బడిలో ఎమ్మెల్సీ ప్రచారం
ABN, First Publish Date - 2022-12-16T00:11:03+05:30
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి.. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయడం విమర్శలకు తావిచ్చింది. పాఠశాల పనివేళల్లో ఆమె వైసీపీ పరోక్షంగా మద్దతు తెలుపుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి (ఎంవీ రామచంద్రారెడ్డి) తరపున ప్రచారం చేశారు.
పనివేళల్లో ఉపాధ్యాయులతో సమావేశాలు
ఉమ్మడి అనంతలో ఎమ్మెల్సీ కల్పలత పర్యటన
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారంపై విమర్శలు
అనంతపురం విద్య, డిసెంబరు 15: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి.. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయడం విమర్శలకు తావిచ్చింది. పాఠశాల పనివేళల్లో ఆమె వైసీపీ పరోక్షంగా మద్దతు తెలుపుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి (ఎంవీ రామచంద్రారెడ్డి) తరపున ప్రచారం చేశారు. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో బుధ, గురువారాలు ప్రచారం చేసినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని జడ్పీ హైస్కూళ్లు, కేజీబీవీలను ఆమె సందర్శించారు. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని కూర్చోబెట్టి.. సమావేశాలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓబుళదేవరచెరువు, మిట్టపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు, గాండ్లపెంట కేజీబీవీలో ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. హైస్కూల్, కేజీబీవీ టీచర్లతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనానికి ముందు, తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు.
ఉత్తర్వులు వర్తించవా..?
పాఠశాలల పనివేళల్లో ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నట్లు విమర్శలు రావడంతో అక్టోబరు 19న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. విద్యాసంస్థల పనివేళల్లో ప్రచారం చేస్తే పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందని, ఎవరూ ప్రచారం చేయరాదని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప డీఈఓను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఎమ్మెల్సీ బేఖాతరు చేశారు. పాఠశాలల పని వేళల్లో టీచర్లను కూర్చీల్లో కూర్చోబెట్టి మరీ ఓట్లు అడిగారు. ఎమ్మెల్సీలకు ఈ నిబంధనలు వర్తించవా అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించి, పాఠశాల పనివేళల్లో ప్రచారం చేసిన ఎమ్మెల్సీపై విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-12-16T00:11:05+05:30 IST