ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుగడుగునా అసమ్మతి

ABN, First Publish Date - 2022-12-16T00:09:20+05:30

అధికార పార్టీలో వర్గపోరు బట్టబయలైంది. గురువారం నిర్వహించిన హిందూపురం, మడకశిర నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాల్లో సొంతపార్టీ నాయకులే నిరసన గళం వినిపించారు.

హిందూపురంలో సమావేశ వేదిక వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేర్వేరుగా మంత్రికి స్వాగతాలు

నియోజకవర్గ సమావేశాల్లో నిరసన గళం

తమ సమస్యలు వినాలని కార్యకర్తల మండిపాటు

పోలీసు వలయంలో కార్యక్రమాలు

మంత్రి ప్రసంగిస్తుండగానే ఖాళీ అయిన కుర్చీలు

బీసీ, ఎస్సీ ప్రజాప్రతినిధులకు అవమానం

హిందూపురం, డిసెంబరు 15: అధికార పార్టీలో వర్గపోరు బట్టబయలైంది. గురువారం నిర్వహించిన హిందూపురం, మడకశిర నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాల్లో సొంతపార్టీ నాయకులే నిరసన గళం వినిపించారు. ఆక్రోశం వెల్లగక్కారు. సమావేశాలకు హాజరవుతున్న వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలకడంతోనే విభేదాలు బట్టబయలయ్యాయి. మడకశిరకు చెందిన నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి, మంత్రికి వేర్వేరుగా స్వాగతాలు పలికారు. అందులో ఎమ్మెల్యే తిప్పేస్వామిది ఒక వర్గం. అసమ్మతి వర్గంలో మాజీ మంత్రి నర్సేగౌడు, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఏకంగా మూడు వర్గాలుగా స్వాగతాలు పలికారు. సమావేశాలు సైతం పోలీసు వలయంలో సాగాయి. ఏ కార్యకర్త, ఏ నాయకుడు నిరసన గళం విప్పుతాడోనని నియోజకవర్గ ఇనచార్జిలు, ముఖ్య నాయకుల్లో భయం పట్టుకుంది. దీంతో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా, కార్యకర్తలు ఆక్రోశం వెల్లగక్కారు. తమ సమస్యలు వినాలని మండిపడ్డారు. దీంతో సమస్యల ప్రస్తావన లేకుండా సమన్వయంతో పని చేయండంటూ మంత్రి పెద్దిరెడ్డి సమావేశాల్లో ఉద్బోధ చేశారు. ఆయా సమావేశాల్లో బీసీ, ఎస్సీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. కనీసం వేదికపై కుర్చీలు కూడా వేయలేదు. వారు చాలాసేపు నిలబడే ఉన్నారు. తరువాత చూసుకున్న నాయకులు.. వారికి కుర్చీలు వేయించడం శోచనీయం.

హిందూపురంలో మూడు వర్గాలు..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హిందూపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు మూడుచోట్ల వేర్వేరుగా స్వాగతం పలికారు. మొదట మడకశిర నుంచి వస్తున్న మంత్రికి ధనాపురం క్రాస్‌వరకు రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన నవీన నిశ్చల్‌ వర్గీయులు, కొట్నూరు బ్రిడ్జి వద్ద మధుమతి వర్గం, జేవీఎస్‌ ఫంక్షన హాల్‌వద్ద ఎమ్మెల్సీ వర్గీయులు స్వాగతం పలికారు. అనంతరం ఫంక్షనహాల్‌లో నిర్వహించిన సమావేశానికి మూడువర్గాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రూపులను సమన్వయం చేస్తామని గానీ, వాటికి చెక్‌పెడతానని చెప్పకుండా కేవలం సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. దీంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లేపాక్షి వైస్‌ ఎంపీపీ అంజినరెడ్డి మంత్రి ప్రసంగిస్తున్నపుడే ‘ఇక్కడికి వచ్చింది కార్యకర్తల సమస్యలు వినడానికా... మీరు నలుగురు మాట్లాడే మాటలు వినడానికా. సస్పెండ్‌ చేసుకుంటారేమో చేసుకోండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనినిబట్టి కార్యకర్తల అసహనం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తున్నపుడే వెనుక కూర్చున్న ఒక్కొక్కరే లేచి వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

ఎంపీపీ, జడ్పీటీసీకి అవమానం

సమావేశానికి హాజరైన హిందూపురం దళిత ఎంపీపీ గంగరత్నమ్మకు స్టేజీపై కనీసం కుర్చీ కూడా ఇవ్వకపోవడంతో కింద కూర్చునేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్‌ అయిన నాయకులు ఆమెను కుర్చీలో కూర్చోబెట్టారు. చిలమత్తూరు జడ్పీటీసీ బీసీ వర్గానికి చెందిన గొల్ల అనూషకు స్టేజీపై కుర్చీ లేకపోవడంతో చాలాసేపు నిలబడే ఉన్నారు. తరువాత ఆమెకు కుర్చీ ఇచ్చి, కూర్చోబెట్టారు. వైసీపీ పాలకులు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నారే తప్ప.. పార్టీ కార్యక్రమాల్లో వారికి కనీసం వేదికలపై కుర్చీలు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

ఖాకీ నీడలో సమావేశం

హిందూపురంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం మొదటినుంచి ఆఖరి వరకు ఖాకీ నీడలో సాగింది. ఇక్కడ మూడు వర్గాలుండటంతో ఎప్పుడు ఎక్కడ మంత్రి పర్యటన, ప్రసంగాన్ని అడ్డుకుంటారో లేక ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారేమోనని పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఐదుగురు సీఐలు, పలువురు ఎస్‌ఐలు, వందమందికిపైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫంకనహాల్‌ లోపల, బయట పోలీసులే నిండిపోయారు. చాలామంది పోలీసులు సివిల్‌ డ్రెస్‌లో వచ్చి, కార్యకర్తల మధ్యలో ఉంటూ సమావేశం తీరును పరిశీలించారు.

మాధవ్‌.. నీకే దిక్కులేదు... నువ్వు ఇంకొకరిని ప్రకటిస్తావా?

- రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ రెడ్డి ఫైర్‌

‘మాధవ్‌.. నీకే టికెట్‌కు దిక్కులేదు. ఇంకొకరికి ఇవ్వడానికి నీవెవరు? అసలు నీకు హిందూపురంలో ఓటే లేదని’ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ రెడ్డి ఫైర్‌ అయ్యారు. వైసీపీ హిందూపురం నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఆ వ్యాఖ్యలపై వెంకటేశరెడ్డి మండిపడ్డారు. ఎంపీ ప్రసంగం ముగిశాక మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగించేటపుడు వేదికపైన ఉన్న వెంకటేశ రెడ్డి ముందువైపు వచ్చి మాధవ్‌కే ఈసారి టికెట్‌ ఇచ్చే అవకాశం లేదనీ, అలాంటి ఆయన ఇంకొకరికి ఎలా టికెట్‌ కన్ఫర్మ్‌ చేస్తారని మండిపడ్డారు. దీంతో అక్కడున్న పోలీసులు.. వెంకటేశరెడ్డిని అడ్డుకుని వెనక్కు పంపించేశారు.

మాజీ ఎమ్మెల్యే అసమ్మతి గళం

మడకశిర: స్థానిక యాదవ కల్యాణమండపంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ చెప్పాల్సింది చాలా ఉందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవ్వరైనా కావొచ్చనీ, వారు గెలవడానికి కారణమైన నాయకులు, కార్యకర్తలను మాత్రం మరువరాదని హితవు పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో యువకులు, నిస్వార్థపరులకు అవకాశం ఇవ్వాలన్నారు. నాయకులు మాట్లాడుతున్నపుడు కొంతమంది కార్యకర్తలు తమ ప్రాంతంలో రోడ్లు దెబ్బతిన్నాయనీ, మల్బరీ రైతులను ఆదుకోవాలని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలకడంలోనూ మడకశిర నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. మడకశిర మండలం కల్లుమర్రి వద్ద రాష్ట్ర్ట్ర కార్యదర్శి గోవర్ధనరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు రవిశేఖర్‌ రెడ్డి, రంగేగౌడ్‌, జీబీ శివకుమార్‌, వాగేష్‌, మరికొంత మంది నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే వద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు హిందూపురం రోడ్డులో మంత్రికి స్వాగతం పలికారు. మంత్రికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. ఆయా సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇనచార్జిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising