మహనీయుడు పొట్టి శ్రీరాములు
ABN, First Publish Date - 2022-12-16T01:57:59+05:30
తెలుగు వారి ఉనికిని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఆత్మ బలిదానం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు.
చంద్రబాబు నివాళి
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తెలుగు వారి ఉనికిని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఆత్మ బలిదానం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. గురువారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ... ‘‘ఏపీని అన్ని విధాలా అగ్రగామిలా నిలిపినప్పుడే అమరజీవి త్యాగానికి సార్థకత. అందుకు మనమంతా కంకణబద్ధులై ఉందాం’’ అని పేర్కొన్నారు. కాగా పోరాటానికి మరో రూపమే పొట్టి శ్రీరాములు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓ ప్రకటన చేస్తూ... సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి అర్పించారు. కాగా, మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పార్టీ నేతలు బొండా ఉమ, వర్ల రామయ్య, అశోక్‌బాబు, రామకృష్ణ, పట్టాభి, మల్యాద్రి, డూండీ రాకేశ్, రఫీ, రవీంద్ర పూలమాలలేసి నివాళులర్పించారు.
జైల్లో అనంతబాబు..శిలాఫలకాలపై ఆయన పేర్లా: వర్ల
దళితుడైన డ్రైవరు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ఉంటే.. బయట శిలాఫలాకాలపై ఆయన పేర్లు వేస్తారా? అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆక్షేపించారు. అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఆపేస్తారా? అని ప్రశ్నించారు. అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వమే డిమాండ్ చేయాలని వర్ల రామయ్య ప్రకటనలో పేర్కొన్నారు.
Updated Date - 2022-12-16T01:58:00+05:30 IST