ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి.. ఇసుక స్వాహా!

ABN, First Publish Date - 2022-12-15T00:53:04+05:30

పెన్నా నదిలో ఇసుకను, కొండగుట్టల్లో మట్టిని అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు. ఎర్రమట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. పామిడిలో పట్టపగలే ట్రాక్టర్లు, టిప్పర్లు దర్జాగా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. యంత్రాలను పెట్టి ఇసుక, మట్టిని తోడేస్తున్నా కళ్లకు కరెన్సీ గంతలు కట్టుకున్నారు.

గుట్టను కొల్లగొట్టి.. మట్టి దందా ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామిడిలో పేట్రేగుతున్న మాఫియా

అనుమతి ఇస్తున్న సంబంధం లేని శాఖలు

చేష్టలుడిగి చూస్తున్న మైనింగ్‌ అధికారులు

పెన్నా నదిలో ఇసుకను, కొండగుట్టల్లో మట్టిని అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు. ఎర్రమట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. పామిడిలో పట్టపగలే ట్రాక్టర్లు, టిప్పర్లు దర్జాగా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. యంత్రాలను పెట్టి ఇసుక, మట్టిని తోడేస్తున్నా కళ్లకు కరెన్సీ గంతలు కట్టుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పేరు చెప్పి, అనుమతి ఉందని బుకాయిస్తున్నారు. సంబంధంలేని పత్రాలు చూపెడుతున్నారు. అవి అనుమతి పత్రాలు కాదని అడ్డుతగిలితే.. మూకుమ్మడిగా బెదిరింపులకు, దూషణలకు దిగుతున్నారు. నెల రోజులకుపైగా ఈ దందా సాగుతున్నా.. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు.

- పామిడి

కాసుల వర్షం

ఎర్రమట్టి, ఇసుక వ్యాపారం అధికార పార్టీలోని కొందరు నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో ట్రాక్టర్‌ మట్టి రూ.500 - రూ.700 మధ్య దొరికేది. వ్యక్తిగత అవసరాలకు పలువురు రాయల్టీ చెల్లించి.. రూ.1100 నుంచి రూ.1300 ధర నిర్ణయించి అమ్ముతున్నారు. రాయల్టీ మట్టిలో కొంతభాగాన్నే రోడ్లకు తరలించారు. ఆ తర్వాత ఎక్స్‌కవేటర్ల ద్వారా పదుల సంఖ్య ట్రాక్టర్లతో ఎర్రమట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. పెన్నానది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. గతంలో రూ.1000 ధర పలికిన ట్రాక్టర్‌ ఇసుక.. నేడు రూ.1500 నుంచి రూ.2000 పలుకుతోంది. ఇటీవల పెన్నానదిలో ప్రవాహానికి పెద్దఎత్తున ఇసుక చేరింది. ఇది ఇసుకాసురులకు ఆదాయ వనరుగా మారింది. అడపాదడపా పోలీసులు కేసులు పెడుతున్నా వెనుకడుగు వేయడం లేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పేరిట ఏదో ఓ పత్రాన్ని చూపించి దర్జాగా తరలిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్లు వేసేందుకే అంటుండటంతో.. విషయం తెలిసినా కొందరు అధికారులు ఏమీ చేయలేకున్నారని సమాచారం. అధికారులు అడ్డుకుంటే అధికార ప్రజాప్రతినిధుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిసింది.

పట్టించుకోని అధికారులు

కొండగుట్టల్లో మట్టి తవ్వకాలకు మైనింగ్‌ అధికారుల అనుమతి తప్పని సరి. కానీ కొందరు అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారుల అనుమతి తీసుకున్నామని బురిడీ కొట్టిస్తున్నారు. ఈ రెండు శాఖల అధికారులకు అనుమతులు ఇచ్చే అధికారం లేదు. మట్టి తవ్వకాలకోసం రెవెన్యూ అధికారులు మైనింగ్‌ అధికారులకు సిఫారసు చేస్తారు. మైనింగ్‌ అధికారుల నుంచి అనుమతి వస్తే.. రెవెన్యూ అధికారులు కేటాయించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. లేదా రాయల్టీ చెల్లించి మట్టిని, ఇసుకను తరలించేందుకు అవకాశం ఉన్నచోటునూ ఎంచుకోవచ్చు. కానీ అధికార పార్టీ నాయకులు పామిడి సమీపంలోని కొండగుట్టల్లో మట్టిని, పెన్నానది, వంకలలో ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారు. తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో కొండాపురం రోడ్డులో ఉన్న కొండ ప్రాంతాల్లో మట్టిని దోచుకుంటున్నారు. వర్షకాలంలో ఇంటి ముందు నీరు నిల్వ ఉండకుండా కాస్త మట్టిని తీసుకుంటేనే అధికారులు అడ్డుకుంటారు. కానీ వందల ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

బురిడీ కొట్టించారా..?

ఇసుక, ఎర్రమట్టిని అక్రమంగా తరలించేందుకు కొందరు అధికారులను బురిడి కొట్టించారు. సంబంధమే లేని శాఖల నుంచి ఎర్రమట్టి, ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు పుట్టించారు. ఆ పత్రాలనే అనుమతి పత్రాలుగా చిత్రీకరించి దందాకు తెరలేపారు. కొందరు అధికారులు ఆ పత్రాలను చూసి అనుమతి పత్రమే అని భ్రమపడ్డారట..! రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా.. అవగాహన రాహిత్యంతో మిన్నకుండిపోయారా.. అన్న చర్చ జరుగుతోంది.

ఇసుక దోపిడీ నవరత్నాల్లో భాగమైంది..!

టీడీపీ నాయకుడు పెరుమాళ్ల జీవానందరెడ్డి

అనంతపురం అర్బన, డిసెంబరు 14: వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ నవరత్నాల్లో భాగమైపోయిందని టీడీపీ నాయకుడు, పీజేఆర్‌ ట్రస్టు చైర్మన పెరుమాళ్ల జీవానందరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పామిడి పెన్నానది నుంచి వేల టన్నుల ఇసుకను ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నా అధికారుల్లో చలనం లేదని అన్నారు. ప్రకృతి సంపదను దుర్వినియోగం చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని, వాహనాలను సీజ్‌ చేయాలని రైతులు కోరినా అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. పెన్నానది నుంచి ఇసుకను తరలించరాదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అనుమతి లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్లతో పట్టపగలే ఇసుకను తరలిస్తున్నా కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌, ఇరిగేషన అధికారులు పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికడుతున్నారనే ఉద్దేశంతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీఐని బదిలీ చేయించారని, తమకు అనుకూలమైన రెడ్డి సామాజికవర్గ సీఐని తెచ్చుకున్నారన్నారని ఆరోపించారు. వాల్టా చట్టాన్ని అమలు చేయాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించారని, దీంతో అధికారుల మీద కోర్టు ధిక్కరణపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించిందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని, పామిడి వద్ద పెన్నానది పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరారు.

Updated Date - 2022-12-15T00:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising