ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరీక్షణ?

ABN, First Publish Date - 2022-10-02T05:30:00+05:30

ఉమ్మడి అనంత జిల్లాలోనే పెద్దది బుక్కపట్నం చెరువు. చెరువు పరిధిలో 100 ఎకరాల భూములు ముంపు బారిన పడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుక్కపట్నం చెరువు నీటిలో మునిగిన పంటలు

పరిహారం కోసం రైతుల ఎదురుచూపు

పుట్టపర్తి, అక్టోబరు 2: ఉమ్మడి అనంత జిల్లాలోనే పెద్దది బుక్కపట్నం చెరువు. చెరువు పరిధిలో 100 ఎకరాల భూములు ముంపు బారిన పడ్డాయి. పండ్లతోటలు నిలువునా ఎండిపోయాయి. రైతులు పూర్తిగా నష్టపోయారు. పరిహారం మాత్రం నేటికీ అందలేదు. ఏళ్లుగా రైతులకు ఎదురుచూపులు తప్పట్లేదు. బుక్కపట్నం చెరువు గతంలో అరుదుగా నిండుతుండేది. చెరువు నిండినా నీటిని ఆయకట్టుకు వదలేవారు. నీరు తగ్గాక రైతులు పంటలు సాగుచేసేవారు. దీంతో ఇదే భూములపై రైతుల కుటుంబాలు జీవనం సాగించేవి. నాలుగేళ్లుగా ఏటా చెరువును కృష్ణాజలాలతో నింపుతున్నారు. ఆయకట్టుకు మాత్రం నీరు విడుదల చేయడంలేదు. దీంతో వందల ఎకరాల భూమి శాశ్వతంగా ముంపు బారిన పడింది.


ఆ రెండు గ్రామాలకు తీవ్ర నష్టం

బుక్కపట్నం చెరువు నీటితో జానకంపల్లి, పెద్దకమ్మవారిపల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెద్దకమ్మవారిపల్లి రైతులు ఫోర్‌లేన రోడ్డు, హంద్రీనీవా కాలువకు భూములను కోల్పోయారు. తిరిగి చెరువు భూములు సైతం ముంపు బారిన పడ్డాయి. చాలామంది రైతులకు సాగు భూమి లేకుండా పోయింది, జానకంపల్లి రైతులకు చెందిన దాదాపు 260 ఎకరాల భూమి నీట మునగడంతో మామిడి, టెంకాయ తోటలు, బోర్లు, నీటమునిగాయి, హంద్రీనీ వాకాలువకు కొంతభూమిని కోల్పోయారు. తిరిగి కొత్తగా వేయనున్న రోడ్డుకు సైతం భూములను సర్వే చేశారు. దీంతో ఆ రైతులు ఎక్కువ మంది భూములను కోల్పోయారు.


ఉపాధి కోల్పోయిన రైతులు

చెరువు పరిధిలో పుట్టపర్తి, బుక్కపట్నం కొత్తచెరువు మండలాలకు చెందిన 450 మంది రైతులకు 465 ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి, మొక్కజొన్న, చెరుకు తదితర పంటలు సాగుచేసేవారు. ఇవికాక మరికొంత మంది రైతులు మామిడి చెట్లు వేయగా.. కాపునకు వచ్చిన చెట్లు నీటమునిగి, నిలువునా ఎండిపోయాయి. ముంపు భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి, వీధినపడ్డాయి.


తప్పని నిరీక్షణ

2018లో కృష్ణాజలాలతో బుక్కపట్నం చెరువును నింపారు. దీంతో ఆప్పట్లో ముంపు రైతులు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులు పరిహారం మంజూరు చేయాలని కోరారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపారు. వైసీపీ అధికారం చేపట్టి, మూడేళ్లు గడిచినా రైతులకు పరిహారం మాత్రం రాలేదు. నిరీక్షణే మిగిలింది.


రూ.లక్షల్లో నష్టపోయా:

పెద్దిరెడ్డి హరి, రైతు, జానకంపల్లి

బాగా కాపుకాస్తున్న మూడువందల మామిడిచెట్లు నీటమునిగి, ఎండిపోయాయి. లక్షల రూపాయలు నష్టపోయా. పశుగ్రాసం సైతం నీట మునగడంతో పాడిపశువులకు గడ్డిలేక అమ్ముకున్నా. లక్షలు పలికే భూములు నేడు పనికి  రాకుండా పోయాయి.


ఊటనీటితో పంట నాశనం:

నాగభూషణ, జానకంపల్లి

చెరువు పక్కనే మూడెకరాల పొలం ఉంది. భూమిమీద నీరు రాకపోయినా వేసిన ప్రతిపంట పాడైపోతోంది. భూమిలో ఊటనీరు వస్తుండటంతో పశుగ్రాసం వేసినా పైకి రావడం లేదు. మా కష్టాలు అన్నీ.. ఇన్నీ.. కావు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదు.


పంట సాగుచేసే అవకాశం లేదాయె:

భీమినేని కిష్టప్ప, రైతు, పుట్టపర్తి

3.67 ఎకరాల భూమి ఉంది. గతంలో ఏ పంట వేసినా పచ్చగా పైకి వచ్చేది. ఏటా వేరుశనగ, మొక్కజొన్న, వరి సాగు చేసేవారం. నాలుగేళ్లుగా నీట మునగడంతో  సాగుచేసే అవకాశం లేకుండా పోయింది. ఉపాధి లేక రూ.లక్షల్లో నష్టపోయా.


పరిహారం ఎప్పుడొస్తుందో..?

రైతు అమ్మినేని రాఘవయ్య, పెద్దకమ్మవారిపల్లె

ఏటా చెరువుకు నీరు వస్తోంది. పూర్తిస్థాయిలో నిండుతోంది. నాలుగు సంవత్సరాలుగా పొలంలోకి వెళ్లే అవకాశం లేదు. పంట లేదు. పరిహారం ఎప్పుడొస్తుందో, ఏమో?



Updated Date - 2022-10-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising