కేసీఆర్ ఆదేశాలిచ్చినా ‘మహా’ మాస్టర్ ప్లాన్ ఏదీ!?
ABN, First Publish Date - 2021-04-26T13:36:54+05:30
హైదరాబాద్ మహానగర విస్తరణకు హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రతిబంధకంగా మారింది.
- సీఎం ఆదేశాలిచ్చి రెండేళ్లపైనే
- హెచ్‌ఎండీఏ రికార్డులన్నీ ఆస్కీకి
- నేటికీ రూపుదాల్చని వైనం
- ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలుగా జోన్లు
- స్వరాష్ట్రంలో మారతాయని ఎదురుచూపులు
- సకాలంలో పరిష్కరించకపోవడంతో ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ మహానగర విస్తరణకు హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రతిబంధకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలుగా నిర్ణయించిన జోన్లు గ్రేటర్ అభివృద్ధికి ఆటంకంగా నిలిచాయి. నివాస భవనాలు వచ్చే ప్రాంతాలను సైతం మాన్యుఫ్యాక్చరింగ్, వ్యవసాయాధారిత జోన్లుగా చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రియల్టర్లు, డెవలపర్లు, పలు సంస్థలు సైతం జోన్లు మార్పు చేయాలంటూ ఛేంజ్ ఆఫ్ లాండ్ యూజ్(సీఎల్‌యూ)కు దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ పలు మార్పులతో స్వరాష్ట్రంలో సరి కొత్తగా అందుబాటులోకి వస్తుందని ఎదురు చూసినవారికీ నిరాశే మిగులుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)కు ఆవల ఐదు కిలోమీటర్ల వరకు మెరుగైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని రెండేళ్ల క్రితం ఆస్కీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఐదు మాస్టర్‌ప్లాన్లకు బదులుగా ఒకే మాస్టర్ ప్లాన్‌ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా దాని ఊసేలేదు.
ఏకీకృత మాస్టర్‌ప్లాన్‌ను తుంగలో తొక్కి..
హెచ్‌ఎండీఏ పరిధిలో గల వివిధ మాస్టర్ ప్లాన్‌లన్నింటినీ కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ఆదేశించారు. దీంతో హైదరాబాద్ మహా నగర పరిధిలో గల ఐదు మాస్టర్‌ప్లాన్లను కలిపి ఒకే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు హెచ్‌ఎండీఏలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హుడా), హైదరాబాద్ విమానాశ్రయాభివృద్ధి సంస్థ (హడా), సైబరాబాద్ అభివృద్ధి సంస్థ (సీడీఏ), మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లను కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడానికి హెచ్‌ఎండీఏలో ప్లానింగ్ విభాగం భారీ కసరత్తు చేసింది. అన్ని మాస్టర్‌ప్లాన్లను ఒకేచోటకు చేర్చిన సందర్భంలో సర్వే నంబర్లు తప్పాయి. చెరువులు, కుంటలు మాయమయ్యాయి. పలు పంచాయతీలు కూడా కనిపించకపోవడంతో వాటిని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చేందుకు రెవెన్యూ, భూరికార్డులు తదితర శాఖలను తిరిగి సమాచారం సేకరించారు. ఆపై ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్‌కు తుది రూపునిచ్చారు. ఇందుకోసం మూడేళ్లపాటు కసరత్తు జరిగింది.
ఇంతలోనే సీఎం కేసీఆర్ ఓఆర్‌ఆర్ లోపలున్న నగరం.. ఓఆర్‌ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉండే నగరం.. ఆర్‌ఆర్‌ఆర్ ఆవల మరో ఐదు కిలోమీటర్ల వరకు గల ప్రాంతాలతో మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేసే బాధ్యతను ఆస్కీకి అప్పగించారు. దాంతో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ విభాగం వద్ద గల రికార్డులన్నీ ఆస్కీకి అందజేశారు. ఏడాదిన్నర క్రితం వరకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీలకు చెందిన ప్లానింగ్ అధికారులతో మేధోమథనం జరిపారు. అయితే మహా మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ కొలిక్కిరాలేదు.
హైదరాబాద్ విశ్వనగరంగా మార్చేందుకు దోహదపడే సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జాప్యానికి కారణాలేమిటన్నదీ తెలియడం లేదు. దీనిపై హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఆస్కీకి సంబంధించిన ప్రొఫెసర్‌ను సంప్రదించినా.. వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి కనబర్చలేదు. ఐదు మాస్టర్ ప్లాన్లను కలిపి ఏకీకృత మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసే క్రమంలో తప్పులు దొర్లడం, వాటిని సరిచేయడానికి ఏళ్ల సమయం పట్టింది. కానీ సరికొత్త మాస్టర్‌ప్లాన్‌లో మూడు విభాగాల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్, మల్టీపర్పస్, కన్వర్జెన్సీ జోన్లను విభజించడం సులువుగానే సాధ్యం కాగలదని తెలుస్తోంది. సరికొత్త మాస్టర్‌ప్లాన్‌తో నగర శివారు ప్రాంతాల అభివృద్ధి, దాంతో పాటే ప్రభుత్వ ఆదాయం పెరగడానికి అవకాశాలుంటాయి. కానీ ఆ దిశగా సర్కారులో మాత్రం చలనం లేదు.
జరగని రూపకల్పన
ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆవల ఐదు కిలోమీటర్ల వరకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను అడ్మినిస్ర్టేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ)చేపట్టింది. కానీ నేటికి మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన జరగలేదు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను మూడు భాగాలుగా చేస్తూ రూపొందించే మాస్టర్‌ప్లాన్‌కు 2019లోనే ఆమోదముద్ర పడుతుందని అధికార వర్గాలు భావించాయి. ఈ సరికొత్త మాస్టర్‌ప్లాన్‌తో శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి బీజం పడటంతోపాటు రియల్టీ రంగంలో పెనుమార్పులు వస్తాయనే ఊహించారు. నోట్లరద్దు, కొవిడ్-19తో ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్ రియాల్టీకి సరికొత్త మాస్టర్ ప్లాన్ మరింత ఊపునిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ నేటికి మాస్టర్‌ప్లాన్‌కు ఆస్కీ తుదిరూపం ఇవ్వలేదు.
Updated Date - 2021-04-26T13:36:54+05:30 IST