అద్దెకున్న మిద్దెపై కుండీల్లో గంజాయి సాగు
ABN, First Publish Date - 2021-11-08T08:48:31+05:30
బయట ఎవరి దగ్గరనో కొనడం.. దానిని తెచ్చుకుంటూ పోలీసు తనిఖీల్లో దొరకడం ఎందుకు..? ఏకంగా మనమే గంజాయి మొక్కలు పెంచి, అవసరానికి వాడుకుని ఆపై కావాల్సిన వారికి అమ్మితే ఆదాయం కూడా..
మొత్తం ఏడు కుండీల్లో మొక్కల పెంపకం.. తన అవసరంతో పాటు అమ్మకానికి పథకం
బయట కొని పట్టుబడితే ఇబ్బందని ఆలోచన
హైదరాబాద్‌లో బేకరీ నిర్వాహకుడి నిర్వాకం
నగరంలో ఇటీవల కాలంలో రెండో ఘటన
జవహర్‌నగర్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): బయట ఎవరి దగ్గరనో కొనడం.. దానిని తెచ్చుకుంటూ పోలీసు తనిఖీల్లో దొరకడం ఎందుకు..? ఏకంగా మనమే గంజాయి మొక్కలు పెంచి, అవసరానికి వాడుకుని ఆపై కావాల్సిన వారికి అమ్మితే ఆదాయం కూడా వస్తుంది కదా..? అనుకున్నాడో వ్యక్తి. ఆలోచన వచ్చిందే తడవుగా మొక్కలు తెచ్చి.. ఇంటిపై కుండీల్లో సాగు చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్ జవహర్‌నగర్‌కు చెంది న వ్యక్తి నిర్వాకమిది. స్థానికంగా బేకరీ నడిపే పిల్లుట్ల వెంకట నర్సింహశాస్త్రి కొన్నాళ్ల క్రితం కుటుంబంతో పాటు నేరేడ్‌మెట్ డివిజన్ యాప్రాల్ గోదావరి గార్డెన్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఇతడికి గంజాయి అలవాటుంది. అయితే, ఇటీవల పోలీసు నిఘా పెరగడంతో ‘సరుకు’ లభించడం కష్టంగా మారింది. వ్యసనం వీడలేని నర్సింహ శాస్త్రి ఇంటిపైనే మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. ఇందుకు కొత్తగా కుండీలు కొని ఏడు మొక్కలు వేశాడు. ఇంటి యజమాని విదేశాల్లో ఉండడంతో పట్టించుకునేవారు లేరు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
కుండీల్లో 4 అడుగుల మేర పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. అల్వాల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నర్సింహ శాస్త్రిని అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్‌లో ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నా యి. ఇటీవల మణికొండలోని ఓ ఫ్లాట్‌లో యువకుడు ఇలానే చేస్తూ పట్టుబడ్డాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే వందల కిలోల గంజాయితోపాటు పదుల సంఖ్యలో విక్రేతలను, సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో.. మత్తుకు అలవాటు పడ్డవారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇళ్లలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించారు.
Updated Date - 2021-11-08T08:48:31+05:30 IST