ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ పైసా ఇవ్వదు

ABN, First Publish Date - 2021-08-30T08:28:11+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఒక్క పథకం, ఒక్కపైసా ఇవ్వదని.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి తమ పథకాలుగా చిత్రీకరించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కేంద్ర పథకాలకే పేర్లు, ఫొటోలు మార్చి తనవిగా చెప్పుకొంటోంది

కేంద్ర నిధులను గుంటనక్కల్లా,

దున్నపోతుల్లా దోచుకుంటున్నరు

వాటినే ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నరు

గోల్కొండ కాదు.. గొల్లకురుమల కొండ

2023లో మేమే అధికారంలోకి వస్తాం

భాగ్యలక్ష్మి దేవాలయం వద్దే మొదటి సభ

హుజూరాబాద్‌ గడ్డపై కాషాయజెండానే

కేంద్ర పథకాలు ముస్లింలు, క్రైస్తవులకూ

ఇవ్వట్లేదా? హిందువులకే ఇస్తున్నామా?

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయలేదో

సీఎం కేసీఆర్‌, ఒవైసీ చెప్పాలని డిమాండ్‌

రెండో రోజూ ఫుల్‌ జోష్‌లో ‘బండి’ యాత్ర!


గోల్కొండను కట్టించింది నిజాం కాదు.. కాకతీయులు.. అది గోల్కొండ కాదు.. గొల్లకొండ.. గొల్లకురుమల కొండ. 2023లో మేం అధికారంలోకి వచ్చి తీరుతం.. గొల్లకొండ ఖిల్లపై కాషాయజెండా రెపరెపలాడిస్తం. ఇది పక్కా.

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు ఒక్క పథకం, ఒక్కపైసా ఇవ్వదని.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి తమ పథకాలుగా చిత్రీకరించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ‘‘కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నరు.. గుంటనక్కల్లా, దున్నపోతుల్లా దోచుకుని, దాచుకుని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నర’’ంటూ ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ఏం చేసినా హుజూరాబాద్‌ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈటల మరోసారి ఎమ్మెల్యేగాగెలువబోతున్నారని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి పుల్లారెడ్డి కళాశాల ప్రాంగణంలో బస చేసిన బండి.. ఆదివారం ఉదయం అక్కడే పార్టీ రాష్ట్ర శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డీకే అరుణ, రాజాసింగ్‌, సుధాకర్‌ రెడ్డి, బాబూమోహన్‌, వెంకట్‌రెడ్డి, స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెండో రోజు  యాత్ర ప్రారంభించి మెహదీపట్నం, లంగర్‌హౌజ్‌ ప్రాంతాల్లో పర్యటించారు.  దారి పొడువున పండ్ల వ్యాపారులు, కార్మికులతో మాట్లాడుతూ   ముందుకు సాగారు. సంజయ్‌ వెంట కర్ణాటక కోలార్‌ ఎంపీ మునుస్వామి, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ నడిచారు. అడుగడుగునా ఆయనకు అభిమానులు పూలమాలలు వేసి  ఘన స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా ఆయన చిన్న వ్యాపారులు, కార్మికులు, వికలాంగులు, టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుల   ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.  వీధి వ్యాపారులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేల సాయం గురించి వాకబు చేశారు. వారందరికీబీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రెతిబౌలి చౌరస్తా నుంచి టోలిచౌకి ప్రధాన రహదారి మీదుగా షేక్‌పేట దాక ఆయన యాత్ర సాగింది. షేక్‌పేటలో మధ్యాహ్న భోజనం తర్వాత వర్షం పడినప్పటికీ.. షెడ్యూల్‌ ప్రకారం కార్యకర్తలు, నాయకులతో కలిసి  యాత్ర సాగించారు. షేక్‌పేటకు చేరుకోగానే గొల్లకురుమ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సినీనటి కరాటే కళ్యాణి బతుకమ్మలతో ఆహ్వానించారు. అనంతరం షేక్‌పేట నాలా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి మాట్లాడారు. భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి తన యాత్రను ఆరంభించడంతో హిందూ సమాజమంతా సంతోషంగా ఉందన్నారు. హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ తానుంటానని హామీ ఇచ్చారు. పాతబస్తీలో ప్రతి హిందువూ ఇకపై ధైర్యంగా ఉండాలని.. ఆ ప్రాంతం ఏ ఒక్కరి సొంతం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కావాలనే సంఘవిద్రోహ శక్తులను పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.

పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు ఆగిందో ఎంఐఎం పార్టీనే సమాధానం చెప్పాలని.. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద ఎంతమంది ముస్లింలకు ఇళ్లు ఇచ్చారో సీఎం కేసీఆర్‌, ఎంఐఎం అధినేత ఒవైసీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘పీఎంజీఎ్‌సవై కింద గల్లీగల్లీకి రోడ్డు వేస్తున్నది ప్రధాని మోదీ ప్రభుత్వమని, అలాంటి రోడ్లపై ముస్లింలు, క్రైస్తవులు వెళతలేరా? ఒక్క హిందువులే వెళుతున్నారా? ఒక్క హిందువులకే మోదీ ఉచిత వ్యాక్సిన్‌ ఇచ్చారా? కేంద్రం ఇచ్చే రేషన్‌ బియ్యం హిందువులకే ఇస్తోందా? ముస్లింలు, క్రైస్తవులకు ఇవ్వట్లేదా?’’ అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు అప్పగించి తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్ల క్రితం దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే ఇప్పుడా భూమి రూ.లక్షలు పలికేదని పేర్కొన్నారు. 


పాస్‌పోర్టులు వస్తలేవు..

పాతబస్తీలో యువకులకు పాస్‌పోర్టులు, ఉద్యోగాలు వస్తలేవని.. గోల్కొండ కోట వద్ద సభలో సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీని హైటెక్‌ సిటీ చేయాలని కోరింది బీజేపీనే తప్ప.. కేసీఆర్‌, ఒవైసీ కాదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వపు మోచేతి నీళ్లు తాగే దుర్మార్గపు పార్టీ ఎంఐఎం అని మండిపడ్డారు.  ఎమ్మెల్యే రాజాసింగ్‌ హిందూ సమాజం కోసం మాట్లాడితే ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గోల్కొండ కాదు.. గొల్ల కొండ

‘‘గోల్కొండను కట్టించింది నిజాం కాదు.. కాకతీయులు.. అది గోల్కొండ కాదు.. గొల్లకొండ.. ని సంజయ్‌ అన్నారు. ‘‘2023లో మేం అధికారంలోకి వచ్చి తీరుతం.. గొల్లకొండ ఖిల్లాపై కాషాయజెండా రెపరెపలాడిస్తం. ఇది పక్కా’’ అని ధీమా వెలిబుచ్చారు. అలాగే.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి హామీ సంగతి ఏమైందని స్వామిగౌడ్‌ నిలదీశారు. బీసీలు, దళితులు కేసీఆర్‌ను నమ్మి, గెలిపిస్తే వారిని ఆయన పచ్చి మోసం చేశారన్న విషయం ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. కాగా.. బండి సంజయ్‌ యాత్రతో గోల్కొండ వీధులు దాదాపు గంటకు పైగా సందడిగా మారాయి. ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో మారుమోగాయి. బహిరంగ సభ అనంతరం బాపు ఘాట్‌ వద్దకు చేరుకుని అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. పార్టీ నేతలు ఆదివారం రాత్రి ఆయనకు అక్కడే బస ఏర్పాటు చేశారు.


కేసీఆర్‌ సభలను తలదన్నేలా పాతబస్తీ సభ

కేసీఆర్‌ సభలను తలదన్నేలా పాతబస్తీలో బీజేపీ సభ విజయవంతమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆదివారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ‘‘బీజేపీ శ్రేణుల శ్రమ వల్లే పాదయాత్ర తొలి రోజు విజయవంతమైంది. కార్యకర్తల్లో కొత్త జోష్‌ వచ్చింది. పాతబస్తీలోని హిందువుల్లో సంతోషం నెలకొంది. వారిలో ఐక్యత వస్తోంది. కాషాయ జెండా పట్టుకుని ధైర్యంగా ముందుకు వస్తున్నారు’’ అని సంజయ్‌ అన్నారు.




ఆ తల్లిని చూసి చలించి..

దివ్యాంగుడైన తన కొడుకును ఓ తల్లి తన వీపుపై  మోస్తూ రేతిబౌలి చౌరస్తాలో బండి సంజయ్‌ని కలిసింది. ‘‘బతకడం కష్టంగా ఉంది, సాయం చేయండి’’ అంటూ అర్థించింది. ఆ తల్లిని చూసి చలించిపోయిన సంజయ్‌ ఆమెకు ఆర్థిక సాయం అందించారు. కాగా, తమకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు రాలేదని.. కేంద్ర ప్రభుత్వం వీధివ్యాపారులకు ఇస్తున్న రూ.10 వేల సాయం అందలేదని చిరు వ్యాపారి పవన్‌.. సంజయ్‌కి ఫిర్యాదు చేశారు. అలాగే, టోలిచౌకీలో సంజీవగౌడ్‌ దంపతులు తమకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కావాలని, కేంద్రం అందించే నగదు పథకం కూడా అందలేదని వాపోయారు.


Updated Date - 2021-08-30T08:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising