ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలుకోలేని దెబ్బ

ABN, First Publish Date - 2022-10-18T05:06:57+05:30

వేరుశనగ రైతును వర్షాలు ముంచేశాయి. వరుసగా మూడో సంవత్సరం కూడా చేతికొచ్చిన పంట వర్షార్పణమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుళ్లిన వేరుశనగ పంట

పూర్తిగా నష్టపోయిన రైతు

పశుగ్రాసం కూడా దక్కని దుస్థితి

చేలలోనే వదిలేస్తున్న వైనం

రూ.1,230 కోట్ల పెట్టుబడి నష్టం

మూడేళ్లుగా ఇదే పరిస్థితి

ధర్మవరం రూరల్‌

వేరుశనగ రైతును వర్షాలు ముంచేశాయి. వరుసగా మూడో సంవత్సరం కూడా చేతికొచ్చిన పంట వర్షార్పణమైంది. దీంతో రైతుపై కోలుకోలేని దెబ్బ పడింది. పంట పెట్టుబడి, చేతుల కష్టం కోల్పోయాడు. అప్పులపాలయ్యాడు. ఇకపై పంట పెట్టాలంటేనే భయపడుతున్నాడు.


1,97,500 హెక్టార్లలో సాగు

జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ. 1,97,500 హెక్టార్లలో రైతులు పంటను సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది 2.50 లక్షల హెక్టార్లలో పంట వేశారు. ఈసారి సాగు విస్తీర్ణం తగ్గింది. వేరుశనగ సాగులో ఏటా నష్టాలు రావడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపలేదు.  దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 


రూ.1230 కోట్ల నష్టం

జిల్లా వ్యాప్తంగా 4.92 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. ఎకరాకు రూ.25వేలు చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. దిగుబడి బాగా వచ్చింది. రైతులు సంబరపడ్డారు. వారం రోజుల క్రితం పంటను తొలగించారు. రోజూ వర్షం కురుస్తూనే ఉంది. అది కూడా భారీగా పడుతోంది. దీంతో చేనులోని పంట నానుతూనే ఉంది. వేరుశనగ కాయలు వానకు తడిసి, తడిసి బూజుపట్టాయి. కట్టె పూర్తిగా కుళ్లిపోయి, నల్లగా మారిపోయింది. పశుగ్రాసానికి కూడా పనికిరాదు. పంట దిగుబడి, పశుగ్రాసం రెండూ కోల్పోయి, రైతు పూర్తిగా నష్టపోయాడు. పంట పెట్టుబడిగా పెట్టిన సుమారు రూ.1230 కోట్లు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. దిగుబడి రైతుకు దక్కి ఉండుంటే సుమారు రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చేదని పేర్కొంటున్నారు.


పంట నష్టపరిహారం ఏదీ..?

ఏటా వేరుశనగ సాగుచేసి రూ.వేల కోట్ల పెట్టుబడులను రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం మాత్రం పంటల బీమా పేరుతో రూ.వెయ్యి, రెండు వేలు ఇచ్చి, చేతులు దులుపుకుంటోంది. గతేడాది పంటల బీమాలో తీవ్ర అన్యాయం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. బీమా పంపిణీలో కూడా కొన్ని మండలాలకు రూపాయి కూడా చెల్లించలేదు.పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణమై, కాయలతో పాటు పశుగ్రాసం కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పంటల బీమాతో సరిపెట్టి, చేతులు దులుపుకుందనే విమర్శలు మూటగట్టుకుంది.




వెంటాడిన వాన

ఖరీఫ్‌ సీజనలో పదే పదే.. భారీ వర్షాలు

పంటలకు తీవ్ర నష్టం.. 

పుట్టపర్తి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ రైతు కష్టమంతా వర్షార్పణం అయింది. సీజన ప్రారంభం నుంచి భారీ వర్షాలు, వరద బీభత్సానికి విత్తు విత్తినప్పటి నుంచి పంట చేతికొచ్చే దాకా పంటలు పదేపదే దెబ్బతింటూనే ఉన్నాయి. గతేడాది నవంబరు నుంచి రైతును వర్షం వెంటాడుతూనే ఉంది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతోపాటు ఎగువన కర్ణాటకలో నదులు, వాగులు, వంకలు, చెరువులు పోటెత్తుతున్నాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట నేల వాలడం, నీట మునగడాన్ని చూసి, రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.


అపార నష్టం

ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతోపాటు నదులు, చెరువులు, వాగులు, వంకల ప్రవాహానికి జిల్లాలోని పలు మండలాల్లో చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిని, రైతన్నకు అపార నష్టం మిగిల్చాయి. ఖరీ్‌ఫలో జిల్లావ్యాప్తంగా 272343 మంది రైతులు 8.41 లక్షల ఎకరాల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, వరి, మొక్కజొన్న, పత్తి, కంది, చిరుధాన్యాలు తదితర పంటలు సాగు చేశారు. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, వరి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పట్లోనే వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలోని 15 మండలాల పరిధి 83 గ్రామాల్లో పత్తి 2800, మొక్కజొన్న 1200, వేరుశనగ 300, పొద్దుతిరుగుడు 150  కలిపి మొత్తంగా 4600 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఉద్యాన పంటలైన టమోటా, అరటి, వంగ, మిర్చి, కర్బూజా తదితర పంటలు 248 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అంచనా. వ్యవసాయ, ఉద్యానపంటలు కలిపి, 6 వేల ఎకరాల్లో దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు ప్రభుత్వానికి అధికార యంత్రాంగం నివేదిక పంపింది. మళ్లీ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల, వరదకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, వరి, కంది తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం శనివారానికి ఏడు మండలాలకు సంబంధించిన పంట నష్టం నివేదిక రాగా.. 2410 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇందులో కోతవేసి, పొలాల్లో ఆరబెట్టిన 1050 ఎకరాల్లో వేరుశనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో 11 మంది రైతులకు సంబంధించి 11.32 ఎకరాల్లో రూ.26.32 లక్షల నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అంచనా. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కర్ణాటక ప్రాంతాల నుంచి వరద పోటుకు పెన్నా, చిత్రావతి నదులతోపాటు వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాల పరిధిలో పొలాల వైపు రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లా మొత్తంగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయితే నష్టం ఎంతన్నది తేలనుంది. ఉద్యాన పంటలైన టమోటా, అరటి, ఉల్లి, చీనీ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో రెండుసార్లు భారీ వర్షం, వరద బీభత్సానికి పదివేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.


నయాపైసా రాలేదు..

ఆగస్టు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం.. ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇంతవరకు నయాపైసా పరిహారం ఇవ్వలేదని నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతోపాటు చేనులోనే తడిసిపోతోంది. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు అంచనావేసే పనిలో నిమగ్నమయ్యాయి. మళ్లీ వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తున్న నేపథ్యంలో రైతులు.. పంటలపై ఆశలు వదులు కుంటున్నారు. ఈనేపథ్యంలో పంట నష్టం నివేదికలతో సరిపెడతారా, పరిహారం అందిస్తారా అని అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


సాయం అందేనా?

ఖరీఫ్‌ సాగు ప్రారంభం నుంచి భారీ వర్షాలు, వరదలు రైతన్నలను వెంటాడుతూనే ఉన్నాయి. మొక్కజొన్నకు ఎకరాకు సగటున సాగు నుంచి కోత వరకు రూ.22దాకా, వేరుశనగకు రూ.25 వేల నుంచి రూ.28వేలు, పత్తికి రూ.30వేలదాకా, వరికి ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్లాల్సి వస్తోంది. ఖరీ్‌ఫలో సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న, పత్తి పంటలు తీరా కోతకొచ్చిన సమయంలో వర్షాలు, వరద ప్రవాహంతో చేనులో వదిలేయాల్సి వచ్చింది. పంటలేవీ చేతికొచ్చే పరిస్థితులు కన్పించడంలేదు. పశుగ్రాసానికి సైతం పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు.



Updated Date - 2022-10-18T05:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising