లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం
ABN, First Publish Date - 2021-08-07T08:44:03+05:30
ఎదురుగా వస్తున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణంపాలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి-నాందేడ్/అకోలా జాతీయ రహదారిపై.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల..
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద ఘటన
భార్య, భర్త, కుమారుడు, చర్చి ఫాదర్ దంపతుల దుర్మరణం
ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం
ఎయిర్‌బ్యాగ్ తెరుచుకున్నా ఫలితం నో
పుల్‌కల్, ఆగస్టు 6: ఎదురుగా వస్తున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణంపాలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి-నాందేడ్/అకోలా జాతీయ రహదారిపై.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన పుర్ర అంబదాస్(48), పద్మ(44) దంపతుల కుమారుడు వివేక్(5) వారం క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతణ్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. వివేక్‌ను శుక్రవారం డిశ్చార్జి చేశారు. వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు కొల్చారం మండలం రంగంపేటకు చెందిన చర్చి ఫాదర్ లుకా(46), ఆయన భార్య దీవెన(40) తమ కారు (ఏపీ28సీఎల్ 8962)లో బయలుదేరారు. కారు చౌటకూర్ సమీపానికి వచ్చేసరికి.. లూకా మరోకారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో జోగిపేట వైపు నుంచి వస్తున్న లారీ(ఎంహెచ్49 0016)ని ఢీకొట్టారు. దీంతో.. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నా.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. హైవే పెట్రోలింగ్, పుల్కల్ పోలీసులు అతికష్టం మీద మృతదేహాలను బయటికి వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Updated Date - 2021-08-07T08:44:03+05:30 IST