ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలువలతో కూడిన విద్యాలయాలుగా సరస్వతీ నిలయాలు

ABN, First Publish Date - 2021-04-22T16:18:03+05:30

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. పాఠశాల విద్యలో తమదైన శైలిని, తమదైన ఒరవడిని కొనసాగిస్తున్న శిశుమందిర్‌ స్కూళ్లు విద్యా వికాసంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. పాఠశాల విద్యలో తమదైన శైలిని, తమదైన ఒరవడిని కొనసాగిస్తున్న శిశుమందిర్‌ స్కూళ్లు విద్యా వికాసంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాయి. సరస్వతీ విద్యాపీఠం అనే గొడుగు కింద వందల పాఠశాలలు ఒకే రీతిలో విద్యాబోధన చేస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. శిశుమందిరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం చూద్దాం...


 భావిభారత పౌరులకు చదువులతల్లి ఒడిలోనే విద్యతో పాటు.. సమగ్రవికాసాన్ని  బోధించే పాఠశాలలు శ్రీ సరస్వతీ శిశుమందిరాలు. కేవలం చదువుకే పరిమితం కాకుండా.. ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తున్నాయి. మిగతా అన్ని పాఠశాలలకు భిన్నమైన ప్రణాళికతో విద్యాబోధన సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నా.. తమ విద్యార్థులకోసమే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ.. ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి విలువలతో ఈ కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో తమదైన ముద్రను వేస్తున్నాయి.

 

హైదరాబాద్‌ బండ్లగూడ జాగీర్‌లోని శారదాధామంలో ఉన్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం పర్యవేక్షణలో శిశుమందిర్‌ పాఠశాలల నిర్వహణ సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లోనూ ఏకరూప బోధన, శిక్షణ జరుగుతుంది. ఇలా.. తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్న సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 48 సంవత్సరాలు గడిచింది. 1973వ సంవత్సరం శ్రీరామ నవమి పర్వదినం రోజున విద్యాపీఠం ప్రారంభించారు. అర్థశతాబ్దికి మరోరెండు మైలురాళ్ల దూరంలో ఉన్న సరస్వతీ విద్యాపీఠం తన వికాసాన్ని, ప్రకాశాన్ని, సమాజంలో విద్యార్థుల అభ్యున్నతికోసం సాగిస్తున్న విద్యా యజ్ఞాన్ని నెమరేసుకుంటోంది. మారిన కాలానికి అనుగుణంగా సరికొత్త అడుగులు వేస్తోంది. అనుభవాలను, విజయాలను సమీక్షించుకుంటూ.. భవిష్యత్తులో అవసరాలను అంచనా వేసుకుంటూ మరింత ఉన్నతంగా దూసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

 

వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అప్పటి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న నిర్మల్‌లో తొలి సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాల పురుడుపోసుకుంది. విద్యాపీఠం ఆవిర్భావానికి ఆరు సంవత్సరాల ముందే.. అంటే 1967 జూన్‌ 17వ తేదీన మొట్టమొదటి సరస్వతీ శిశుమందిర్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సఫలం కావడంతో ఆ మరుసటి యేడాదే ఆదిలాబాద్‌లో మరో శిశుమందిర్‌ స్కూల్‌ ప్రారంభించారు. విద్యా వ్యవస్థలో వినూత్న ఆలోచనా సరళితో నిర్వహిస్తున్న శిశుమందిరాల ఆవశ్యకతను గుర్తించిన నిర్వాహకులు.. సరస్వతీ విద్యాపీఠానికి బీజం వేశారు. ఆ గొడుగు కింద క్రమంగా పాఠశాలలను ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలా.. సాగుతున్న సరస్వతీ విద్యాపీఠం..  ఇప్పుడో మహావృక్షంగా విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో శిశుమందిరాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే సరస్వతి విద్యాపీఠం.. జాతీయ స్థాయిలో విద్యాభారతి ఫౌండేషన్ కి అనుబంధంగా కొనసాగుతోంది.

 



సాధారణంగా ఏ పాఠశాలలో చూసినా పాఠ్య ప్రణాళిక, పరీక్షల ఆధారంగా బోధన సాగుతుంది. కానీ, శిశుమందిరాల్లో అలాకాదు.. పాఠ్య ప్రణాళికకు తోడు, వార్షిక సాంస్కృతిక ప్రణాళిక, క్రీడా ప్రణాళిక వంటివి అమలు చేస్తారు. పంచకోశ విద్యను  బోధిస్తారు. శారీరక ధృఢత్వం కోసం ఆటలు, వ్యాయామాలు.. మానసిక వికాసం కోసం యోగ, సంగీతం, కళాత్మక అంశాలు, సంస్కృతం, నైతిక ఆధ్యాత్మిక శిక్షను అందిస్తారు. ప్రత్యేకంగా వేద గణిత శిక్షణ ఇస్తారు. అంతేకాదు.. విజ్ఞాన మేళాలు, ఖేల్‌కూద్‌లు, సంస్కృతీ బోధ పరియోజన, సంస్కృతీ కార్యశాలలు ప్రతియేటా నిర్వహిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శిశుమందిర్‌ పాఠశాలల విద్యార్థులు ప్రాతినిథ్యం వహించేలా చూస్తారు. వీటివల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, నైపుణ్య సాధన, అందరితో కలిసిపోవడం వంటి లక్షణాలు చిన్నప్పటినుంచే అలవడతాయి. దీనిని సకారాత్మ బోధనగా అభివర్ణిస్తారు. ఇలాంటి వాతావరణంలో విద్యనభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ స్థాయిలో, ఏ సంస్థలో పనిచేస్తున్నా జాతి ఐక్యత, జాగృతి ప్రధాన లక్ష్యాలుగా తమ నడవడికను కొనసాగిస్తారు.

