వ్యవసాయం ఏదీ?
ABN, First Publish Date - 2022-12-16T00:09:32+05:30
వ్యవసాయ యాంత్రీకరణ కలగానే మిగులుతోంది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తోంది కానీ క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తోంది.
రైతుకు కలగా మారిన వ్యవసాయ యాంత్రీకరణ
రైతు రథం, ఇతర పథకాలు అటకెక్కించిన వైనం
ఈ ఏడాది 232 సీహెచసీ సెంటర్ల కేటాయింపు
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా మార్గదర్శకాలు ఏవీ?
అయోమయంలో అన్నదాతలు
అనంతపురం అర్బన, డిసెంబరు 15: వ్యవసాయ యాంత్రీకరణ కలగానే మిగులుతోంది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తోంది కానీ క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాంత్రీకరణ పథకానికి మంగళం పాడింది. గత ఏడాది నాలుగు విడతల్లో 129 సీహెచసీ సెంటర్ల (కస్టమ్ హైరింగ్ సెంటర్లు)ను మంజూరు చేశారు. ఈ ఏడాది సీహెచసీ సెంటర్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తున్నా వ్యవసాయశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ సారి సీహెచసీ సెంటర్ల మంజూరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అటకెక్కిన రైతు రథం, ఇతర పథకాలు
టీడీపీ హయాంలో రైతులకు వ్యక్తిగతంగా రైతు రథం పేరుతో ట్రాక్టర్లు మంజూరు చేశారు. అలాగే యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు వ్యక్తిగతంగా సబ్సిడీతో ట్రాక్టర్ పరికరాలు, ఇతరత్రా యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. అలాగే సీహెచసీ సెంటర్లను రైతు గ్రూపులకు అందిం చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకాన్ని పక్కనపెట్టింది. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తప్పని సరిస్థితుల్లో 2020 సంవత్సరంలో సీహెచసీ సెంటర్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో రైతు గ్రూపులకు ట్రాక్టర్ మంజూరు చేయకుండా కేవలం ట్రాక్టర్ పరికరాలు పంపిణీ చేస్తామని చెప్పటంతో తీసుకోవడానికి రైతులెవరూ ముందుకురాలేదు. గతేడాది సీహెచసీ సెంటర్లకు ట్రాక్టర్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రైతులు ముందుకొచ్చారు. గతేడాది నాలుగు విడతల్లో అతికష్టంగా 219 కస్టమ్ హైరింగ్‌సెంటర్లను ఏర్పాటు చేసి ట్రాక్టర్, ఇతర యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేయడంతో సరిపెట్టారు.
మార్గదర్శకాలు జారీ చేయని ప్రభుత్వం
జిల్లాకు ఈ ఏడాది 232 సీహెచసీ సెంటర్లు (కస్టమ్ హైరింగ్‌సెంటర్లు) కేటాయించారు. సీహెచసీ గ్రూపునకు గరిష్ఠంగా రూ.15 లక్షలు దాకా మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందులో గరిష్ఠంగా 40 శాతం సబ్సిడీ వర్తింపజేస్తామని ప్రకటించారు. మిగతా మొత్తాన్ని బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి దాకా అందుకు సంబంధించిన ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుంది. గతేడాది నాలుగు విడతల్లో అతికష్టంపై సీహెచసీ సెంటర్లకు ట్రాక్టర్, యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేశారు. ఈఏడాది సీహెచసీ సెంటర్ల కేటాయింపుతోనే సరిపెట్టడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఈ ఏడాది సీహెచసీ సెంటర్ల ఏర్పాటు చేయడం, వాటికి యాంత్రీకరణ పరికరాలు మంజూరుచేయడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరువు జిల్లా రైతులకు యాంత్రీకరణ పరికరాలు ఇప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన దాఖలాలు కూడా లేవనే చెప్పాలి. ఇప్పటికైనా రైతులకు సబ్సిడీతో యాంత్రీకరణ పరికరాలు అందించేలా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది.
Updated Date - 2022-12-16T00:09:33+05:30 IST