సూపర్‌స్ర్పెడర్స్‌కు టీకా రేపటి నుంచే..!
ABN, First Publish Date - 2021-05-27T09:25:55+05:30
రాష్ట్రంలో సూపర్‌స్ర్పెడర్స్‌గా గుర్తించిన వివిధ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వ్యాక్సిన్‌ను అందించాలని నిర్ణయించింది.
- 7.75 లక్షల మందికి తొలుత చాన్స్..
- జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 లక్షల మంది సూపర్ స్ర్పెడర్స్
- గుర్తింపు కార్డుతో టీకా కేంద్రాలకు..
- జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా సీఎం గుర్తించారు
- 28, 29 తేదీల్లో జర్నలిస్టులకు టీకా..
- అందుబాటులో 8.68 లక్షల డోసులు: గడల
హైదరాబాద్, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సూపర్‌స్ర్పెడర్స్‌గా గుర్తించిన వివిధ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వ్యాక్సిన్‌ను అందించాలని నిర్ణయించింది. ఈ నెల 28న వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. సూపర్‌స్ర్పెడర్స్‌లో తొలుత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్లు 7.75 లక్షల మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివా్‌సరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇందులో ఆరు లక్షల మందికిపైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నారు. వ్యాక్సిన్ అందుకోబోయే సూపర్‌స్ర్పెడర్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్యాస్, పెట్రోల్ డీలర్ల సిబ్బంది, చౌకధరల దుకాణాల డీలర్లు, లిక్కర్ షాప్ సిబ్బంది ఉన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతుబజార్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయలు, పూలు, పళ్లు అమ్మేవాళ్లు, చికెన్, మటన్‌షాపుల్లో పని చేసేవారితో పాటు కిరాణా, బార్బర్ షాపుల్లో పని చేసేవారికి వ్యాక్సిన్ వేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాక్సిన్ అందుకోబోయే వీరి సంఖ్య ఆరు లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ విషయమై రవాణా, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేస్తారు.
ఇతరుల సమన్వయ బాధ్యతను జీహెచ్‌ఎంసీ చూసుకుంటుంది. ఇక చౌకధరల దుకాణాల డీలర్లు, అందులో పని చేసేవారు(33,980), ఎల్‌పీజీ పంపిణీదారులు, వర్కర్ల(49616)తో పాటు ఎఫ్‌సీఐలో పని చేసే మరో 1435 మందిని కూడా ప్రభుత్వం సూపర్‌స్ర్పెడర్స్ జాబితాలో చేర్చి వారికి కూడా టీకా అందించాలని నిర్ణయించింది. పౌరసరఫరాలశాఖ, ఆయా జిల్లాల కలెక్టర్లు వీరిని సమన్వయపరుస్తారు. ఎరువుల దుకాణదారులు అందులో పని చేసే వర్కర్లు మరో 30 వేల మంది ఉన్నారని అంచనా. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో టీకా కోసం రావాలంటే ఎలా అన్న సందేహాలు సూపర్ స్ర్పెడర్స్‌లో నెలకొన్నాయి. వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే వారు తమ గుర్తింపు కార్డును పోలీసులకు చూపించాల్సి ఉంటుందన్నారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో ప్రజారవాణా సౌకర్యం లేదు. టీకా కోసం రావాలంటే సొంత వాహనాలున్న వారికి ఇబ్బంది ఉండదు. కానీ సొంత వాహనాలు లేని వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది.
ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా జర్నలిస్టులు!
రాష్ట్రంలోని జర్నలిస్టులను ప్రంట్‌లైన్ వర్కర్లుగా సీఎం కేసీఆర్ గుర్తించారని గడల శ్రీనివాసరావు తెలిపారు. 20 వేల మంది జర్నలిస్టులకు కూడా వ్యాక్సినేషన్ అందించనున్నామని చెప్పారు. సమాచార, పౌర సంబంధాల శాఖతో సమన్వయం చేసుకుంటామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 8.68 లక్షల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కాగా ప్రస్తుతం 244 ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సినేషన్‌ను ఇస్తున్నాయని చెప్పారు. త్వరలో 1200 ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ విషయంలో ఆస్పత్రులకు ఎలాంటి ఆంక్షలు లేవని, వర్క్ ప్లేస్‌లో వ్యాక్సినేషన్ ఇవ్వొచ్చని చెప్పారు.
ఐదుచోట్ల జర్నలిస్టులకు వ్యాక్సిన్
జర్నలిస్టుల కోసం హైదరాబాద్‌లో ఐదు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్-హెచ్‌ఆర్డీ, చార్మినార్‌లోని యునాని ఆస్పత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 28, 29 తేదీల్లో జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. జర్నలిస్టుల ఆధార్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు తీసుకెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది జర్నలిస్టులుండగా.. వారిలో 3700 మంది రాష్ట్రస్థాయి జర్నలిస్టులున్నారని వివరించారు.
టీయూడబ్ల్యూజే హర్షం
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రభుత్వం గుర్తించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ బుధవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది. యూనియన్ విజ్ఞప్తి మేరకు ్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇప్పటికైనా జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, మారుతీ సాగర్ పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డు లేకపోయినప్పటికీ ఎం ప్యానల్‌లో ఉన్న పత్రికలు, ఛానల్స్‌లో పనిచేసే జర్నలిస్టులకూ వాక్సినేషన్ అందించాలని కోరారు.
Updated Date - 2021-05-27T09:25:55+05:30 IST