బూస్టర్ డోస్ కావాలంటే బెంగళూరుకు వెళ్లాల్సిందే..!
ABN, First Publish Date - 2022-12-28T00:17:30+05:30
కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. బూస్టర్ డోస్ వేయించుకోవాలంటూ చెబుతోంది. అయితే జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా టీకా నిల్వలు ఖాళీ అయ్యాయి.
హిందూపురం, డిసెంబరు 27: కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. బూస్టర్ డోస్ వేయించుకోవాలంటూ చెబుతోంది. అయితే జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా టీకా నిల్వలు ఖాళీ అయ్యాయి. దీంతో జనం బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి టీకా వేయించుకుంటున్నారు. ఇప్పటికే అత్యధికమంది రెండు డోస్‌ల టీకా పూర్తి చేసుకున్నారు. బూస్టర్ డోస్ తీసుకోవాలని అప్పట్లోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనా రెండో దశ విజృంభణ తగ్గుముఖం పట్టడంతో బూస్టర్‌డో్‌సకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా చైనాలో మరోసారి కరోనా కొత్త వేరియెంట్ కకావికలం చేస్తోందన్న వార్తలు రావడంతో ఇక్కడి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూస్టర్ డోస్ కోసం వైద్యులను సంప్రదిస్తూ, అందుబాటులో లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. మొదటి, సెకెండ్ డోస్ టీకాలు ఉచితంగానే ఇచ్చారు. బూస్టర్ డోస్ ఇంతవరకు రాకపోవడంతో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు.
కర్ణాటక వైపు పరుగులు
గతంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో బాధితులు, జనంపడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది బూస్టర్ డోస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీకా అందుబాటులో లేకపోవడంతో కొంతమంది బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. బూస్టర్‌డోస్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి టీకా వేయించుకుంటున్నారు. ప్రతిరోజూ స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు బూస్టర్ డోస్ కోసం వచ్చి వెనుతిరిగి పోతున్నారు. ఎప్పుడు వస్తుందోనని, ఇప్పటివరకు సమాచారం లేదని, టీకాలు అందుబాటులో లేవని వైద్యులు చెబుతున్నారు.
అందుబాటులో లేని టీకా
కరోనా మొదటి, సెకెండ్ వేవ్‌లో ప్రభుత్వం కరోనా టీకా ఉచితంగా వేసింది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టీకా వేశారు. ప్రస్తుతం బూస్టర్ డోస్‌పై ప్రభుత్వం చొరవ చూపలేదు. టీకా వేసుకోవాలని చెబుతున్నారే తప్ప, అవసరమైన టీకాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. చాలామంది బూస్టర్ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు.
Updated Date - 2022-12-28T00:17:31+05:30 IST