సూపర్ స్ర్పెడర్లకు బ్రేకులు
ABN, First Publish Date - 2021-05-26T05:54:05+05:30
సూపర్ స్ర్పెడర్లకు బ్రేకులు
నేటి నుంచే గుర్తింపు... 28 నుంచి టీకా
స్ర్పెడర్ల విభాగంలో వీధి వ్యాపారులు, ఇతర విక్రయదారులు
ఇప్పటికే 42 వేల మంది గుర్తింపు
కరోనా కట్టడికి రంగం సిద్ధం చేస్తున్న జీడబ్ల్యూఎంసీ
నగరంలో 5 సెంటర్ల ఏర్పాటు
13 డివిజన్లకు ఒక వ్యాక్సిన్ సెంటర్
వరంగల్ సిటీ, మే 25 : వరంగల్ నగరంలో కరోనా కట్టడికి జీడబ్ల్యూఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని సూపర్ స్ర్పెడర్లకు కరోనా నియంత్రణ టీకా వేసేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హుటాహుటిన జీడబ్ల్యూఎంసీ కార్యాచరణ చేపడుతోంది. ఈ మేరకు కమిషనర్ పమేలా సత్పతి ప్రణాళిక సిద్ధం చేశారు. యుద్ధప్రాతిపదికన సూపర్ స్ర్పెడర్లకు టీకా వేసే రూట్ మాప్ సిద్ధం చేసేందుకు మంగళవారం ప్రజారోగ్యం, రెవెన్యూ, మెప్మా ఇతర ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. బుధవారం నుంచే రంగంలోకి దిగేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు కార్యోన్ముఖులవుతున్నారు.
ఎందుకు ప్రాధాన్యం
కరోనా కట్టడిలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సూపర్ స్ర్పెడర్లకు టీకా వేసే ఆలోచన చేసి ఈ మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ఇది నియంత్రణలో సత్ఫలితాలు ఇచ్చింది. ప్రజలు నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, మాంసం, రవాణా ఇలా అనునిత్యం ప్రజలకు అవసరమైన విభాగాల నుంచే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వాలు పసిగట్టాయి. సూపర్ స్ర్పెడర్లకు కరోనా టీకా వేయడం ద్వారా కట్టడి జరుగుతుందనే నిర్ణయంతో ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్ర్పెడర్లకు టీకా వేసి సత్ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగు వేసి నగరాలలో అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశంలో థర్డ్ వేవ్ ముప్పును అధిగమించేందుకు ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను అధ్యాయనం చేయాలని కూడా ఆదేశించారు.
గుర్తింపునకు రంగం సిద్ధం
నగరంలో సూపర్ స్ర్పెడర్ల గుర్తింపునకు జీడబ్ల్యూఎంసీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇప్పటికే గుర్తించిన వీధి వ్యాపారులు 42 వేల వరకు ఉన్నారు. ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ నిధి పథకం ద్వారా ఇటీవల మెప్మా వీరిని గుర్తించింది. రూ.10వేల రుణం అందచేసింది. మరోవైపు ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులు 25వేల వరకు ఉన్నట్లుగా గుర్తించింది. ఇక రవాణా రంగంలో పనిచేసే వారు ఇతరత్ర విభాగాలలోని సూపర్ స్ర్పెడర్లకు కూడా గుర్తించి అందరికి టీకా వేయాలని ఆలోచనలో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జాబితాతో పాటు ఇంకా మిగిలిన వారి గుర్తింపు కోసం బల్దియా చర్యలు తీసుకోనుంది.
వ్యాక్సిన్ వేయించుకునే వారెందరు...?
సూపర్ స్ర్పెడర్లకు వ్యాక్సినేషన్ వేయాలనే నిర్ణయం క్రమంలో ఇప్పటికే తొలి, రెండో డోసు పూర్తి చేసిన వారు ఎందరున్నారనే కోణంలో కూడా జీడబ్ల్యూఎంసీ వివరాల సేకరణ జరుపుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు వివరాలను తెప్పించుకునే యత్నం చేస్తోంది. తొలి డోసు పూర్తయితే రెండోడోసు తీసుకునే సూపర్‌స్ర్పెడర్ల సంఖ్య ఎంత ఉంటుంది. ఎప్పటి వరకు గడువు ఉంటుంది... ఇలాంటి వివరాలను కూడా సమగ్రంగా సేకరణ జరిపే ప్రణాళికలతో ఉంది.
13 డివిజన్లకు ఒక వ్యాక్సిన్ సెంటర్
నగరంలో మొత్తం 66 డివిజన్లలో 13 డివిజన్లను ఒక యూనిట్‌గా చేసి ఒక వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికను జీడబ్ల్యూఎంసీ రూపొందించింది. ఈ మేరకు నగరంలో మొత్తం 5 సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఖిలా వరంగల్, వరంగల్, హన్మకొండ, కాజీపేట, భీమారం ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో టీకా వేసే వేదిక ఎక్కడ అనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, కాలేజీలు ఇలా విశాలమైన సెంటర్లను ఎంపిక చేసి సూపర్ స్ర్పెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు.
28 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం
ఈ నెల 28 నుంచి సూపర్ స్ర్పెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జీడబ్ల్యూఎంసీ ప్రారంభించనుంది. 20రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సూపర్ స్ర్పెడర్ల పరిధిలోని ప్రతీ ఒక్కరికి టీకా వేయాలనే సంకల్పంతో ఉంది. స్ర్పెడర్ల గుర్తింపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం కమిషనర్ పమేలా సత్పతి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది.
సూపర్ స్ర్పెడర్లు ఎవరు?
సూపర్ స్ర్పెడర్లుగా వీధి వ్యాపారులు, మాంసం, కూరగాయలు, కిరాణం, సూపర్ మార్కెట్లు, సెలూన్స్, బ్యూటీపార్లర్లు, బేకరీ, టిఫిన్ సెంటర్, పాల వ్యాపారులు.. ఇలా ప్రజలు, వ్యాపారుల మధ్య నిత్య అనుసంధానం ఉండే వారిని సూపర్ స్ర్పెడర్లుగా పరిగణిస్తారు. ఆటో డ్రైవర్లు, రవాణా రంగంలో పని చేసే వారు, పాలవ్యాపారులు, పేపర్ బాయ్, ఫుడ్ డెలివరీ, డోరీ డెలివరీ మార్కెటింగ్ తదితర విభాగాలలోని వారందరిని సూపర్ స్ర్పెడర్ల పరిధిలోకి వస్తారు.
Updated Date - 2021-05-26T05:54:05+05:30 IST