 

ఉపాధ్యాయులకు కూడా ప్రతియేటా బోధనకు అవసరమైన శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ సరస్వతీ విద్యాపీఠం. శిశుమందిర్‌లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు, నైపుణ్య మేళాలు నిర్వహిస్తారు. ఈ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ప్రతి యేటా 40 రోజుల పాటు.. హైదరాబాద్‌ శారదాధామంలోని విద్యాపీఠం ఆవరణలో నిర్వహించే ప్రశిక్షణ వర్గలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. శిశుమందిర్‌లో అధ్యాపకులకు ఇది ప్రధాన నియమం. ఇక, శిశుమందిర్‌లో బోధనగానీ, తరగతి గది వాతావరణం గానీ మిగతా అన్నిస్కూళ్లకంటే భిన్నంగా ఉంటుంది. ఉపాధ్యాయులను సంభోదించడం దగ్గరినుంచీ అది కనిపిస్తుంది. సాధారణంగా ఏ పాఠశాలలో అయినా సార్‌, టీచర్‌, మేడమ్‌ అని పిలుస్తారు. కానీ, శిశుమందిర్‌లలో ఉపాధ్యాయులను ఆచార్యజీ, మాతాజీ అని సంభోదిస్తారు. దీనివల్ల విద్యార్థులకు పసితనం నుంచే ఉపాధ్యాయులు, పెద్దలంటే ప్రత్యేకమైన గౌరవం, సంస్కార భావన అలవడుతుంది.

 

శిశుమందిర్‌ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది ప్రస్తుతం ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. కొందరు అత్యున్నత పదవులు అలంకరించారు.  ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యాపార వేత్తలుగానూ తమ తమ రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రాజకీయ రంగంలోనూ చాలామంది శిశుమందిర్‌ పూర్వ విద్యార్థులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

 

హైదరాబాద్‌లోని శారదాధామంతో పాటు.. కొన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. అచ్చంపేట, భద్రాచలం, ములకలపల్లి, జమ్మికుంటలో ఆవాస విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇవికాకుండా.. గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు, సంస్కార కేంద్రాలు నిర్వహిస్తోంది సరస్వతీ విద్యాపీఠం.

 

తెలుగు రాష్ట్రాల్లోని విద్యారంగంలో తనదైన ముద్రను వేసుకున్న సరస్వతీ శిశుమందిరాలు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు కేంద్ర బిందువులుగా పేరు పొందాయి. తొలినుంచీ తెలుగు మాధ్యమంలోనే బోధన సాగిస్తున్నా.. మారిన సామాజిక పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా శిశుమందిర్‌లో కొన్నేళ్లుగా ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన సాగిస్తున్నారు. మాతృభాషలోనే కాదు.. ఇంగ్లీష్‌ మీడియంలోనూ మన సంస్కృతీ సంప్రదాయాలు, విలువలను బోధిస్తూ.. విద్యార్థులను దేశభక్తియుత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌తో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను కూడా శారదాధామంలో ప్రారంభించారు.

 

ఇక, 48 యేళ్లుగా శిశుమందిరాలలో విద్యనభ్యసించిన లక్షలాది మంది విద్యార్థులు 2019లో ఒకేచోట కలిశారు. శారదాధామం కేంద్రంగా నిర్వహించిన పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనంలో లక్షల మంది పూర్వ విద్యార్థులు ఎక్కడెక్కడినుంచో వచ్చారు. 2019 డిసెంబర్‌ 29వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో రోజంతా పరవశులై పోయారు. శిశుమందిరాల సంస్కృతిని, బోధనా వాతావరణాన్ని మరోసారి తడిమిచూసుకున్నారు. ఇంతవరకు అలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్న  నిర్ధారణకు వచ్చిన పలు సంస్థలు రికార్డులు ప్రదానం చేశాయి. శిశుమందిర్‌ పాఠశాలల ఘనకీర్తిని మరోసారి నలుదిశలా చాటాయి. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.



Updated Date - 2021-04-22T16:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising