ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్టర్‌ప్లాన్‌ మర్చిపోయెన్‌!

ABN, First Publish Date - 2021-04-12T05:02:45+05:30

మాస్టర్‌ప్లాన్‌ మర్చిపోయెన్‌!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊసేలేని గ్రేటర్‌ వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌

యేళ్ల తరబడి జాప్యం.. నగర ప్రజల్లో నైరాశ్యం

50 ఏళ్ల కిందటిదే ఇప్పటికీ అమలు

మంత్రి కేటీఆర్‌ దృష్టి పెట్టాలంటున్న నగరవాసులు


వరంగల్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాస్టర్‌ప్లాన్‌.. నగర ప్రజలకు అందని ద్రాక్షగా మారిపోయింది. అదిగో మాస్టర్‌ ప్లాన్‌... ఇదిగో మాస్టర్‌ ప్లాన్‌.. అని చెప్పడమే తప్ప అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో వరంగల్‌ మహానగరంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఆగిపోయింది. నగరంలో ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం పెరిగిపోతోంది. రింగ్‌రోడ్డుల దిశలు మార్చడం వెనుక అధికార పార్టీ నేతల రియల్‌ హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయిందనుకున్న దశలో తిరిగి మొదటికి వస్తోందనే విమర్శలున్నాయి. సోమవారం నగరానికి వస్తున్న కేటీఆర్‌ దీనిపై దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

హైదరాబాద్‌ తర్వాత అతిపెద్దదైన వరంగల్‌.. కనీస ప్రణాళికలు లేని అసౌకర్యాల నగరంగా కునారిల్లుతోంది. తాగునీరు, పారిశుధ్యం, డ్రెయినేజీ వ్యవస్థలు సైతం సమగ్ర రూపం సంతరించుకోలేదు. వరంగల్‌ -హన్మకొండ ప్రధాన రహదారి తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేకుండాపోయింది. ఈ రహదారి ఇరువైపులా భవనాలు మాత్రమే వరంగల్‌కు నగర శోభను తెప్పిస్తాయి. కాస్తంత లోపలికి వెళ్లితే సకల అసౌకర్యాలతో కనిపించే మురికివాడలు దర్శనమిస్తాయి. బతుకుదెరువు కోసం పల్లె నుంచి పట్నంకొచ్చిన పేదలతో అనేక మురికివాడలు వెలిశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంలో 182 మురికివాడలు ఉన్నాయి. ఈ వాడల్లో కనీససౌకర్యాలు లేకుండా పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


50 ఏళ్ల కిందటి..

వరంగల్‌ నగరానికి 50ఏళ్ల కిందట రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటికీ అమల్లో ఉంది. మొట్టమొదటిసారి 1949లో వరంగల్‌ నగరానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. అనంతరం మరోసారి పదేళ్ల కోసం అంటే 1961 నుంచి 1971 వరకు అప్పటి అవసరాల కు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ఇక తిరిగి 1971-1991వరకు అంటే 20 ఏళ్ల కోసం రూపొందించారు. కేవలం 4,21,200 జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించారు. ఇపుడు నగర జనాభా ఏకంగా పది లక్షలు దాటింది. ఆ తర్వాత మాస్టర్‌ప్లాన్‌ రూపొందించే ప్రక్రియ కొనసాగడం తప్ప అమలు మాత్రం నోచుకోలేదు. 


అభివృద్ధి ఎట్లా చేసేది?

మాస్టర్‌ప్లాన్‌ ఉన్నట్టో లేనట్టో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. దీనివల్ల ప్రధానంగా భూ మార్పిడి పెద్ద సమస్యగా మారుతోంది. 1971 మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ భూమిగా ఉన్న ప్రాంతం ఇపుడు ఆవాస ప్రాంతాలుగా మారాయి. ఆవాసప్రాంతాలు కమర్షియల్‌ ప్రాంతాలుగా మారాయి. పరిశ్రమల కోసం కేటాయించిన భూములన్నీ కూడా నివాస ప్రాంతాలయ్యాయి. అన్నిటికీ మించి పార్క్‌ ఏరియాలుగా గుర్తించిన ప్రాంతాల్లో పెద్ద అపార్ట్‌మెంట్‌ సముదాయాలు వెలిశాయి. ఏ ప్రాంతంలో ఎంత వెడల్పు ఉన్న రోడ్డు ఉంటుందో తెలియని దుస్థితి. విలీన గ్రామాలు గతంలో కూడా ఎలాంటి మాస్టర్‌ ప్లాన్‌లు లేకపోవడంతో భారీ నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. గ్రీన్‌ ఏరియా అని గుర్తించిన ప్రాంతాలన్నీ నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో 150 ఫీట్ల ప్రధాన రోడ్లు ఉంటాయని చెబుతూనే 100 ఫీట్ల రోడ్లకే డ్రెయినేజీ కాలువలు నిర్మిస్తున్నారు. అన్నిటికీ మించి నాలాల డిమార్కేషన్‌ లేకపోవడంతోపాటు బఫర్‌జోన్‌లుగా గుర్తించలేకపోతున్నారు. మాటలతోనే ఇదీ నాలా.. ఇక్కడి వరకు బఫర్‌జోన్‌.. అని అధికారులు చెబుతున్నప్పటికీ న్యాయ స్థానాల్లో నిలువ లేకపోతోంది. మాస్టర్‌ప్లాన్‌ అమలుకాక పోవడంతో సరైన డాక్యుమెంట్లను చూపించలేకపోతున్నారు. దీంతో నాలాలు, రోడ్లు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి.


వందల కోట్ల నష్టం

మాస్టర్‌ప్లాన్‌ లేకపోవడంతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని బల్దియా కోల్పోతోంది. ఇక్కడ హైదరాబాద్‌ తరహాలో ఒక్కో ఇల్లు కోటికి పైగా విలువచేసే గేటెడ్‌ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వీటి ఆదాయం పోతోంది. అంతేకాకుండా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించే బిల్డర్లు సందిగ్ధావస్థలో ఉన్నారు. ఏ మాస్టర్‌ప్లాన్‌ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ఒకవేళ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ అమల్లోకి వస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. బడా బిల్డర్లకు సైతం మాస్టర్‌ప్లాన్‌ అడ్డంకిగా మారుతోంది. ఫలితంగా వందల కోట్ల వ్యాపారాలు ఆగిపోతున్నాయి. నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఒకనిర్ణీత గడువు విధించి మాస్టర్‌ప్లాన్‌ అమలయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని నగరానికి మంత్రి కేటీఆర్‌ను వరంగల్‌ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-04-12T05:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising