కొత్తగా 250 ఎంబీబీఎస్ సీట్లు
ABN, First Publish Date - 2022-10-15T08:41:25+05:30
కొత్తగా 250 ఎంబీబీఎస్ సీట్లు
మూడు ప్రైవేటు కాలేజీలకే.. ఇందులో సగం కన్వీనర్ కోటా
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మరో 250 ఎంబీబీఎస్ సీట్లు పెంచుకునేందుకు జాతీయ వైద్య మండలి (నేషనల్ మెడికల్ కౌన్సిల్-ఎన్‌ఎంసీ) అనుమతిచ్చింది. ఏటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు ముందుప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను ఎన్‌ఎంసీ పెంచుతుంది. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా అనేక కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెంచింది. ఏపీ ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెరగలేదు. కానీ మూడు ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 250 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. రాజమండ్రిలో ఉన్న జీఎ్‌సఎల్‌వీ, ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం ఏటా 200 మంది చొప్పున ఎంబీబీఎస్ విద్యార్థులు చేరుతున్నారు. ఈ ఏడాది మరో 50 మంజూరు చేడంతో, ఆ రెండు చోట్లా 250 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. చిత్తూరుల్లో కొత్తగా ప్రారంభించిన బాలాజీ మెడికల్ కాలేజీకి 150 సీట్లతో ఎన్‌ఎంసీ అనుమతిచ్చింది. మొత్తంగా ఏపీలో కొత్తగా 250ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రయివేటు, మైనార్టీ కాలేజీల్లో కలిపి 3085 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది పెరిగిన సీట్లతో కలిపి ఏపీ విద్యార్థులకు 3335 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన 250 సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.
Updated Date - 2022-10-15T08:41:25+05:30 IST