సోములదొడ్డిలో ఎకరం భూమి స్వాహా
ABN, First Publish Date - 2022-04-04T05:30:00+05:30
అది ప్రభుత్వ భూమి. ఎస్సీ కులానికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. కానీ లబ్ధిదారుడు తనకు అవసరం లేదని రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించాడు.
కన్నేశాడు.. కాజేశాడు..!
2017లో ఒకరి పేరిట ప్రభుత్వ పట్టా
వద్దని తిరిగి ఇచ్చేసిన లబ్ధిదారు
ఇంటి స్థలాలు
కేటాయించిన అధికారులు
అదను చూసి.. అమ్మేసిన ఓ నాయకుడు
అది ప్రభుత్వ భూమి. ఎస్సీ కులానికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. కానీ లబ్ధిదారుడు తనకు అవసరం లేదని రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించాడు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో కొందరికి పట్టాలు మంజూరు చేశారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. అధికారం చేతులు మారింది. ఆ భూమిపై స్థానిక నాయకుడి కన్నుపడింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని, కొందరు ప్రజా ప్రతినిధుల పేర్లను ఉపయోగించుకుని, భూమిని కాజేసేందుకు పావులు కదిపాడు. ప్రభుత్వ భూమిని రిజిస్టర్ చేయించుకున్నాడు. రెవెన్యూ రికార్డులను మార్పించేశాడు. ఆ తరువాత రూ.కోట్లకు అమ్మేశాడు. విషయం తెలియగానే పట్టాలు పొందిన వారు లబోదిబో మంటున్నారు.
అనంతపురం రూరల్ : మండల పరిధిలోని సోములదొడ్డి గ్రామ సర్వే నెంబరు 131-3లో 2.02 ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్ల కిందట పెద్దన్న అనే వ్యక్తి దీన్ని అధికారులు కేటాయించారు. అందులో సగం బెంగళూరు-హైదరాబాదు రోడ్డు విస్తరణలో పోయింది. మిగిలిన భూమిని పట్టాదారు రెవెన్యూ అధికారులకు తిరిగి ఇచ్చేశాడు. తనకు అవసరం లేదని చెప్పేశాడు. ఈ క్రమంలోనే 2017లో మిగిలిన భూమిలో కొంత మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. అయితే గృహ నిర్మాణానికి భూమి అనువుగా లేనందున, ఒకరిద్దరు మినహా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోలేదు. ఇంతలోనే ప్రభుత్వం మారింది. ఆ భూమిపై స్థానిక అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. అప్పటికే భూమిని రెవెన్యూ అధికారులకు తిరిగి ఇచ్చేసిన పట్టాదారుడు మృతి చెందాడు.
స్కెచ వేసి..
ప్రభుత్వ భూమిని ఎలాగైనా కాజేయాలని ఆ నాయకుడు పక్కా స్కెచ వేశాడు. భూమిని తిరిగి ఇచ్చేసిన పెద్దన్న కుటుంబ సభ్యులను సంప్రదించాడు. ‘ఆ సర్వే నెంబరులోని భూమిని మీకు తిరిగి ఇప్పిస్తాను. అందుకు కొంత భూమిని నాకు ఇవ్వాలి..’ అని బేరం పెట్టాడు. ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడి నుంచి తన ప్లాన అమలు చేశాడు. ఆ కుటుంబ సభ్యులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే పట్టాగా ఇచ్చిన భూమిలో ఓ ఎకరాన్ని 2020 సెప్టెంబరు 21న తన పేరిట రిజిస్ట్రేషన చేయించుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 9న తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న భూమిలో 50 సెంట్లు ఇతరులకు విక్రయించి, రిజస్టర్ చేసిచ్చాడు. మరో 50 సెంట్లను సెప్టెంబరు 22న మరొకరికి అమ్మేశాడు. ఇలా ఎకరం భూమిని రూ.1.40 కోట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడని తెలిసింది. భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా ఓ ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరులు కావడం గమనార్హం. పెద్దన్న కుటుంబానికి భూమి ఇప్పిస్తానని ఆశ చూపించిన అధికారపార్టీ నాయకుడు, జానెడు స్థలం కూడా ఇవ్వకుండా మోసగించాడని సమాచారం. మొత్తం 2.02 ఎకరాలలో రోడ్డు విస్తరణకు పోగా మిగిలిన ఎకరాన్ని తానే కాజేశాడని వారు స్థానికుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తన ఇంటి చుట్టు దాదాపు అర ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
అధికారులకు పట్టలేదు..
