ఏసీడీ షాక్!
ABN, First Publish Date - 2022-06-16T07:52:46+05:30
ఏసీడీ షాక్!
మోత మోగిన మే నెల కరెంటు బిల్లులు
500 యూనిట్లు దాటారంటూ ధరావతు దంచుడు
వార్షిక కాషన్ డిపాజిట్.. ఏసీడీ పేరిట బాదుడు
వేసవి తాపానికి రోజంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు
నెల బిల్లు 5,600 వస్తే.. డిపాజిట్ ఏకంగా 9,200
సంపన్న కేటగిరీ సృష్టించి తొలిసారి భారీగా వడ్డన
మేలో సాధారణం కంటే ఎక్కువగానే వినియోగం
ఆ మేరకు అధిక బిల్లుకు సిద్ధమైన వినియోగదారు
దీనినే ఆసరాగా తీసుకుని డిస్కమ్‌ల దొంగదెబ్బ
ఏ సమాచారం లేకుండానే ధరావతు వసూలు
దీంతో హైవోల్టేజీ షాక్ ఇస్తున్న కరెంటు బిల్లు
వేసవి తాపం తట్టుకోవడానికి ఇళ్లలో రోజంతా ఫ్యాన్లు తిప్పుతున్నారు. కూలర్లు, ఏసీలు నాన్‌స్టా్‌పగా ఆడిస్తున్నారు. ఉక్క నుంచి ఉపశమనం కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లులు కాస్త ఎక్కువ వచ్చినా..భరిద్దాములే అని సిద్ధమయ్యారు. కానీ, మే నెలలో వాడిన కరెంటుకుగాను జూన్ తొలివారంలో వచ్చిన బిల్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. వాడిన కరెంటుతో పాటు అదనంగా విద్యుత్తు వినియోగదారుల నుంచి వార్షిక కాషన్ డిపాజిట్ (ఏసీడీ- ధరావతు)కింద రూ. వేలకోట్లు డిస్కమ్‌లు వసూలు చేస్తుండటమే దీనికి కారణం. 500 యూనిట్లు దాటి వినియోగించినవారిని వైసీపీ సర్కారు తొలిసారి సంపన్నవర్గం కిందకు చేర్చింది. వారినుంచి ఇప్పుడు ధరావతును వసూలు చేయడానికి సిద్ధమైంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వేసవి వడగాడ్పులు మే నెలలో అధికంగా ఉండటంతో సాధారణ, మధ్యతరగతిలో సైతం అత్యధిక కుటుంబాలు ఈసారి 500 యూనిట్ల బెంచ్‌మార్కును దాటాయి. దీంతో నెలవారీగా వారు చెల్లించే కరెంటు బిల్లు మొత్తానికి రెట్టింపుగా ధరావతు భారం మోపారు. దీంతో వారంతా షాక్ తిన్నారు. ఉదాహరణకు ఒక మధ్యతరగతి కుటుంబానికి మే నెల వాడకానికిగాను కరెంటు బిల్లు రూ.5,600 వచ్చింది. వార్షిక కాషన్ డిపాజిట్ చార్జీల కింద ఆ కుటుంబం నుంచి రూ.9200 అదనంగా కట్టించుకుంటారు. ఏసీడీ మొత్తం రూ.9200 చెల్లించకుండా .. కేవలం నెలవారీ విద్యుత్తు బిల్లు మాత్రమే కడతామంటే .. బిల్లు కౌంటర్‌లోనూ .. ఆన్‌లైన్‌లోనూ తీసుకోవడంలేదు. ఏకమొత్తంగా కడితేనే బిల్లు చెల్లించినట్లుగా డిస్కమ్‌లు గుర్తిస్తున్నాయి. లేదంటే .. మొత్తం బిల్లును బకాయిగానే భావించి .. విద్యుత్తు కనెక్షన్‌ను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ముందస్తు సమాచారం లేకుండా వసూలు చేస్తున్న ఈ ధరావతుపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఏసీడీ చార్జీలు వేల రూపాయల్లో ఉండటంతో బిల్లు కలెక్షన్ సెంటర్లకు.. విద్యుత్ ఏఈలకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి.సమాధానం చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాడిన కరెంటుకు బిల్లులు చెల్లిస్తుంటే .. మళ్లీ ధరావత్తు ఎందుకంటూ వినియోగదారులు ఫోన్లలోనే సర్కారుకు శాపనార్థాలు పెడుతున్నారు.
ఏమిటీ ధరావతు?
డిస్కమ్‌ల చరిత్రలో ఎన్నడూ గృహ విద్యుత్ వినియోగంపై ఈ తరహా ధరావతు వసూలు చేయలేదు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గృహ విద్యుత్ వినియోగ లోడు ఆధారంగా ధరావతును వసూలు చేస్తారు. ఇది ఏకమొత్తంలో గరిష్ఠంగా రూ.20,000 దాకా ఉంటుంది. ఒకసారి ధరావతు చెల్లించాక.. మళ్లీ వినియోగానికి దాన్ని కట్టాల్సిన అవసరం ఉండదు. నెలవారీ వినియోగ బిల్లులు చెల్లిస్తే సరిపోతుంది. అయితే.. ‘ఏసీడీ’ని పరిశ్రమల నుంచి ఏయేటికాయేడు సమీక్షించి .. వసూలు చేసే విధానం మాత్రం ఉంది. పరిశ్రమలకు ప్రతి నెలా లక్షల్లో కరెంటు బిల్లులు వస్తాయి. ఈ బిల్లులను కట్టకపోతే.. డిస్కమ్‌లు నష్టపోతాయి. ఖాయిలా పడ్డ పరిశ్రమలు బిల్లులు చెల్లించలేకపోతున్నామని .. వాటిని మాఫీ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం సహజం. ప్రభుత్వం బిల్లు మాఫీ చేస్తే .. దానిని కచ్చితంగా డిస్కమ్‌లకు చెల్లించాలి. కానీ .. చాలా సందర్భాల్లో డిస్కమ్‌లకు ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిలుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు.. పరిశ్రమలు ఏటా వినియోగించే సగటు విద్యుత్ చార్జీలకు రెట్టింపు మొత్తాన్ని ధరావతుగా డిస్కమ్‌లు వసూలు చేస్తుంటాయి. ఇప్పటి వరకూ ఈ విధానం పరిశ్రమలకూ .. భారీ స్థాయిలో విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలకు మాత్రమే వర్తించేది. కానీ .. ఇప్పుడు డిస్కమ్‌లు ముందస్తు సమాచారం వినియోగదారులకు ఇవ్వకుండానే .. గృహ విద్యుత్తు వినియోగదారుల నుంచి కూడా ధరావతును వసూలు చేయడం ప్రారంభించింది.
