వడ్డీ రివర్స్!
ABN, First Publish Date - 2022-03-09T08:31:59+05:30
బహిరంగ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ పరపతి ఘోరంగా పడిపోయింది. ఈ విడత మంగళవారం అప్పుపై ఏకంగా రికార్డు..
ఏకంగా 7.48% వడ్డీకి
వెయ్యి కోట్ల అప్పు
ఒకప్పుడు అన్ని రాష్ట్రాల
కంటే తక్కువ వడ్డీ
నేడు ఈశాన్య
రాష్ట్రాల కంటే ఎక్కువ
జీఎ్‌సడీపీలో 70
శాతానికి చేరిన అప్పులు
తాజాగా ‘ఉమ్మడి’లో
మిగులు రుణాలకు
అనుమతి కోరుతున్న
జగన్ సర్కారు
ఘోరంగా పడిపోయిన రుణ పరపతిఅమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ పరపతి ఘోరంగా పడిపోయింది. ఈ విడత మంగళవారం అప్పుపై ఏకంగా రికార్డు స్థాయిలో 7.48 శాతం వడ్డీ అమలవడం చూస్తుంటే జగన్ ప్రభుత్వ అప్పుల దాహం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఒకప్పుడు బహిరంగ మార్కెట్లో వడ్డీ రేటు కంటే మన రాష్ట్రానికి ఒక శాతం తక్కువ వడ్డీకి అప్పు దొరికేది. అన్ని రాష్ట్రాల్లోకీ మనకు వచ్చే వడ్డీరేటే చాలా తక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు చాలా మంగళవారాల్లో ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలైన హరియాణా కంటే ఎక్కువ వడ్డీకి ఆంధ్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటోంది. హరియాణా 19ఏళ్ల కాలపరిమితితో రూ.1,000కోట్ల అప్పు తీసుకుంది. దీనిపై 7.43 శాతం వడ్డీ అమలైంది. అదే మనరాష్ట్రం 16ఏళ్ల కాలపరిమితిలో తీసుకున్న రూ.1,000కోట్ల రుణానికి 7.48 శాతం వడ్డీ అమలైంది. కాలపరిమితి తగ్గితే వడ్డీ తగ్గాలి గానీ.. మన విషయంలో రివర్స్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2005 నుంచి 2014 మధ్య కాలంలో రూ.26,830 కోట్ల అప్పునకు అనుమతి ఉన్నప్పటికీ వాడుకోలేదు. ఇప్పుడు ఆ మొత్తం అప్పుగా తెచ్చుకునేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరడం విస్మయం కలిగిస్తోంది. జనవరి 3న ప్రధాని మోదీకి ఆయన సమర్పించిన వినతిపత్రంలో ఈ అంశం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఈ మిగులు అప్పునే కోరుతున్నారు. వాస్తవానికి కేంద్రం రాష్ట్రాలకు ఏ సంవత్సరం అనుమతిచ్చిన అప్పులను ఆ సంవత్సరమే తెచ్చుకోవాలన్నది అందరికీ తెలిసిన నిబంధన. ఒకవేళ అనుమతి వచ్చిన మొత్తాన్ని అప్పుగా తీసుకోలేదంటే అది ఆ రాష్ట్ర ఆర్థిక నిర్వహణ గొప్పతనం. కానీ మరుసటి ఏడాది అవసరం ఉందంటూ.. గతంలో తీసుకోని అప్పును కొత్తగా అనుమతించాలని అడగడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం గొప్పతనాన్ని లెక్కలతో బయటకు తీసి మిగులు అప్పు రూ.26,380 కోట్లకు అనుమతివ్వాలని జగన్ కేంద్రాన్ని కోరడం చూస్తుంటే అప్పుల కోసం రాష్ట్రం ఎంతగా తహతహలాడుతోందో అర్థమవుతోంది.
ఆ 2 వేల కోట్లూ ఆర్‌బీఐకే జమ
మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించిన రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఏపీ రూ.2,000 కోట్లు కొత్తగా అప్పు తెచ్చింది. కానీ అది రాష్ట్ర ఖజానాకు జమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వం రూ.2,800 కోట్ల వేజ్ అండ్ మీన్స్ అప్పులో ఉంది. ఆ రూ.2,000 కోట్లను ఆర్‌బీఐ జమ చేసుకోగా.. ఇంకా రూ.800 కోట్లు బకాయి ఉంటుంది. కాగా.. ఈ రూ.2,000 కోట్లతో కలిపి 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 8 నాటికి కేంద్రం ఆమోదంతో రాష్ట్రం తెచ్చిన అప్పులు రూ.46,000 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.1,000 కోట్ల అప్పు కాలపరిమితి 20 ఏళ్లు కాగా.. దీనిపై 7.31 శాతం వడ్డీ రేటు అమలైంది. మరో రూ.1,000 కోట్ల అప్పు కాలపరిమితి 16 ఏళ్లు. దీనిపై వడ్డీరేటు ఏ కంగా 7.48 శాతం అమలైంది.
నిబంధనలున్నా అప్పులకు అనుమతి..
ప్రస్తుతం రాష్ట్రానికి పబ్లిక్ డెట్, కార్పొరేషన్ల అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి అప్పు రూ.7 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్ల పరిధిలో ఉంది. అంటే రాష్ట్రం అప్పు జీఎ్‌సడీపీలో 70శాతానికి చేరుకుంది. కేంద్రం పెట్టిన నిబంధనల ప్రకారం ఏ సంవత్సరం చూసినా రాష్ట్రం మొత్తం అప్పు ఆ ఏడాది జీఎ్‌సడీపీలో 25 శాతానికి మించకూడదు. 2015లో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి కేంద్రం సవరణ చేసింది. అన్ని రాష్ట్రాల అప్పు దేశ జీడీపీలో 20 శాతానికి మించకూడదు. కేంద్రం అప్పు 40శాతానికి మించకూడదు. ప్రస్తుతం అధికారుల కార్ల అద్దెలు, కార్యాలయాల నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది. వచ్చే ఆదాయం అప్పులు, వడ్డీల చెల్లింపులకే సరిపోవడం లేదు. తెస్తున్న అప్పులు ఎటు పోతున్నాయో తెలీదు. ఆర్థికంగా ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా కేంద్రం నిబంధనలు పక్కనపెట్టి.. రాష్ట్రానికి యఽథేచ్ఛగా అప్పులకు అనుమతులు ఇస్తూ వస్తోంది.
Updated Date - 2022-03-09T08:31:59+05:30 IST