చౌక టీకా
ABN, First Publish Date - 2021-06-06T06:05:53+05:30
ఫార్మా హబ్ హైదరాబాద్.. దేశానికి మరో కరోనా వ్యాక్సిన్‌ను అందించబోతోంది. అది కూడా ఇప్పటిదాకా విడుదలైన టీకాల కంటే చాలా తక్కువ ధరకే. ‘కార్బెవాక్స్’ కరోనా టీకాను రూ.500కే
హైదరాబాద్ నుంచి అతి తక్కువ ధర
కరోనా వ్యాక్సిన్‌గా ‘కార్బెవాక్స్’
రెండు డోసుల ధర రూ.500 మాత్రమే.. అభివృద్ధిచేసిన బయోలాజికల్-ఈ
30 కోట్ల డోసులు కొనుగోలు చేయనున్న కేంద్రం.. ఆగస్టు నుంచే టీకాల ఉత్పత్తి ప్రారంభం
మొదటి, రెండోదశ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు.. కొనసాగుతున్న మూడోదశ పరీక్షలు
హైదరాబాద్, జూన్ 5: ఫార్మా హబ్ హైదరాబాద్.. దేశానికి మరో కరోనా వ్యాక్సిన్‌ను అందించబోతోంది. అది కూడా ఇప్పటిదాకా విడుదలైన టీకాల కంటే చాలా తక్కువ ధరకే. ‘కార్బెవాక్స్’ కరోనా టీకాను రూ.500కే రెండు డోసులు అందించనున్నట్లు భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ‘బయోలాజికల్-ఈ’ కంపెనీ అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ధర మరింత తగ్గి, రూ.400 దిగువకు వచ్చినా ఆశ్చర్యం లేదంటూ ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ప్రచురించింది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం.. తక్కువ ధరకు లభించనున్న ‘కార్బెవాక్స్’ టీకా 30 కోట్ల డోసుల కొనుగోలుకు ఈనెల 3నే ముందస్తు ఆర్డరు ఇచ్చింది. ఇందులో భాగంగా రూ.1,500 కోట్లను బయోలాజికల్-ఈకి అడ్వాన్స్‌గా చెల్లించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యకాలంలో 30 కోట్ల డోసులను భారత ప్రభుత్వానికి బయోలాజికల్-ఈ సరఫరా చేయనుందని, ఈక్రమంలో ప్రతినెలా దాదాపు 7 నుంచి 8 కోట్ల ‘కార్బెవాక్స్’ డోసుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. ‘కార్బెవాక్స్’.. రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌బీడీ) ప్రొటీన్ సబ్ యూనిట్ రకానికి చెందిన కరోనా వ్యాక్సిన్. అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి హెపటైటి్‌స-ఈ వ్యాక్సిన్ తయారీ పద్ధతిలో ‘కార్బెవాక్స్’ను బయోలాజికల్-ఈ అభివృద్ధిచేసింది. దీనికి సంబంధించిన మొదటి, రెండోదశ ప్రయోగ పరీక్షలు 2020 నవంబరు రెండో వారంలో ప్రారంభమవగా, ఇటీవల పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్‌కు బిల్‌గేట్స్ ఫౌండేషన్, భారత ప్రభుత్వం సహ వ్యవస్థాపకులుగా ఉన్న కొయెలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ)తో పాటు భారత సర్కారు పరిధిలోని బయోటెక్నాలజీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఏఆర్‌ఏసీ) సంయుక్త సహకారాన్ని అందించాయి. ఇందులో భాగంగా 18-65 ఏళ్లలోపు 360 మంది ఆరోగ్యవంతులైన వ్యక్తులపై ‘కార్బెవాక్స్’ను పరీక్షించగా.. భద్రత, రోగ నిరోధక ప్రతిస్పందన విషయంలో టీకా ఆశాజనక, సానుకూల ఫలితాలను ఇచ్చిందని గుర్తించినట్లు బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 15 ప్రాంతాల్లో మూడోదశ ప్రయోగ పరీక్షలు వేగవంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు.
18-80 ఏళ్లలోపు 1268 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై టీకాను పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు నుంచి టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ప్రభుత్వం నుంచి అత్యవసర వినియోగ అనుమతులు మంజూరవగానే డోసుల సరఫరాను ప్రారంభిస్తామన్నారు. ‘మా వ్యాక్సిన్ ధర తప్పకుండా చాలా తక్కువగా ఉంటుంది. టీకా ధరలను పెంచి.. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు మేం ఏమాత్రం ప్రయత్నించబోం’’ అని మహిమ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొవిషీల్డ్ టీకా ఒక్కో డోసు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300, ప్రైవేటు సంస్థలకు రూ.600కు లభిస్తోంది. హైదరాబాద్‌కే చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కొవాగ్జిన్ టీకా ఒక్కో డోసును రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు సంస్థలకు రూ.1200కు అందజేస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకా డోసును రూ.995కు విక్రయిస్తున్నారు. వీటన్నింటితో పోలిస్తే.. బయోలాజికల్-ఈకి చెందిన ‘కార్బెవాక్స్’ టీకా చౌకైనది.
ఈ టీకా ఎలా పనిచేస్తుందంటే..
కరోనా వైర్‌సకు ఆయువుపట్టు దాని ఉపరితలంపై ఉండే ‘స్పైక్ ప్రొటీన్’. దీనితోనే రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌బీడీ) ప్రొటీన్ సబ్ యూనిట్ రకానికి చెందిన ‘కార్బెవాక్స్’ను అభివృద్ధి చేశారు. మానవ శరీర కణంలోకి వైరస్ ప్రవేశించేందుకు బాటలు సిద్ధం చేసేది స్పైక్ ప్రొటీనే. ఆర్‌బీడీ రకం టీకాల ద్వారా ఈ స్పైక్ ప్రొటీన్‌ను మానవ శరీరంలోకి పంపుతారు. రోగ నిరోధక వ్యవస్థ దీన్ని చూసి, నిజమైన కరోనా వైరసే అయి ఉంటుందని భావించి ప్రతిస్పందిస్తుంది. దాన్ని తిప్పికొట్టే యాంటీబాడీలను విడుదల చేస్తుంది.
ఈ ప్రతిస్పందనను రోగ నిరోధక వ్యవస్థలోని మెమొరీ సెల్స్ తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. ఒకవేళ భవిష్యత్తులో నిజమైన కరోనా వైరసే శరీరంలోకి ప్రవేశిస్తే.. గతంలో దాన్ని ఎదుర్కొన్న అనుభవంతో తక్షణం బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను విడుదల చేస్తుంది. ఈ సూత్రం ప్రాతిపదికనే బయొలాజికల్-ఈకి చెందిన ‘కార్బెవాక్స్’ పనిచేస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ తరహా పరిజ్ఞానాన్ని హెపటైటిస్-బి వ్యాక్సిన్ల తయారీకి వినియోగిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో అభివృద్ధిచేసిన మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌గా ‘కార్బెవాక్స్’ నిలువనుంది. ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్‌ఎన్‌ఏ రకానికి చెందినవి కాగా, కొవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్-విలు వైరల్ వెక్టర్ వ్యాక్సిన్లు. కొవాగ్జిన్, సినోవ్యాక్, వెరోసెల్ (సినోఫార్మ్) టీకాలు ఇన్‌యాక్టివేటెడ్ రకపు టీకాలు.
Updated Date - 2021-06-06T06:05:53+05:30 IST