్వ స్వాగతం లభించింది.
తిరుపతి/తిరుమల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 800రోజులకు పైగా నిరాఘాటంగా ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలకు తిరుపతిలో శుక్రవారం అపూర్వ స్వాగతం లభించింది.అమరావతికి అనుకూలంగా హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుతో మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వెళ్లేందుకు అలిపిరికి చేరుకున్న జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావులకు టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మశ్రీవారి ప్రసాదాలను తినిపించగా టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. గోవింద నామస్మరణల మధ్య పాదాలమండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు.అమరావతి రైతుల పోరాట పటిమను అభినందించారు.ఎప్పటికైనా ధర్మం, సత్యం గెలిచితీరుతుందని నిరూపించారన్నారు.టీడీపీ నేతలు పులివర్తి నాని, నరసింహ యాదవ్, గాలి భానుప్రకాష్, జేడీ రాజశేఖర్, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ, చక్రాల ఉష, కృష్ణయాదవ్, చినబాబు, రుద్రకోటి సదాశివం, బ్యాంకు శాంతమ్మ, కుమారమ్మ, రాజయ్య ,సీపీఐ నేతలు రామానాయుడు, పెంచలయ్య, రాధాకృష్ణ ,జనసేన నేత హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజా రెడ్డి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.అనంతరం కాలినడకన తిరుమలకు బయల్దేరిన శివా రెడ్డి, తిరుపతిరావు సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.తిరుపతిరావు రాత్రి శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. శనివారం ఉదయం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దేవుడి కృపాకటాక్షాలతో న్యాయస్థానం ద్వారా విజయం చేకూరిన క్రమంలో మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చామన్నారు.అమరావతితో పాటు ఏపీని అభివృద్ధి చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితే ఏం చేయాలనే అంశంపై న్యాయనిపుణులతో కూర్చుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రజల విజయం: శివారెడ్డి
న్యాయస్థానంలో తుది తీర్పు వచ్చిన తర్వాత మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుంటామని గత ఏడాది డిసెంబరులో తిరుపతిలో సభ పెట్టినప్పుడే వేడుకున్నాం. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఫలితం దక్కింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల విజయంగా భావిస్తున్నాం. అమరావతి కోసం పోరాడిన ప్రజలందరికీ ధన్యవాదాలు.
అమరావతి అభివృద్ధితోనే రాష్ర్టాభివృద్ధి : గద్దె తిరుపతిరావు
151 సీట్లతో అధికారంలోకి వచ్చినా రాజ్యాంగానికి లోబడి పాలన చేయాల్సిందే. లేకుంటే ఇలాంటి చెంపదెబ్బలే తినాల్సి ఉంటుంది. అమరావతి అభివృద్ధితోనే రాష్ర్టాభివృద్ధి జరుగుతుందనే విషయం సీఎం తెలుసుకోవాలి. రాజు కన్నా మొండివాడు బలవంతుడన్న విషయం పాలకులు గుర్తుపెట్టుకోవాలి.
Updated Date - 2022-03-05T07:18:40+05:30 IST