ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలది ఆత్మవంచన!

ABN, First Publish Date - 2021-07-15T08:13:12+05:30

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవం కోసం పోరాడటం లేదని, ఆత్మవంచన చేసుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ వల్లనే రాజేందర్‌ లీడర్‌గా ఎదిగారు

టీఆర్‌ఎస్‌ నీడలో ఆర్థికంగా బలోపేతమయ్యారు

ఈటల సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు

అన్నీ తెలిసినా సంయమనం పాటించాం

అయినా ఆయన పార్టీలో ఉండాలని చూశాను

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పార్టీల మధ్యే పోటీ

మనం వద్దనుకున్నవారే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు

నీటి వాటాల్లో న్యాయం తెలంగాణ వైపే

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు

పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం


హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవం కోసం పోరాడటం లేదని, ఆత్మవంచన చేసుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ పార్టీలో ఉన్నంతకాలం ఈటలకు ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. ఆయనకు ఏనాడూ నష్టం చేయలేదన్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శుల అంతర్గత భేటీలో, అనంతరం మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన 2003 నుంచి ఎంత కష్టమైనప్పటికీ పార్టీ టికెట్‌ ఇచ్చిందని, ఆయన లీడర్‌గా ఎదిగిందే కేసీఆర్‌ వల్ల అని అన్నారు. ‘‘ఉద్యమ సమయంలో కేసీఆర్‌.. సీనియర్‌ ఎమ్మెల్యేలను కూడా పక్కనపెట్టి ఈటల రాజేందర్‌కు పార్టీ శాసనసభాపక్ష నేతగా అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి వరుసగా రెండుసార్లు ఆయనకు మంత్రి పదవులు ఇచ్చారు.


అంతేకాదు.. ఈటలకు మెడికల్‌ కాలేజీ కూడా ఇప్పించారు’’ అని కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ నీడలో రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతమైన ఈటల.. ఇక్కడ పదవులు అనుభవిస్తూ, ఇతర పార్టీల వారితో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ‘‘సీఎం కేసీఆర్‌ను తిట్టే వాళ్లతో మాట్లాడారు. బీజేపీతో అనుబంధం పెంచుకున్నారు. కేబినెట్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై అక్కడ మాట్లాడకుండా, సానుభూతి కోసం ప్రజల వద్ద తప్పుబట్టారు. తనకు తానుగా టీఆర్‌ఎ్‌సకు దూరమయ్యారు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 


ఈటల ఆత్మవిమర్శ చేసుకోవాలి..

టీఆర్‌ఎస్‌ ఎంత ఇచ్చిందో ఈటల ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఆయనకు పార్టీలో జరిగిన అన్యాయమేంటో కూడా చెప్పాలని కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌తో ఐదేళ్ల నుంచి గ్యాప్‌ ఉంటే.. కేబినెట్‌లో మంత్రిగా ఎందుకు కొనసాగారని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చిన భూములను ఈటల రాజేందర్‌ కబ్జా చేశారని అనామకులు ఉత్తరం రాస్తేనే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదని, తగిన ఆధారాలు ఉండటం వల్లనే చర్యలు చేపట్టారని వెల్లడించారు. ఐదేళ్ల నుంచి మంత్రి హోదాలో ఉండి అనేకమార్లు అడ్డంగా మాట్లాడినా.. సీఎం కేసీఆర్‌ ఆయనను కేబినెట్‌లో కొనసాగించారని గుర్తు చేశారు. ‘‘ఈటల తప్పు చేయకుండానే ఒప్పుకొన్నారా? ఆయనపై సానుభూతి ఎలా వస్తుంది?’’ అని ప్రశ్నించారు.


ఈటల రాజేందర్‌ను కాపాడుకోవటానికి ఆయన చివరి వరకు పార్టీలో ఉండాలని తాను వ్యక్తిగతంగా ప్రయత్నం చేశానని కేటీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కలవబోనని ఈటల ఒకసారి ప్రకటన చేసిన తర్వాత తాను మాత్రం ఏం చేయగలనని అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈటల చేస్తున్న పనులు అనేకం తెలిసినప్పటికీ, చాలా సంయమనం పాటించామన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి, సీఎం కేసీఆర్‌ నుంచి లబ్ధి పొంది, నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్‌.. కుట్రలు, కుతంత్రాలు చేసి, ఇప్పుడు కన్నతల్లి లాంటి పార్టీనే నిందించటాన్ని సహించేది లేదన్నారు. 


పాదయాత్ర ఎందుకో సంజయ్‌ చెప్పాలి..

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, దాని పరమార్థం ఏమిటో ఆయనకే తెలియాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చి, తెలంగాణకు ఇవ్వటంలేదని విమర్శించారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా బీజేపీ మారిందని విమర్శించారు. ‘‘ఈ మధ్య రాష్ట్రంలో మిగతా పార్టీల నాయకత్వాలు మారాయి. కొత్తలో వారికి జోష్‌ ఉంటుంది. ఉనికి కోసం ఏదో మాట్లాడుతుంటారు. దానికి హైరానా పడాల్సిన అవసరంలేదు.


పార్టీగా వాటిని ఎక్కడికక్కడ తిప్పికొడితే చాలు. ఈ దిశగా కేడర్‌ను చైతన్యపరచండి. ప్రభుత్వంలో ఉన్న మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వాటిని ప్రజలకు వివరించండి’’ అని మంత్రి కేటీఆర్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. జల వివాదాల్లో న్యాయమే గెలుస్తుందని, నీటి వాటాలకు సంబంధించి న్యాయం తెలంగాణ వైపే ఉందని అన్నారు. ఏపీ ఎన్ని కేసులు వేసినా.. తాము న్యాయబద్ధంగానే ముందుకెళ్తామని చెప్పారు. 


వచ్చే నెలలో కమిటీలు

టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, జిల్లా కమిటీలను వచ్చే నెలలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 20లోగా సభ్యత్వ నమోదు, వాటి వివరాల డిజిటలైజేషన్‌ పూర్తి కావాలన్నారు. ఈ నెల 31తో పార్టీ సభ్యుల జీవిత బీమా గడువు ముగుస్తోందని, దానిని కొనసాగించటానికి సభ్యుల వివరాల డిజిటలైజేషన్‌ పూర్తి తప్పనిసరి అని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన మేరకు పార్టీ కార్యకలాపాలను పెంచాలని, కేడర్‌ను యాక్టివ్‌ చేయాలని సూచించారు.  ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదుపై కేటీఆర్‌ సమీక్ష జరిపారు. సమావేశం నుంచి కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడి, వారి నియోజకవర్గాల్లో నమోదు చేయించిన సభ్యత్వాల డిజిటలైజేషన్‌ వెంటనే పూర్తి చేయాలని నిర్దేశించారు.


హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్సే గెలుస్తుంది..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్సే గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎ్‌సలోకి రాకముందు నుంచి కూడా తాము కమలాపూర్‌, హుజూరాబాద్‌ ప్రాంతాల్లో బలంగా ఉన్నామని, ఇప్పటికీ అక్కడ టీఆర్‌ఎస్సే బలంగా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బీజేపీ ఖాతాలో ఈటల ఎలా వేసుకుంటారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో పోటీ.. వ్యక్తుల మధ్య కాకుండా, పార్టీల మధ్యనే ఉంటుందని చెప్పారు. 


టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలతో ఓవర్‌ ఫ్లో అయిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తాము వద్దనుకున్న వాళ్లే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్యపై తప్ప.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయటానికి ప్రతిపక్షాలకు విషయమే లేదన్నారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్యనూ పరిష్కరిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఎవరైనా తిడితే ఊరుకోవద్దని, పార్టీ ఆదేశాల కోసం చూడకుండా వెంటనే ప్రతిస్పందించాలని సూచించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డిది కొత్త మురిపెమన్నారు. షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రతి మంగళవారం చేసే వ్రతం లాంటిదని ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-07-15T08:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising