ధనిక రాష్ట్రమని చెప్పి.. రూ.4 లక్షల కోట్ల అప్పు
ABN, First Publish Date - 2021-09-12T08:16:14+05:30
తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం కేసీఆర్..
- ఉద్యోగులకు వాయిదాల్లో జీతాలిచ్చే దుస్థితి..
- టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కానే కాదు: బండి సంజయ్
- రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఛాన్స్
- త్వరలోనే తెలంగాణలో ప్రధాని పర్యటన
- హుజూరాబాద్ ప్రచారానికి షా: కిషన్‌రెడ్డి
- హుజూరాబాద్‌తోనే కేసీఆర్ పతనం: ఈటల
సంగారెడ్డి/జోగిపేట/హైదరాబాద్/రాంనగర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం కేసీఆర్.. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ అప్పులు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదాల పద్ధతిన జీతాలు ఇచ్చే దుస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణలో 2023లో అధికారంలోకి వస్తామని, కేసీఆర్ సంగతి తేలుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారని తెలిపారు. ‘‘ఎప్పుడు ఎన్నిక వచ్చినా కేసీఆర్ ఢిల్లీ వెళతారు. అదే ఆనవాయితీగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్‌షాను కలిశారు.
హైదరాబాద్ మేయర్ పదవిని బీజేపీకి ఇస్తామని చెప్పారు. అయితే అలాంటి పదవులు తమకు అక్కరలేద ని అమిత్ షా తిరస్కరించారు. మీరిస్తే తీసుకునేదేమీ లేదని కేసీఆర్‌తో అన్నారు. 2023లో రాష్ట్రంలో మేమే అధికారంలోకి వ స్తాం.. మీ సంగతి తేలుస్తాం’’ అని అమిత్ షా.. కేసీఆర్‌తో అ న్నారని సంజయ్ వివరించారు. బీజేపీకి టీఆర్ఎస్కు సంబం ధం లేదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్, టీఆర్ఎస్లు అవమానించాయని సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నడూ అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు రాలేదని చెప్పారు. రూ.వంద కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం వెనుక కుట్ర ఉందని సంజయ్ ఆరోపించారు. రజాకార్ల పార్టీ అయిన ఎంఐ ఎం నేతల ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. శనివారం జోగిపేటలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబరు 17న ఉదయం అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగరేయాలని, ఆ వెంటనే నిర్మల్ సభకు తరలిరావాలని సూచించారు.
హరీశ్‌ను జనం బండకేసి కొడుతున్నరు: ఈటల
హుజూరాబాద్ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ పతనానికి నాంది పలకనుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జోగిపేటలో మాట్లాడుతూ కేసీఆర్ నోట్ల కట్టలు, మద్యం సీసాలు, అహంకారం, కుట్రలకు చరమగీతం పాడే గడ్డ హుజూరాబాదేనని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్లో నిద్రపోవడం లేదని, తనను ఓడగొట్టేందుకు ఆయన ప్రణాళికలు వేస్తుంటే మంత్రి హరీశ్‌రావు అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలు హరీశ్‌ను నెత్తిన పెట్టుకున్నారని, కానీ ఈ రోజు ఆయన చేస్తున్న కుట్రలను చూసి బండకేసి కొడుతున్నారని అన్నారు.
తెలంగాణలో అవినీతి సర్కార్
తెలంగాణలో అవినీతి సర్కారు రాజ్యమేలుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ వర్గీయ ఆరోపించారు. దేశమంతా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అధికారంలో ఉంటే, తెలంగాణలో మాత్రం నియంత పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు.
నీళ్ల పేరుతో దోపిడీ
నీళ్లు, నిధులు, నియామకాల కోసం మేధావులు, తెలంగాణవాదులు, నిరుద్యోగ యువత కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే.. కేసీఆర్ కుటుంబం నీళ్ల పేరుతో దోపిడీ చేస్తోందని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం కొన్ని తరాలు తిన్నా తరగని నిధులు సమకూర్చుకుందని శనివారం ఆమె ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు.
హుజూరాబాద్ ప్రచారానికి షా
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ త్వరలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ యూనిట్ల ప్రారంభోత్సవాలకు వస్తారని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. శనివారం జోగిపేటలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో 17న నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ సభ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలతోపాటు ప్రజా సంగ్రామ యాత్ర, హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యూహంపై చర్చించారు.
బీసీలు ఈటలకు మద్దతివ్వాలి: ఆర్.కృష్ణయ్య
ప్రజల పక్షాన పోరాడిన ఉద్యమ నేత ఈటలను సీఎం కేసీఆర్ కావాలనే బయటకు పంపారని ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలంతా రాజేందర్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పలువురు బీసీ సంఘం నేతలతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. పాలకులు ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా హుజూరాబాద్‌లో తన గెలుపు తథ్యమని ఈటల మీడియాతో అన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో తాను ఆర్.కృష్ణయ్యతో కలిసి పనిచేశానని చెప్పారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆయనను కోరానని చెప్పారు.
ఏ క్షణమైనా హుజూరాబాద్ షెడ్యూల్
హుజూరాబాద్ ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ కీలక నేత ఒకరు సమావేశంలో వెల్లడించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి, హు జూరాబాద్‌లో పాదయాత్ర కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపని పక్షంలో వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వమే ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
Updated Date - 2021-09-12T08:16:14+05:30 IST