ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిదే విజయం!

ABN, First Publish Date - 2022-03-04T08:17:14+05:30

అమరావతిదే విజయం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పునఃప్రతిష్ఠ చేసిన న్యాయస్థానం

రాజధానిని మార్చేందుకు వీల్లేదు

హైకోర్టు సంచలన తీర్పు

రైతులతో మీది చట్టబద్ధ ఒప్పందం

‘హామీ’లు నెరవేర్చి తీరాల్సిందే

నిర్మాణం కొనసాగించాల్సిందే

నెలలో మౌలిక సదుపాయాల కల్పన

మూడు నెలల్లో రైతుల ప్లాట్ల అభివృద్ధి

ఆరు నెలల్లో రాజధాని పూర్తి కావాలి

పురోగతి ఎప్పటికప్పుడు చెప్పండి

ఆ భూములు రాజధాని కోసమే

తాకట్టు పెట్టొద్దు, ఇతరులకు ఇవ్వొద్దు

హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశం


‘అమరావతికి జయము’ ఇది న్యాయ దేవత పలికిన మాట!  వైసీపీ సర్కారుకూ, అమరావతికీ జరిగిన న్యాయ పోరాటంలో... అమరావతినే విజయం వరించింది. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్న రాజధాని రైతులకు అతి పెద్ద ఊరట లభించింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని... రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధ ఒప్పందం ప్రకారం వారికి కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయించి ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ సర్కారు రాగానే మూలన పడిన అమరావతికి మళ్లీ ప్రాణం పోసింది. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి పిటిషన్లపై గురువారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం 307 పేజీల తీర్పులో... అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికీ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే)కూ స్పష్టమైన, నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 


చేసి తీరాల్సిందే...

 రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు అమరావతి రాజధాని నగరాన్ని ఆరు నెలల్లో నిర్మించాలని, మొత్తం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించింది. సీఆర్డీయే చట్టంలోని సెక్షన్‌ 58 ప్రకారం...  అమరావతి నగరం, రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. ఈ పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సీఆర్డీయే చట్టంలోని సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ ప్లానింగ్‌ పథకం కింద... మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్న ‘నవ నగరాల’ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. భూములకు బదులుగా ఇచ్చిన ప్లాట్లలో నిర్మాణాలకు వీలుగా... అప్రోచ్‌ రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ తదితర సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. తీర్పు ఇచ్చిన తేదీ నాటి నుంచి మూడు నెలల్లోపు అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించాలని సీఆర్డీయేకు, ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అంతేకాదు... నిర్దిష్టంగా అమరావతి కేసుకు సంబంధించి రాజధానిని తరలిస్తూ శాసనాలు చేసే అధికారం శాసనసభకూ లేదని సంచలన తీర్పు వెలువరించింది. పార్లమెంటు చేసిన రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనల మేరకు... ప్రధాన అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను తరలించడం కుదరదని పేర్కొంది. అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను... రాజధాని నగరం నిర్మాణం, ఆ ప్రాంత అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని తేల్చి చెప్పింది. ఈ భూములను ఇతరులకు అప్పగించడం, తనఖా పెట్టడం, థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించడం కుదరదని స్పష్టం చేసింది. రైతులకు ఇచ్చిన హామీలకు సంబంధించి... భూసమీకరణ నిబంధనల్లోని షెడ్యూల్‌ 2, 3 కింద పొందుపర్చిన విధులన్నింటినీ నిర్వర్తించాలని సీఆర్డీయేను ఆదేశించింది. అంతేకాదు... పనుల పురోగతిపై సీఆర్డీయే, ప్రభుత్వం వేర్వేరుగా ఎప్పటికప్పుడు అఫిడవిట్‌లో రూపంలో కోర్టుకు నివేదించాలని తెలిపింది. రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలను తరలించరాదంటూ... దీనిపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు తీసుకున్నందున సంబంధిత వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. 


ఆ ఒప్పందానికి చట్టబద్ధత... 

రైతులు, ఏపీసీఆర్డీయేకు మధ్య జరిగిన ఒప్పందానికి చట్టబద్ధత ఉందని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. అందులోని నియమ నిబంధనలను ప్రభుత్వం, సీఆర్‌డీయే ఉల్లంఘిస్తే 226 అధికరణ ప్రకారం జోక్యం చేసుకొని తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని  నిలబెట్టుకోవడంలో విఫలమైనప్పుడు, పిటిషనర్ల చట్టబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చనప్పుడు... ఒప్పందాల అమలు విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని తెలిపింది. ప్రభుత్వ మారగానే విధానాలు మారకూడదని పేర్కొంది. రాజ్యాంగ, చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప... గత ప్రభుత్వం చేపట్టిన పనులను పూర్తి చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. 


ఖర్చులు చెల్లించండి

సీఆర్డీయే రద్దు, మూడు రాజధానుల బిల్లులను సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన అమరావతి రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుతోపాటు మరో 16మందికి రూ.50వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమరావతి మాస్టర్‌  ప్లాన్‌ను సీఆర్డీయే, రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను (సుమోటో) సవరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జీఎన్‌ రావు, హైపవర్‌ కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదికలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ... అవసరమైనప్పుడు సంబంధిత నివేదికలను సవాల్‌ చేస్తూ వ్యాజ్యాలు వేసేందుకు పిటిషనర్లకు స్వేచ్ఛనిచ్చింది.


