రైతులకు సున్నా వడ్డీ
ABN, First Publish Date - 2022-12-16T23:49:30+05:30
కరువు రైతుకు సున్నా వడ్డీ పథకం అరకొరగా వర్తింపజేస్తున్నారు. నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నారు. పలు రకాల కొత్త నిబంధనల మూలంగా సకాలంలో పంట రుణం చెల్లించినా సున్నా వడ్డీకి అర్హత లేకుండా పోతోంది.
చాలా మందికి అందని సున్నా వడ్డీ
నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్య కుదింపు
టీడీపీ పాలన నాటి పావలా వడ్డీ పథకం బంద్
నష్టపోతున్న అన్నదాతలు
అనంతపురం అర్బన : కరువు రైతుకు సున్నా వడ్డీ పథకం అరకొరగా వర్తింపజేస్తున్నారు. నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నారు. పలు రకాల కొత్త నిబంధనల మూలంగా సకాలంలో పంట రుణం చెల్లించినా సున్నా వడ్డీకి అర్హత లేకుండా పోతోంది. తద్వారా వేలాది మంది రైతులు ప్రభుత్వ సాయానికి దూరమవ్వాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
పావలా వడ్డీ పథకం బంద్
టీడీపీ హయాంలో బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న రైతులకు పావలా వడ్డీ పథకం వర్తింపజేస్తూ వచ్చారు. అప్పట్లో బ్యాంకుల్లో రూ.3లక్షల దాకా రుణం తీసుకున్న రైతులకు కూడా పావలా వడ్డీని వర్తింపజేశారు. తద్వారా ఎక్కువ శాతం మంది రైతులకు పావలా వడ్డీ వర్తించేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పావలా వడ్డీ పథకాన్ని బంద్ చేసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
ఏడాదికేడాదికీ లబ్ధిదారుల సంఖ్య కుదింపు
సున్నావడ్డీ పథకం ఆరంభించిన సంవత్సరం నుంచి ప్రతి ఏడాదికీ లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తూనే ఉన్నారు. ఏ పంటపై రుణం తీసుకున్నారో అదే పంటను సాగు చేసినప్పటికీ ఈ క్రాపింగ్‌లో పంటల నమోదులో తేడాలు ఉండటంతో అర్హులైన రైతులకు సున్నా వడ్డీ వర్తించడం లేదు. ఇలా పలు రకాల కారణాలతో ప్రతిఏడాది లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తూ వస్తుండటం గమనార్హం. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2109 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజనల్లో 143237మందికి సున్నా వడ్డీ వర్తింపజేయగా, 2020 సంవత్సరంలో 56577మందికి వర్తింపజేశారు. అసలే అరకొరగా సున్నా వడ్డీ ఇస్తుంటే అందులోను కో తలు వేయడం ఏమిటని రైతులు వాపోతున్నారు.
సున్నా వడ్డీ పథకంలో కోతలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టారు. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు నిర్దేశించిన గడువులోగా తిరిగి రుణం చెల్లిస్తే సున్నా వడ్డీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఓ మెలిక పెట్టింది. రూ.లక్ష దాకా రుణం తీసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పథకాన్ని వర్తించేలా షరతు పెట్టారు. జిల్లాలో ఖరీఫ్ సీజనలో ఎక్కువ శాతం రైతులు వేరుశన గ పం ట సాగుకు రుణం తీసుకుంటున్నారు. రబీ సీజనలో పప్పుశనగ, ఇతర రకాల పంటల కు తీసుకుంటున్నా రు. వేరుశనగకు ఎకరాకు రూ.30వేలకుపైగానే పంట రుణం ఇస్తున్నారు. ప్రతి ఏడాది నిర్దేశించిన గడువులోగా సక్రమంగా రుణం చెల్లించే రైతులకు బ్యాంకర్లు రైతులు అడిగిన మేరకు రుణం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడున్నర ఎకరాలున్న రైతులకు రూ.లక్షకుపైగానే పంట రుణం అందుతోంది. ప్రభుత్వం కొత్త నిబంధనల మేరకు రూ.లక్షకుపైగా రుణం తీసుకుంటే సున్నా వడ్డీ వర్తింపజేయడం లేదు. దీంతో లక్షలాది మంది రైతులు సున్నా వడ్డీకి దూరమవుతున్నారు.
Updated Date - 2022-12-16T23:49:31+05:30 IST