ఎలా వసూలు చేస్తాయి?
రాష్ట్రంలో సగటున 500 యూనిట్లను వినియోగించే విద్యుత్తు వినియోగదారులను సంపన్నవర్గాలుగా డిస్కమ్‌లు పరిగణిస్తాయి. ఈ కేటగిరీ నుంచి వార్షిక ధరావతును వసూలు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. గతంలో 500 యూనిట్లు వాడితే ఆ మేరకే బిల్లు వచ్చేది. కానీ, ఇప్పుడు సగటు వినియోగం పేరిట .. 500 యూనిట్లు దాటితే .. ఏసీడీని డిస్కమ్ వసూలు చేయాలని నిర్ణయించి.. జూన్ బిల్లుతో అందుకు సిద్ధమయ్యాయి. అయితే.. ఏసీడీ వసూలుపై డిస్కమ్‌లు చేస్తున్న వాదన వింతగానూ..వినియోగదారులను కించపరచేదిగానూ ఉంది. అధిక విద్యుత్తు బిల్లును వినియోగదారులు చెల్లించకుండా బకాయిపడితే.. తమకు నష్టాలు వస్తాయని డిస్కమ్‌లు చెబుతున్నాయి. అలా కాకుండా ఉండేందుకే .. ముందస్తుగా ధరావత్తును తీసుకుంటున్నామని వాదిస్తున్నాయి. అలా చేస్తే కరెంటు కనెక్షన్‌ను తీసేసినా డిస్కమ్‌లకు నష్టం వాటిల్లదట! అయితే.. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే .. ఈ ధరావత్తు మొత్తం నుంచి బిల్లు మొత్తాన్ని డిస్కమ్‌లు తీసుకోలేవని ఇంధన సంస్థల ఉద్యోగులు చెబుతున్నారు. వినియోగదారుల పేరిట ఈ మొత్తాలు ఖాతాల్లో కనిపిస్తాయేతప్ప దాని నుంచి వాడుకునేందుకు మాత్రం అవకాశం ఉండదని విద్యుత్తు సంస్థల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.
ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే మోయాలి
‘‘గత ఏడాది త్రైమాసికానికి సంబంధించి సర్దుబాటు పేరిట రూ.598 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. పెరిగిన విద్యుత్తు బిల్లులతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వేల రూపాయలను అదనంగా డిపాజిట్లు రూపంలో డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 200 యూనిట్లలోపు వినియోగానికి ఇచ్చే రాయితీలోనూ కోత పెట్టారు. నోటిఫై చేసిన దళిత కాలనీల్లో నివసించే వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుందంటూ సవరణలు చేశారు. నోటిఫై చేసిన ప్రాంతాలు మినహ .. మైదాన ప్రాంతాల ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగరాయితీ వర్తించదని ప్రభుత్వం మెలిక పెట్టింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర భారాన్ని మోస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత భారం పడేలా ట్రూఅప్ చార్జీలను ప్రజల నెత్తిన రుద్దడం సరికాదు. ఆ భారం ప్రభుత్వమే మోయాలి’’
- సీహెచ్ బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
598 కోట్ల ట్రూఅప్ భారానికి రెడీ.. వెబినార్‌లో ప్రజాభిప్రాయ సేకరణ
రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల పేరిట మరో బాదుడుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు దాకా విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి విద్యుత్తు ట్రూఅప్ చార్జీల పేరిట రూ.598 కోట్లను వసూలు చేయాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనపై బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వెబ్‌నార్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకుని నిరంతర విద్యుత్తు సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న డిస్కమ్‌లు .. ఆ భారాన్ని వినియోగదారుల నెత్తిన వేసేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు గల త్రైమాసికానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను వినియోగదారులనుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలని ఏపీఈఆర్‌సీని డిస్కమ్‌లు ఆశ్రయించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ఈఆర్‌సీ... ప్రజాభిప్రాయాన్ని కోరింది. అయితే.. ఇప్పటికే పెరిగిన విద్యుత్తు చార్జీల మోత .. అధిక లోడ్ వినియోగం పేరిట 500 యూనిట్లకు పైబడి విద్యుత్తు వినియోగించిన వారిపై వార్షిక కాషన్ డిపాజిట్ (ఏసీడీ) పేరిట వేలాది రూపాయల వసూళ్ల వాతలతో కరెంటు అంటేనే వినియోగదారులు భయపడిపోతున్నారు. దీంతో డిస్కమ్‌ల ప్రతిపాదనపై వినియోగదారుల్లో తీవ్ర అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వెబినార్‌లో సీపీఎం నేత సీహెచ్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-16T07:52:46+05:30 IST