జాస్తి నాగభూషణ్ అవుట్!
ABN, First Publish Date - 2022-03-05T07:48:31+05:30
ఏరికోరి తెచ్చుకున్నారు.. అందలమెక్కించారు.. అవసరం తీరిపోయిందో ఏమో ఇంటికి పంపించేశారు. రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ జాస్తి నాగభూషణం(ణ్) తన పదవికి శుక్రవారం రాజీనామా ...
అదనపు అడ్వకేట్ జనరల్‌గా రాజీనామా
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఏరికోరి తెచ్చుకున్నారు.. అందలమెక్కించారు.. అవసరం తీరిపోయిందో ఏమో ఇంటికి పంపించేశారు. రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ జాస్తి నాగభూషణం(ణ్) తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈయన విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు. జస్టిస్ చలమేశ్వర్‌తో సీఎం జగన్మోహన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం.. ఒకరికొకరు అవసరం అన్న భావనతో ఆయన కుమారుడి కోసం.. లేని పోస్టు కొత్తగా సృష్టించి మరీ ఇచ్చారు. అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరాం, అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అప్పటికే ఉన్నారు. అయినప్పటికీ.. అంత ప్రతిభావంతుడైన న్యాయవాది కానప్పటికీ.. నాగభూషణ్‌ను రెండో ఏఏజీగా నియమించారు. 2020 డిసెంబరు 9న ఆయన బాధ్యతలు స్వీకరించారు. మొదట్లో ఆయన ఢిల్లీలో జగన్ ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెట్టే కోర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కమిటీతో పాటు ప్రత్యేక విమానంలో రాకపోకలు సాగించేవారు.
సీఎం కార్యాలయానికి నేరుగా వెళ్లగలిగేంత ప్రాధాన్యం పొందారు. అనంతరం ఆయనతో అవసరాలు తీరాయనుకుని క్రమంగా పక్కనబెడుతూ.. నెమ్మదిగా తెరమరుగు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కూడా ఆయనకు ప్రవేశం లేదని తెలిసింది. దీనిపై నాగభూషణ్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ఆయన ఇటీవలి కాలంలో కోర్టుల్లోనూ కనపడడం లేదు. ఇది అవమానకరంగా భావించారని.. పనిలేనప్పుడు ఏఏజీ పదవిలో కొనసాగడం శ్రేయస్కరం కాదనే రాజీనామా చేశారని సమాచారం.
Updated Date - 2022-03-05T07:48:31+05:30 IST