పోలవరం భారమంతా కేంద్రానిదే!
ABN, First Publish Date - 2022-03-05T07:45:52+05:30
రాష్ట్ర విభజన చట్టంలో చెప్పి న ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి పనినీ పూర్తి చేస్తామని..
ఏ అవసరమొచ్చినా
రాష్ట్రానికి సహకరిస్తాం
ప్రధాని మాటగా చెబుతున్నా
నిర్వాసితులను తరలిస్తే చాలదు
చిన్న పిల్లల్లా చూసుకోవాలి
జీవనోపాధి మెరుగుపరచాలి
కాలనీలపై నెలవారీ కార్యాచరణ
ఇక 15 రోజులకొకసారి సమీక్ష
కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్
జలశక్తి మంత్రి షెకావత్ స్పష్టీకరణ
ఖర్చు చేసిన 850 కోట్లు ఇవ్వండి
సీఎం జగన్మోహన్రెడ్డి అభ్యర్థన
రాజమహేంద్రవరం/ఏలూరు/జంగారెడ్డిగూడెం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో చెప్పి న ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి పనినీ పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు కలసి ప్రాజెక్టును పూర్తిచేస్తాయని.. కానీ భారమం తా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాని కి ఏ అవసరం వచ్చినా సహకరిస్తామని.. ఇది ప్రధాని మోదీ మాటగా చెబుతున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు-1 పునరావాస కాలనీ, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెంలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని, వేలేరుపాడు మండలం కొవ్వాడకు చెందిన లక్ష్మీకాంతం, వెంకటస్వామి నిర్మించుకున్న ఆర్అండ్ఆర్ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో షెకావత్ మాట్లాడారు. అనంత రం ప్రాజెక్టు పనులు, డిజైన్లపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ‘కొందరు నిర్వాసితులు చెప్పిన బాధలు విన్నాను. జీవనోపాధి లేదని చెప్పారు. దీని గురించి ఈ వేదిక మీదే సీఎం జగన్, నేనూ మాట్లాడుకున్నాం. వారికి ఏదైనా చేయాలనుకున్నాం. వారి జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచాలి. యాభై ఏళ్లో, వందేళ్లో వయసున్న ఓ చెట్టును టెక్నాలజీని ఉపయోగించి, మరోచోట పాతిపెడితే అది కచ్చితంగా బతుకుతుందనే గ్యారెంటీ లేదు. అలాగే పోలవరం గ్రామాల్లో అనేక ఏళ్లుగా జీవించి, ఆ ప్రాంతంతో మమేకమైన ప్రజలను ఆ ఊరి నుంచి పునరావాస కాలనీలకు తీసుకొచ్చేసి మన పని అయిపోయిందనుకోవడం సరికాదు. వాళ్ల ఇబ్బందులు తెలుసుకోవాలి. చిన్నపిల్లలను చూసినట్లు చూడాలి. నేను మళ్లీ వస్తాను. మరిన్ని కాలనీలు పరిశీలిస్తాను. వాటిలో అన్ని సౌకర్యాలూ ఉండాలి. అం దరూ అభివృద్ధి చెందాలి.. అందరూ ఆనందంగా ఉం డాలి.. అందరూ కలసికట్టుగా దేశం కోసం పనిచేయా లి. ఇదే ప్రధాని చెప్పేమాట’ అని స్పష్టం చేశారు. పోలవరం భారం మొత్తం కేంద్రమే భరిస్తుందని మోదీ కమిట్ అయ్యారని.. ఆయన్ను సీఎం కలిసి సుదీ ర్ఘ చర్చలు జరిపారని తెలిపారు. ఈ క్రమంలోనే కేం ద్రం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయని చెప్పారు.
పరిహారం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే..
పోలవరం ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించడంపై నిర్దిష్ట కార్యాచరణ రూపొందించుకోవాలని షెకావత్ అధికారులకు సూచించారు. నెలవారీ కార్యాచరణతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), జలశక్తి శాఖ వారం వారం ప్రగతి నివేదికలు సమర్పించాలని సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ముంపు బాధితులందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీ టీ) పథకం ద్వారా పరిహారం అందించాలన్నారు. పీపీ ఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని నిర్దేశించారు. పనుల పురోగతిపై వచ్చే మూడు నెలలపాటు ప్రతి 15 రోజులకోసారి సమీక్ష చేస్తామని, అధికారులు విధిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
ఇచ్చిన మాట గుర్తుంది: సీఎం
‘పోలవరం నిర్వాసితులకు నేనిచ్చినమాట గుర్తుం ది. కేంద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6.8 లక్షలు ఇస్తుంటే దానికి అదనంగా మరో రూ.3.2 లక్షలు ఇచ్చి రూ.10 లక్షలు వచ్చేలా చేస్తానని మాటిచ్చాను. కచ్చితంగా నెరవేరుస్తాను. అంతేకాదు.. 2006లో నాన్నగారు(వైఎస్) అప్పటి ధరలను బట్టి ఎకరం రూ.1.25 లక్ష లు, రూ.1.50 లక్షలకు భూమిని సేకరించారు. అది బాగా తక్కువని.. 5 లక్షలు వచ్చేలా చేస్తానన్నాను. దీనినీ నెరవేరుస్తా’ అని సీఎం స్పష్టంచేశారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి జీవనాడి అవుతుందని చెప్పారు. ‘ఉపాధి కోసం ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయి. కేం ద్ర మంత్రితో మాట్లాడాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్యాచరణ చేసి జీవనోపాధి పెంచే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని తెలిపారు. అధికారులతో సమీక్ష సందర్భంగా కేంద్ర మంత్రి ఎదుట పలు విన్నపాలు చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55,548.87 కోట్లకు ఖరారు చేయాలని అభ్యర్థించారు. తాగునీటి కాంపోనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలన్నా రు. కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ వారీగా రీయింబర్స్ చేస్తోందని.. ఇది సహేతుకం కాదన్నారు. చేసిన పనులకు బిల్లులను కూడా పీపీఏ అప్లోడ్ చేయడం లేదని.. రూ.859.59 కోట్ల బిల్లులను తిరస్కరించిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణా న్ని ఓ కాంపోనెంట్గా తీసుకుని, ప్రతి 15 రోజులకొకసారి బిల్లులు చెల్లించాలని.. దీనివల్ల తగినంత నగదు అందుబాటులో ఉంటుందన్నారు. డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని కోరారు. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని, ముంపు బాధితులకు నష్టపరి హారాన్ని డీబీటీ పద్ధతిలో చెల్లించాలని సూచించారు.
అంచనాలపై స్పష్టతివ్వని షెకావత్
పోలవరం డిజైన్లపై పది రోజుల్లో సమీక్ష
అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్సు ఇవ్వాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి అభ్యర్థనపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. శుక్రవారం అధికారులతో సమీక్ష సందర్భంగా ప్రాజెక్టును 150 మీటర్ల ఎత్తులో 45.72 కాంటూరు మేరకు (నిల్వ 194 టీఎంసీలు) పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులో కీలక పనులకు సంబంధించిన డిజైన్లను ఆమోదించేందుకు ఈ నెల 7వ తేదీన తన శాఖ సలహాదారుతో, ఈ నెల 14 లేదా 15న నేరుగా షెకావత్ సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధుల రీయింబర్స్‌కు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
Updated Date - 2022-03-05T07:45:52+05:30 IST