రోడ్డు విస్తరణకు పోనూ మిగిలిన భూమిలో 2017లో అప్పటి రెవెన్యూ అధికారులు 30 మందికి పట్టాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అనువుగా లేకపోవడంతో కొందరు మౌనంగా ఉండిపోయారు. ఇంతలోనే అధికార పార్టీ నాయకుడు చేస్తున్న వ్యవహారం గురించి తెలుసుకుని, కొంత మంది కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం లబ్ధిదారులకు అనుకూలంగా 2020 నవంబరులో తీర్పునిచ్చింది. రెవెన్యూ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లబ్ధిదారులు వినతిపత్రం ఇచ్చారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ నాయకుడు ఎకరం భూమిని ఇతరులకు అమ్మేశాడు.
ఆ రెండు శాఖల తప్పిదం..
ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట రిజిస్టర్ చేయకూడదు. కానీ రిజిస్ట్రేషన శాఖ అధికారులు నిబంధనలను తుంగలోకి తొక్కి రిజిస్ట్రేషన చేశారు. దీని వెనుక భారీ తతంగమే నడిచింది. తమ తండ్రి మద్యం మత్తులో పట్టాను తిరిగి ఇచ్చేశాడని, తమకు ఆ భూమిని తిరిగి కేటాయించాలని కోరుతూ పెద్దన్న సంతానం అధికారులకు వినతి పత్రం ఇచ్చింది. దీని వెనుక అధికార పార్టీ నాయకుడి ఎత్తుగడ ఉంది. జరిగిన వ్యవహారాలను, పరిణామాలను రిజిస్ట్రేషన శాఖ పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తరువాత రెవెన్యూ అధికారులు కూడా ఇలాగే వ్యవహరించారు. రిజిస్ట్రేషన పత్రాల ఆధారంగా రెవెన్యూ అధికారులు ఆ భూమిని పట్టాదారుడి భార్య పేరిట సగం, అధికార పార్టీ నాయకుడి పేరిట సగం ఆనలైనలో ఎక్కించారు. ఆనలైనలో ఎక్కించేముందు భూమి వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ పట్టించుకోలేదు. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకుడు అనుకున్న పని కానిచ్చేశాడు. రిజిస్ట్రేషన శాఖ, రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం కారణంగా పట్టాదారులు స్థలాలను కోల్పోయారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది.
న్యాయం చేయండి..
మా అమ్మ అనూరాధ పేరిట ఇంటి స్థలం పట్టా మంజూరైంది. ఆ స్థలంలో పెద్ద గుంతలు ఉండటంతో అప్పట్లో ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఇంటి నిర్మాణం కోసం వెళితే.. అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఆ భూమి సర్పంచు తండ్రి పేరుమీదే ఉందని అంటున్నారు. దీంతో కోర్టుకు వెళ్లాం. కోర్టు మాకు అనుకూలం తీర్పు ఇచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అధికారులే మాకు న్యాయం చేయాలి.
- సుధీర్, సోములదొడ్డి
చర్యలు తీసుకుంటాం..
సోములదొడ్డిలోని భూ వ్యవహారం ఇటీవల గ్రామానికి వెళ్లినప్పుడు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ భూమిని విక్రయించడం, రిజిసే్ట్రషన చేయడం తప్పు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
- మోహనకుమార్, తహసీల్దార్
Updated Date - 2022-04-04T05:30:00+05:30 IST