ఒక్క పాత్రను చూపి నాటకం నిషేధమా?
ABN, First Publish Date - 2022-02-03T08:37:38+05:30
చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది.....
చింతామణి నాటకానికి వందేళ్ల చరిత్ర ఉంది.. రాత్రికి రాత్రి ఎలా నిషేధిస్తారు
దానికి ఆధారమైన పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదు?.. హైకోర్టు ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు.. విచారణ 8కి వాయిదా
చింతామణి నాటకానికి వందేళ్ల చరిత్ర ఉంది
రాత్రికి రాత్రి ఎలా నిషేధిస్తారు..హైకోర్టు ఆగ్రహం
భుత్వానికి నోటీసులు.. విచారణ 8కి వాయిదా
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. సుబ్బిశెట్టి పాత్రపై అభ్యంతరాలుంటే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి తప్ప మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా వ్యాఖ్యానించింది. నాటకానికి ఆధారమైన పుస్తకాన్ని నిషేధించనప్పుడు నాటక ప్రదర్శనను ఎలా నిషేధిస్తారని ప్రశ్నించింది. వందేళ్లుగా కొనసాగుతున్న నాటక ప్రదర్శనను రాత్రికి రాత్రి ఎలా నిషేధిస్తారని నిలదీసింది. వినతుల ఆధారంగా నిషేధించుకుంటూ పోతే ఏ నాటకాలు, సినిమాలూ మిగలవని పేర్కొంది. ప్రదర్శనను ఏ కారణంతో నిషేధించారో ఉత్తర్వుల్లో పేర్కొనలేదని, ఏ వినతి ఆధారంగా నిషేధం విధించారో ఆ వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ సీఈవో, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడికి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
సుబ్బిశెట్టి పాత్ర వల్ల నిషేధం సరికాదు..
చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 17న ఇచ్చిన జీవోని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమే్‌షచంద్ర వాదనలు వినిపిస్తూ.. వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్త కాళ్లకూరి నారాయణరావు చింతామని నాటకాన్ని రచించారన్నారు. నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది సుభాష్ వాదనలు వినిపిస్తూ.. పుస్తకంలో ఉన్న కథనం ఆధారంగా నాటక ప్రదర్శన సాగడం లేదని, సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి వచ్చిన వినతుల ఆధారంగా నాటక ప్రదర్శనపై నిషేధం విధించామన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ తరఫున న్యాయవాది మనోహర్ రెడ్డి.. తమ వినతి ఆధారంగానే నిషేధం విధించారన్నారు. మరోవైపు ఇదే వ్యహారంపై కళాకారుడు ఏ త్రినాథ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు బుధవారం విచారణ జరిపారు. న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు కళాకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయన్నారు. విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పాత్రలు, సన్నివేశాల్లో ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని నిలువరించాలి తప్ప మొత్తం నాటకాన్ని నిషేధించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాది సుభాష్ వాదనలు వినిపిస్తూ.. నాటకాన్ని నిషేధించాలని కోరుతూ పలు వినతులు అందాయని చెప్పారు. ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం నాటకాన్ని నిషేధించేందుకు కారణమైన వినతులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
Updated Date - 2022-02-03T08:37:38+05:30 IST