భారీ వర్షాలతో అపార నష్టం
ABN, First Publish Date - 2022-08-04T05:55:20+05:30
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులకు అపారనష్టం జరిగిందని, నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారిథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వైసీపీ నాయకులు గడప దాటడం లేదు..
మాజీ మంత్రి పరిటాల సునీత, బీకే పార్థసారథి
రామగిరి, ఆగస్టు 3: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులకు అపారనష్టం జరిగిందని, నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారిథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టం, పింఛన్ల తొలగింపు తదితర అంశాలపై పార్టీ నాయకులతో వెంకటాపురంలో బుధవారం చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలకు టమోటా, మొక్కజొన్న, సజ్జ, బీర, బొప్పాయి, దానిమ్మ, వేరుశనగ తదితర పంటలు నీట మునిగి రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. ఇంత జరిగినా అధికార పార్టీ నాయకులు ఇళ్లు దాటి రావడంలేదని విమర్శించారు. గత ఏడాది కూడా పంట నష్టపోయిన రైతులకు కంటి తడుపుగా పరిహారం అందించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటనష్టం వివరాలు తెలుసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ లక్షల మందికి పథకాలు అందకుండా చేశారని విమర్శించారు. 2020 సెప్టెంబరులో 61.68 లక్షల మందికి పింఛనలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం, నేడు ఎన్ని లక్షల మందికి పింఛన ఇస్తున్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అర్హులకు పింఛన తొలగించారని ఆరోపించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశరెడ్డి మాటలు కోటలు దాటుతాయని, చేతలు గడపకూడా దాటవని ఎద్దేవా చేశారు. పింఛన రాలేదని మహిళలు నిలదీస్తుంటే.. చంద్రబాబు వల్లనే ఇదంతా అని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నార ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు తొలగిస్తే తాము కోర్టుకు వెళ్లి సాధించుకుంటున్నామని అన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ సుధాకర్, నాయకులు రామ్మూర్తినాయుడు, నెట్టెం వెంకటేశ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:55:20+05:30 IST