పసుపు బోర్డు అక్కర్లేదు
ABN, First Publish Date - 2021-03-17T08:32:40+05:30
తెలంగాణలో పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ‘‘సుగంధ ద్రవ్యాల బోర్డు 50 ద్రవ్యాలకు సంబంధించి పనిచేస్తోంది.
- మీకు బోర్డు పేరు కావాలి కానీ పని వద్దనిపిస్తోంది
- పసుపు బోర్డుపై రాజకీయాలు చేయొద్దు
- లోక్‌సభలో కేంద్ర మంత్రి రూపాల వ్యాఖ్యలు
- బోర్డు ఏర్పాటుకు సమస్యేంటి?: ఎంపీ ఉత్తమ్
- ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ బ్రోకర్: అర్వింద్
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ‘‘సుగంధ ద్రవ్యాల బోర్డు 50 ద్రవ్యాలకు సంబంధించి పనిచేస్తోంది. పసుపునకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తే.. మిగతా వాటికీ చేయాల్సి వస్తుంది. అవి అవసరం లేదు. మీకు పసుపు బోర్డు పేరు కావాలి కానీ.. పని కాదనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయం చేయడం సరికాదు’’ అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం మౌఖిక సమాధానం ఇచ్చారు.
50 రకాల సుగంధ ద్రవ్యాల కోసం ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాల బోర్డు ఉందని, అయినా పసుపు కోసం ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా, పంటల ధరలు తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం నుంచి నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సి ఉంటుందని, అప్పుడు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ పద్ధతిలో పసుపునకు నిధులు కావాలని వినతి వస్తే తప్పకుండా మంజూరు చేస్తామని వివరించారు. సుగంధ ద్రవ్యాల మండీని కూడా ఏర్పాటు చేశామని, దీని వల్ల ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన 5 వేల మంది రైతులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. కాగా, పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఉన్న సమస్య ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. బోర్డు ఏర్పాటు ఆర్థిక భారం కూడా కాదని, గత ప్రభుత్వమే భూమిని కేటాయించిందని చెప్పారు.
పసుపు సాగులో తెలంగాణ టాప్
పసుపు సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18లో 294.56 వేల టన్నులు, 2018-19లో 345.27 వేల టన్నులు, 386.596 వేల టన్నుల పసుపు ఉత్పత్తయిందని వివరించారు.
కేసీఆర్‌కు ఉత్తమ్ బ్రోకర్: అర్వింద్
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బ్రోకర్‌గా మారారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాజకీయంగా అవగాహనకు వస్తున్నాయని పార్లమెంటు సాక్షిగా బయటపడిందని విమర్శించారు. ఉత్తమ్ వ్యవహారశైలి వల్లే కాంగ్రెస్ ఖాళీ అయిందని, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్, ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ ఉంటేనే తమకు లాభమన్నారు. రేవంత్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు లొంగిపోయారని ఆరోపించారు. కాగా, పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమంటూ కేంద్రం ప్రకటన చేయడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు. నెటిజన్లు కూడా వారికి మద్దతుగా నిలిచారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని, రెండేళ్లుగా రైతులను మోసం చేస్తూ వచ్చారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఛీటర్ అర్వింద్’ అంటూ ట్రెండింగ్ చేశారు. ఎంపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-03-17T08:32:40+05:30 IST