‘మూడు’ చట్టాలు రద్దు చేసినా..


రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  సీఆర్‌డీయే రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలను సవాల్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులతోపాటు పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాలపై విచారణ జరుగుతుండగానే.... ఆ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అందువల్ల ఆ వ్యాజ్యాలు నిరర్ధకం అవుతాయని, వాటిపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే... తమ వ్యాజ్యాలలో కొన్ని అభ్యర్థనలు విచారణార్హత కలిగి ఉన్నాయని,  వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయడంతోపాటు, భూసమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన  రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. మూడు రాజధానులకు ఆధారమైన కమిటీ నివేదికలు రద్దు చేయాలని, రాజధానిని మార్చే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని, రాష్ట్రపతి నోటిఫై చేయడం ద్వారా అమరావతిలో హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో దాని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని తెలిపారు. రాజధానిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఇరువైపులా వాదనలు ముగిసిన తర్వాత... ఫిబ్రవరి 4న త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించింది.


అమరావతి వ్యాజ్యాల్లో.. తేల్చిన పది అంశాలివే!

రాజధాని వ్యాజ్యాలలో తేల్చాల్సిన ‘పది అంశాల’ను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. తీర్పులో ఒక్కో అంశంపై పూర్తిస్థాయి వివరణ ఇస్తూ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. తొమ్మిది అంశాల విషయంలో పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. అవేమిటంటే...


అభివృద్ధి ఒప్పందం - తిరగదోడేందుకు వీల్లేని జనరల్‌ పవరాఫ్‌ అటార్నీ ఫారం ‘9.14’కు రాజ్యాంగ బద్ధత ఉందా? ఉంటే... అందులోని  నియమ నిబంధనలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?

నిర్ణయం: ఆ ఒప్పందానికి రాజ్యాంగ బద్ధత ఉంది. దానిని ప్రభుత్వం అమలు చేయాలి.


రాజధానికి భూములు ఇచ్చిన రైతుల చట్టబద్ధ ఆకాంక్షలను రాష్ట్రం దెబ్బతీస్తోందా? అదే నిజమైతే... ఆ చర్యలను చట్ట విరుద్ధమని, ఏకపక్షమని ప్రకటించవచ్చునా?

నిర్ణయం: అవును. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమే.


ఏపీసీఆర్‌డీఏ చట్టంలోని నియమ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర భూసమీకరణ పథకం రూల్స్‌ (2015)లో చేసిన చట్టబద్ధ వాగ్దానాన్ని ఉల్లంఘించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. ఈ చట్టబద్ధ  హామీలను నిలబెట్టుకునేలా ఆదేశాలు జారీచేయవచ్చా?

నిర్ణయం: ఔను. ఈ విషయంలో కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు.


అమరావతి రైతులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రసాదించిన జీవించే హక్కును.. ఆస్తులు కాపాడుకునేందుకు 300 (ఏ) అధికరణ ప్రసాదించిన హక్కును రాష్ట్రప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏ తమ చర్యల ద్వారా అతిక్రమించాయా?

నిర్ణయం: ఔను.

ప్రభుత్వం మారినంత మాత్రాన విధానం మార్చవచ్చా? ఇదివరకటి ప్రభుత్వం చేపట్టిన రాజధాని ప్రాజెక్టులను కొనసాగించాల్సిన బాధ్యత.. తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఉందా.. లేదా?


నిర్ణయం: చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమైతే మినహా... పాత ప్రభుత్వ విధానాలను కొత్త ప్రభుత్వం మార్చకూడదు.


రాజధాని ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏ వదిలేశాయా? మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో అవి విఫలమయ్యాయా? తద్వారా ఏపీసీఆర్‌డీఏ, భూసమీకరణ పథకం నిబంధనల్లో పేర్కొన్న రైతుల హక్కులను అవి ఉల్లంఘించాయా?

నిర్ణయం: ఔను.


స్థానిక పాలనా సంస్థలు (పంచాయతీ/మునిసిపాలిటీ/కార్పొరేషన్‌) కోరకుండానే.. మాస్టర్‌ ప్లాన్‌ను సవరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందా?

నిర్ణయం: లేదు.


పైఅంశాలన్నిటినీ నిర్ణయించేటప్పుడు.. రాజ్యాంగంలోని 226వ అధికరణ ప్రకారం హైకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి.. నిరంతరాయంగా కొనసాగేలా రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ (రాష్ట్రప్రభుత్వం తన అధికార విధులను సముచిత రీతిలో నిర్వహించాలని ఆదేశించడం)ను జారీ చేయాలా?

నిర్ణయం: చేయవచ్చు.


అలాగే కేటీ రవీంద్రన్‌ కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు, హైపవర్డ్‌ కమిటీలు సమర్పించిన చట్టబద్ధంగాని నివేదికలను చట్టవిరుద్ధం, ఏకపక్షమైనవిగా ప్రకటించవచ్చా?

నిర్ణయం: ఈ నివేదికలను సవాలు చేస్తూ విడిగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవచ్చు.


రాజధానిని, హైకోర్టును ఏపీసీఆర్‌డీఏలోని మూడో సెక్షన్‌లో పేర్కొన్న రాజధాని ప్రాంతంలో గాకుండా.. వేరే ప్రాంతానికి తరలించేలా చట్టం చేసే అధికారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉందా.. లేదా?

నిర్ణయం: ఆ అధికారం ప్రభుత్వానికి లేదు.

Updated Date - 2022-03-04T08:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising