బొంకులెవరివి?
ABN, First Publish Date - 2022-12-31T03:04:05+05:30
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం 2014-19 మధ్య చెల్లించకుండా వదిలేసిన క్రాస్ సబ్సిడీ నిధుల బకాయిలను క్రమం తప్పకుండా జగన్ ప్రభుత్వం విడుదల
విద్యుత్ రాయితీలపై నాలుక మడత
రెండేళ్లుగా జమ చేయని జగన్ సర్కారు
కానీ, మొత్తం చెల్లిస్తున్నామంటున్న జగన్
డబ్బులన్నీ వచ్చేశాయని డిస్కమ్‌ల ప్రకటనలు
పైగా విపక్షాలు, మీడియాపై విమర్శలు
‘ఏఆర్ఆర్’లో వాస్తవాలు పూర్తి భిన్నం
సర్కారు బాకీ 3,172 కోట్లన్న డిస్కమ్‌లు
విద్యుత్ రాయితీలపై నాలుక మడత
మొత్తం చెల్లిస్తున్నామంటున్న జగన్
డబ్బులన్నీ వచ్చేశాయని డిస్కమ్‌ల ప్రకటనలు
‘ఏఆర్ఆర్’లో వాస్తవాలు పూర్తి భిన్నం
సర్కారు బాకీ 3,172 కోట్లన్న డిస్కమ్‌లు
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం 2014-19 మధ్య చెల్లించకుండా వదిలేసిన క్రాస్ సబ్సిడీ నిధుల బకాయిలను క్రమం తప్పకుండా జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోందని విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్) చెబుతున్నాయి. తాము వచ్చిన మూడేళ్లలో ఏటా ‘ఇచ్చేశాం’ అని సర్కారు అనగానే.. ‘వచ్చేశాయి’ అని రాజకీయ పక్షాల తరహాలో డిస్కమ్‌లు సెలవివ్వడం పరిపాటిగా మారింది. రాయితీలను సకాలంలోనే ప్రభుత్వం చెల్లిస్తున్నా.. యాగీ చేస్తున్నాయంటూ పత్రికలపైనా .. రాజకీయపక్షాలపైనా విమర్శల దాడి చేస్తున్నాయి. కానీ, వార్షిక వాస్తవ ఆదాయ నివేదిక (ఏఆర్ఆర్)లో మాత్రం ఇందుకు భిన్నమైన లెక్కలను డిస్కమ్‌లు బయటపెట్టాయి. సమాజంలోని వివిధ వర్గాలకు అందిస్తున్న విద్యుత్ రాయితీలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డిస్కమ్‌లకు జమ చేయనే లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇలా మొత్తం రూ.3171.53 కోట్లు బాకీ పడిందని తేల్చేసింది. నాయీబ్రాహ్మణులు నడుపుకొంటున్న సెలూన్ల సబ్సిడీ రూ.మూడు లక్షల మొత్తమూ ఇందులోనే ఉండటం గమనార్హం. ఇంకా... రైతులు, గృహ వినియోగదారులకు చెందిన రూ.2393.16 కోట్లు, ఎస్సీ కాలనీలకు రూ.387.75 కోట్లు, ఎస్టీ కాలనీలకు రూ.58.18 కోట్లు, ఆక్వా రైతుల సబ్సిడీ రూ.329.01 కోట్లు, పవర్‌లూమ్స్‌కు సంబంధించి రూ.2.35 కోట్లు, హ్యాండ్లూమ్స్కు చెందిన కేవలం లక్ష రూపాయలు, రోల్డుగోల్డు కవరింగ్‌కు సంబంధించి రూ.2.04 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
రైతులకు సబ్సిడీ చెల్లించరు..కానీ, ఖాతాల్లో డబ్బులు వేస్తారట!
ఏపీఈఆర్సీకి డిస్కమ్‌లు ప్రతిపాదించిన ఏఆర్‌ఆర్‌లలో రైతుల నుంచి నాయీబ్రాహ్మణుల వరకూ చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాలను ఎగవేసింది. రైతులకు ఏనెలకానెల ఉచిత విద్యుత్తు మొత్తాన్ని చెల్లించేస్తామంటూ జగన్ సర్కారు చెబుతూవస్తోంది. కానీ .. ప్రస్తుతం రైతులకు ఉచిత విద్యుత్తు పథకం కింద ఇస్తున్న విద్యుత్తు సబ్సిడీని ఏయేటికాయేడు జగన్ సర్కారు చెల్లించడం లేదని డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ వెల్లడిస్తోంది. ఉట్టికేగరలేనమ్మ స్వర్గానికేగినట్లుగా .. ఏటా 1475 కోట్ల రూపాయల వ్యవసాయ సబ్సిడీని సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం ప్రతినెలా రైతు ఖాతాల్లో కరెంటు బిల్లుల మొత్తాన్ని వేసేస్తామంటూ చెబుతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించాలంటే.. ముందస్తుగా ప్రభుత్వం మీటర్ల కొనుగోళ్లకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని, ఆ తర్వాతే టెండర్ల ప్రక్రియకు వెళ్లాలని ఈఆర్సీ స్పష్టంగా చెప్పింది. అయితే .. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకున్నా..డిస్కమ్‌లు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లను బిగించేందుకు టెండర్లను పిలిచేశాయి. ప్రభుత్వం నుంచి ఉచిత విద్యుత్తుకు సంబంధించిన నిధులను రాబట్టడంలో మౌనం దాల్చుతున్నాయి. అదే సమయంలో గృహ వినియోగదారుల నుంచి మీటర్ల ధరను వసూలుచేసేందుకు సిద్ధమైంది.
Updated Date - 2022-12-31T03:04:06+05:30 IST