Anantha Babu: బెయిల్‌పై బయటకు అనంతబాబు
ABN, First Publish Date - 2022-12-15T03:52:14+05:30
కారుడ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో జైలుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బుధవారం బెయిల్‌పై బయటకువచ్చారు. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
రాజమహేంద్రి జైలు వద్ద వైసీపీ నేతల హడావుడి
నేరుగా జైలు ప్రాంగణంలోకి వారి వాహనాలు
‘మన్యం టైగర్’ అంటూ నినాదాలు..
దళితుడిని హత్యచేసిన వారికి స్వాగతాలా?
వైసీపీ తీరుపై మండిపడిన హక్కుల నేతలు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 14: కారుడ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో జైలుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బుధవారం బెయిల్‌పై బయటకువచ్చారు. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బుధవారం బెయిల్‌కు సంబంధించి రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో ప్రక్రియ జరిగింది. రూ.50వేలు చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే, నిందితుని పాస్‌పోర్టు స్వాధీనం చేయాలని, బెయిల్‌పై ఉండగా సాక్షులను బెదిరించరాదంటూ షరతులను వివరించగా, అందుకు అనంతబాబు తరఫు న్యాయవాదులు అంగీకరించారు. వాటిని కోర్టుకు అందించి.. విడుదల ఆదేశాలతో జైలు వద్దకు చేరుకున్నారు. ఆ పత్రాలను పరిశీలించిన జైలు అధికారులు సాయంత్రం అనంతబాబును సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు. ఆ సమయానికే వైసీపీ నేతల వాహనాలు నేరుగా సెంట్రల్ జైలు ప్రాంగణంలోకి చేరుకున్నాయి. కరోనా అనంతర పరిణామాల్లో భాగంగా మెయిన్ రోడ్డు గేటు దాటి లోపలకు వాహనాలను అనుమతించడం లేదు. అలాంటిది వైసీపీ నేతల వాహనాలు ఆ గేటు దాటుకుని జైలు ప్రాంగణంలోకి వెళ్లడం గమనార్హం. ఎమ్మెల్సీ అంతబాబును తీసుకుని వారి కాన్వాయ్ బయటకు వచ్చింది. అనంతబాబుకు జైలు బయట స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు అప్పటికే అక్కడకు చేరుకున్నాయి. ఎమ్మెల్సీ బయటకు రాగానే ‘మన్యం టైగర్’ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేయడం విస్మయానికి గురిచేసింది. కాగా, కాకినాడలో కారుడ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను ఈ ఏడాది మే 23న దారుణంగా హత్య చేసిన కేసులో అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 211 రోజులు ఆయన జైలు రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టులో అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను పలుమార్లు న్యాయమూర్తి కొట్టివేశారు. హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, ఒక దళిత యువకుడిని హత్య చేసి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడికి వైసీపీ నాయకులు పూల దండలతో స్వాగతాలు పలకడం గర్హనీయమని ఏపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2022-12-15T03:52:17+05:30 IST