ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కౌంటర్‌!

ABN, First Publish Date - 2021-07-06T07:43:50+05:30

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తార స్థాయికి చేరింది. తెలంగాణ సర్కారు కృష్ణా ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ ఉమ్మడి ప్రాజెక్టుల రక్షణను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీపై హరిత ట్రైబ్యునల్‌లో ధిక్కార పిటిషన్‌

వద్దన్నా రాయలసీమ కడుతున్నారని ఫిర్యాదు

పర్యావరణ అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ

నీటి కేటాయింపుల్లేవని సీతారామకూ ఇవ్వలేదు

అదే రూల్‌ సీమకూ వర్తింపజేయాలని డిమాండ్‌

9న కృష్ణా బోర్డు కమిటీ మీటింగ్‌కు వచ్చేది లేదు

20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌ పెట్టండి

తెలంగాణ అంశాలు కూడా ఎజెండాలో చేర్చండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ

ఏపీ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా బలంగా 

వాదనలు వినిపించాలని కేసీఆర్‌ ఆదేశం


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తార స్థాయికి చేరింది. తెలంగాణ సర్కారు కృష్ణా ప్రాజెక్టులపై  పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ ఉమ్మడి ప్రాజెక్టుల రక్షణను కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో తెలంగాణ కూడా ఢిల్లీ కేంద్రంగా ఎదురు దాడిని ముమ్మరం చేసింది. 


హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జగన్‌ వ్యూహాలను కౌంటర్‌ చేసేందుకు తెలంగాణ సర్కారు సోమవారం మూడు కీలక చర్యలు తీసుకుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు కొనసాగిస్తోందంటూ ట్రైబ్యునల్‌లో ధిక్కార పిటిషన్‌ వేసింది. మరోపక్క ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వరాదంటూ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలను కోరుతూ లేఖ రాసింది. చివరగా కృష్ణా బోర్డు 9వ తేదీన తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏపీ ఫిర్యాదులకే పరిమితం చేయడాన్ని సవాలు చేస్తూ బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ లేవనెత్తిన అంశాలను కూడా ఎజెండాలో చేర్చి, 20వ తేదీ తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. 9న పెట్టిన ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశానికి హాజరు కావడానికి తనకు తీరిక లేదని స్పష్టం చేసింది. మరోవైపు సీఎం కేసీఆర్‌.. ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఏపీ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అన్నిచోట్లా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. జల విద్యుదుత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దన్నారు. ఈ నెల 12న విచారణకు రానున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో బలంగా గళం విప్పాలని సూచించారు. ఈ నెల 20 తర్వాతే కృష్ణా బోర్డు పూర్తి స్థాయి సమావేశం నిర్వహించేలా కేఆర్‌ఎంబీ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఏపీ సర్కారుపై ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.


ప్రతివాదులుగా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి, కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి, ప్రాజెక్టు పనులు చేపడుతున్న ఎస్‌పీఎంఎల్‌ ఇన్‌ఫ్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌లను చేర్చారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయకపోతే జైలుకు వెళతారని ఇటీవలే ఎన్జీటీ హెచ్చరికలు చేసిన విషయం విదితమే. ఈ నెల 12న ఎన్జీటీలో ఈ కేసు విచారణకు రానుంది. ఈలోగా పనులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీని ఎన్జీటీ ఆదేశించింది. ఇదే క్రమంలో తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనులు నిలిపివేయాలంటూ ఏపీని కేఆర్‌ఎంబీ కూడా కోరింది. తమ పర్యటన కోసం నోడల్‌ అధికారిని నియమించాలని బోర్డు సభ్య కార్యదర్శి  లేఖలు కూడా రాశారు. అయితే, నోడల్‌ అధికారి నియామకానికి ఏపీ విముఖత చూపుతూ సహాయ నిరాకరణ చేస్తోంది. ఆ లేఖ ప్రతులతో పాటు ప్రాజెక్టు నిర్మాణం ఫొటోలు, ప్రాజెక్టు టెండర్లను కేటాయిస్తూ ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ధిక్కార పిటిషన్‌కు అనుబంధంగా సమర్పించింది.


కేటాయింపుల్లేకుండా అనుమతులేంటి

వన్యప్రాణుల అభయారణ్యానికి, పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన రాయలసీమ ఎత్తిపోతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణ అనుమతులు ఇవ్వరాదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ సభ్య కార్యదర్శికి .. రజత్‌ కుమార్‌ సోమవారం లేఖ రాశారు.  నీటి కేటాయింపులు, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును కడుతున్నారని ఫిర్యాదు చేశారు. నీటి కేటాయింపుల్లేవనే కారణంతోనే 2018లో సీతారామ ఎత్తిపోతల-1కు  పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడుకు కూడా కేంద్ర జల వనరుల సంఘం అనుమతి లేదని నివేదించారు.


రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంక మల్లేశ్వర, శ్రీ పెనుసిల నర్సింహ, రాజీవ్‌గాంధీ జాతీయ పార్కు, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణుల అభయార ణ్యాలకు పది కిలోమీటర్ల పరిధిలోనే ఈ ప్రాజెక్టుతో పాటు కాలువలు ఉన్నాయని గుర్తు చేశారు. బఫర్‌ జోనే కాకుండా కోర్‌ జోన్‌లో పర్యావరణం దెబ్బ తింటుందని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టరాదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (సౌత్‌జోన్‌) తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర జల వనరుల శాఖ కూడా సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా చేపట్టరాదని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఫిర్యాదుతో పాటు అభయారణ్యాల పరిధిని, ఫొటోలను జత చేశారు. 


బోర్డు మీటింగే పెట్టండి

కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై చర్చించడానికి పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ నెల 9వ తేదీన జరగాల్సిన ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.   ఏపీ అంశాలను మాత్రమే చర్చించడానికి సమావేశం కావడ మేంటి? తెలంగాణ లేవనెత్తిన అంశాలేవి? అని ప్రశ్నించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. తమ అధికారులంతా బిజీగా ఉన్నారని చెప్పారు. 20వ తేదీ తర్వాతే ఏ సమావేశమైనా పెట్టాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఎత్తిపోతలు నడవాలంటే, వానాకాలం సీజన్‌కు నీరందించాలంటే విద్యుత్‌ అవసరమని, దీని కోసమే ఉత్పాదన చేస్తున్నామని చెప్పారు. సాగర్‌ ఆయకట్టు, తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ, నీటిని సాగర్‌కు వదులుతున్నామని వివరించారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశం పెడితే చర్చించాల్సిన అంశాలను లేఖలో పొందుపరిచారు. 


ఈ వాటర్‌ ఇయర్‌లోకృష్ణా జలాల నీటి వాటాపై చర్చించాలి. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనుల నిలిపివేతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలి. ఠ పోతిరెడ్డిపాడుతో పాటు ఇతర ప్రాజెక్టుల ద్వారా బేసిన్‌ అవతలి ప్రాంతాలకు అదనంగా జలాల తరలింపును అడ్డుకోవాలి. ఠ పోలవరానికి సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వగానే తెలంగాణకు కృష్ణా జలాల్లో 45 టీఎంసీల అదనపు నీటిని కేటాయించాలని బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డులో ఉంది. ఈ అంశంపై కూడా చర్చ జరగాలి. 


కృష్ణా బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా తరలిస్తున్న నీటిని పక్కాగా లెక్కించాలి. 

Updated Date - 2021-07-06T07:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising