57 పరీక్షలు ఫ్రీ
ABN, First Publish Date - 2021-06-06T06:45:43+05:30
రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు సహా వివిధ రోగ నిర్ధారణ పరీక్షలకు ఇకనుంచి ప్రైవేటు ల్యాబ్‌లకు, ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటిని ప్రభుత్వ దవాఖానాల్లోనే చేస్తారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు వీటిలో చేయనున్నారు.
19 జిల్లా దవాఖానాల్లో డయాగ్నోసిస్ కేంద్రాలు
అవసరమైతే మరిన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు
ఉచితంగా రక్తం, మూత్రం, ఇతర టెస్టులు
ఈసీజీ, టుడి ఇకో, అలా్ట్రసౌండ్, ఎక్స్‌రే కూడా
అవసరమైతే సీటీ స్కాన్ యంత్రాల ఏర్పాటు
రేపటి నుంచే పరీక్షలు ప్రారంభం.. సీఎం ఆదేశం
వైద్య రంగంలోనే ఇదో విప్లవాత్మకమైన నిర్ణయం
అరుదుగా చేసే ఖరీదైన పరీక్షలూ ఉచితమే
ఇందుకు అత్యంత ఆధునిక యంత్రాల వినియోగం
అవసరమైన సిబ్బందినీ నియమించాం: కేసీఆర్
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు సహా వివిధ రోగ నిర్ధారణ పరీక్షలకు ఇకనుంచి ప్రైవేటు ల్యాబ్‌లకు, ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటిని ప్రభుత్వ దవాఖానాల్లోనే చేస్తారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు వీటిలో చేయనున్నారు. అది కూడా ఉచితంగా! వాటి ఫలితాలను కూడా రోగి సెల్‌ఫోన్‌కే మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. జూన్ ఏడో తేదీ (సోమవారం) నుంచే వీటిని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. నిజానికి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ ప్రధాన వైద్య కేంద్రాల్లో ఇప్పటికే డయాగ్నోసిస్ కేంద్రాల ఏర్పాటు పూర్తయింది.
వీటిలో సోమవారం నుంచి సేవలు ప్రారంభిస్తారు. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో అవసరమైతే మరికొన్నిచోట్ల కూడా ఇటువంటి డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈసీజీ, టుడి ఇకో, అల్ర్టాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే వంటి ఇమేజింగ్ పరీక్షలను కూడా వీటిలో అందుబాటులోకి తెచ్చామన్నారు. అవసరమైతే సీటీ స్కాన్ యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘రోగం కంటే నిర్ధారణ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువైంది. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం, మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందే. ఇప్పుడు ప్రతి మనిషికి బీపీలు, షుగర్లు ఎక్కువయినయి. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, కేన్సర్, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిత్యం అవసరంగా మారా యి. వీటికితోడు, కరోనా కొత్తగా జబ్బుల జాబితాలో చేరింది.
దానికీ పలు రకాల పరీక్షలు అవసరం. ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ పరీక్ష చేసి టెస్టులు రాస్తే, ప్రైవేటులో చేయించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. పైగా ఆర్థిక భారం. కొవిడ్ నిర్ధారణ, చికిత్సతోపాటు ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అందుకే, వైద్యాన్ని అందించడమంటే కేవలం డాక్టర్లు, మందులు, సూదులు మాత్రమే కాదని, పరీక్షలు కూడా అత్యంత ప్రాధాన్య అంశంగా ప్రభుత్వం భావించింది. తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. అవసరమైనచోట్ల దశలవారీగా ఇంకా ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు. ఇటువంటి ఏర్పాటు ప్రభుత్వ వైద్య రంగంలోనే విప్లవాత్మకమని, పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అనడానికి నిదర్శనమని అన్నారు. వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాల ని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం నిర్దేశించారు. కరోనా ఆపత్కాలంలో ఈ డయాగ్నోసిస్ కేంద్రాలు ప్రజలకెంతో మేలు చేస్తాయన్నారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరు పెడతామన్నారు.
ఖరీదైన పరీక్షలూ ఉచితమే
ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. వాటిలో కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్, గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి పరీక్షలు చేస్తారన్నారు. అలాగే, ఎక్స్‌రే, బయోకెమిస్ర్టీ పాథాలజీకి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయని తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా అత్యంత అరుదుగా చేసే ఖరీదైన ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని తెలిపారు. సదరు రిపోర్టులను ఆయా రోగుల సెల్ ఫోన్లకు మేసేజ్‌ల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందన్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీల్లో చికిత్స చేయించుకున్న రోగి స్వయంగా ఈ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితులు ఉంటాయని, అటువంటి వారి కోసం సర్కారే రోగి శాంపిల్‌ను సమీపంలోని కేంద్రానికి పంపుతుందని అన్నారు.
గంటకు 400-800 రిపోర్టులు
ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంత్రాలన్నీ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఖరీదైనవని చెప్పారు. ‘‘ఇటువంటి యంత్రాలు పెద్ద పెద్ద కార్పొరేట్ దవాఖానల్లో.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేసింది. వీటిలో ‘ఫుల్లీ ఆటోమెటిక్ క్లినికల్ కెమిస్ర్టీ అనలైజర్’, ‘ఫుల్లీ ఆటోమెటిక్ ఇమ్యునోస్సే అనలైజర్’, ‘5-పార్ట్ సెల్ కౌంటర్’, ‘ఎలీసా రీడర్ అండ్ వాషర్’, ‘ఫుల్లీ ఆటోమెటిక్ యూరిన్ అనలైజర్’ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు ఈసీజీ, టుడి ఇకో, అల్ర్టాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే వంటి యంత్రాలను కూడా ఏర్పాటు చేశామని, ఇవి అత్యంత సామర్థ్యంతో కూడుకున్నవని తెలిపారు.
అత్యంత వేగంగా రిపోర్టులు ఇస్తాయని, ఒక్కో మిషన్ గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంతో ఇస్తుందని వైద్యాధికారులు తనకు చెప్పారని కేసీఆర్ వివరించారు. ఈ కేంద్రాల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రో బయాలజిస్టులు, రేడియాలజిస్టులు సహా పరీక్షలను నిర్వహించేందుకు అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ‘‘వైద్య అవసరాల కోసం నాలుగు రకాల ఖర్చులుంటయి. దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు, పోయినంక డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్ పేషెంట్‌గా చేరితే ట్రీట్మెంట్ ఖర్చు, రోగం నయమయినంక తిరిగి ఇంటికి పోవాలంటే మల్లా రవాణా ఖర్చు. ఒకవేళ, చనిపోతే పార్థివ దేహాన్ని తరలించడానికి అదో ఖర్చు. ఇన్ని తీర్ల ఖర్చులుంటయి. వీటన్నిటినీ ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వ దవాఖానలో పూర్తి ఉచితంగా సామాన్యులకు వైద్య సేవలు అందిస్తోంది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
వైద్య చరిత్రలోనే మైలురాయి
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, అన్ని రకాల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. సామాన్యుడికి వైద్యా న్ని మరింతగా అందుబాటులోకి తెచ్చిన ప్రభు త్వం ఆరోగ్య తెలంగాణ సాకారం చేసే దిశగా మరో ముందడుగు వేస్తోందని చెప్పారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని ఆయన తెలిపారు.
సీఎం కామారెడ్డి పర్యటన రద్దు
ఈ నెల 10న కామారెడ్డి జిల్లాకు ఖరారైన సీఎం కేసీఆర్ పర్యటన రద్దయినట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన కామారెడ్డిలో నిర్మించిన నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 10న సీఎం చేతుల మీదుగా కలెక్టరేట్, పోలీసు కార్యాలయ భవనాలను ప్రారంభించాల్సి ఉందన్నారు. ఆ రోజు అమావాస్య కావడంతో కార్యక్రమా న్ని రద్దు చేసినట్లు చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం పర్యటన తేదీని ఖరారు చేస్తామన్నారు.
Updated Date - 2021-06-06T06:45:43+05:30 IST