మరో 5 రోజులు!
ABN, First Publish Date - 2021-07-15T08:10:09+05:30
రాష్ట్రంలో కొలువుల భర్తీపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని భావించారు. మంగళ, బుధవారాల్లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో
ఖాళీల గుర్తింపునకు గడువు..
పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
అధికారులకు రాష్ట్ర కేబినెట్ ఆదేశాలు
‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి ఆమోదం
1400 ఎకరాల్లో డ్రై పోర్టు ఏర్పాటు
మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు
రాష్ట్రంలో 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
2024-25 కల్లా 10 వేల ఎకరాల్లో ఏర్పాటు
రూ.25 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహకాలు
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, రైతులకు అదనం
ధాన్యం నిల్వ, మార్కెటింగ్‌పై కేబినెట్ సబ్ కమిటీ
20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
రైతులకు మూడేళ్లు పెట్టుబడి సాయం
ఎకరాకు తొలి ఏడాది రూ.26,000,
2, 3 సంవత్సరాల్లో రూ.5000 చొప్పున..
సాగుపై అధ్యయనానికి మంత్రులు, అధికారుల
బృందం విదేశాలకు: కేబినెట్ నిర్ణయం
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిట
ఆస్తుల మార్కెట్ విలువలు పెరుగుతాయన్న వార్తలతో..
రైతులకు సమగ్ర శిక్షణ ఇవ్వడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ వ్యవసాయ శాఖ కల్పించాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలంగా మార్చాలి. రైతులకు నిరంతరం శిక్షణ ఇప్పించాలి. పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగ ఖాళీలూ ఉండకూడదు. అన్నింటిని భర్తీ చేసుకోవాలి.
సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొలువుల భర్తీపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని భావించారు. మంగళ, బుధవారాల్లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఖాళీల భర్తీపై నిర్ణయం ప్రకటిస్తారని నిరీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కలిపి మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రిమండలికి వివరాలు కూడా సమర్పించింది. దీంతో బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఖాళీల భర్తీపై ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూశారు. కానీ, ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతించే అంశం మళ్లీ వాయిదా పడింది. అధికారులు అందించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని, సమగ్ర వివరాలను సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఖాళీల వివరాలు అందించడానికి మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది.
కాలానుగుణంగా, ఆధునిక అవసరాల మేరకు పోస్టులు ఉండాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులను రప్పించాల్సి ఉందని, వీటితో పాటు మిగిలిపోయిన ఖాళీలన్నీ కలిపి సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత ఖాళీల వివరాలను ప్రజల ముందుంచుదామని తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ బుధవారం రెండోరోజూ కొనసాగింది. దాదాపు 7 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాజకీయపరమైన అంశాలేవీ చర్చకు రాలేదు. కృష్ణా జలాలు, సాగునీటి ప్రాజెక్టులపైనా చర్చ జరగలేదు. ఉద్యోగుల ఖాళీలపైనే ఎక్కువ సేపు చర్చించారు.
వ్యవసాయం, ఆయిల్‌పామ్ సాగుపైనా చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల పాలసీ, లాజిస్టిక్ పాలసీలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అన్ని శాఖల కార్యదర్శులు సమావేశానికి హాజరై తమ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలను కేబినెట్‌కు అందించారు. సమాజంలో, ఉద్యోగ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని, అందుకు సరికొత్త పోస్టుల అవసరం ఏర్పడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థ లో మార్పులు జరగాలని సూచించింది. తద్వారా పాల నా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను కేబినెట్ ఆదేశించింది.
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం..
కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా ఉద్యోగుల విభజన జరగాలని కేబినెట్ స్పష్టం చేసింది. తద్వా రా జిల్లాలు, జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల వల్ల ఏర్పడే ఖాళీల భర్తీకీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 200 నుంచి 300 మంది ఉద్యోగులను ఏపీ నుంచి తీసుకురాబోతున్నామని వివరించింది. ఇలా అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్ర నుంచి వచ్చే ఉద్యోగులను కలుపుకొని, ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ సంస్థల ఆస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా, విభాగాల వారీగా సంకలనం చేయాలని చెప్పింది.
10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు..
రాష్ట్రంలో రోజురోజుకూ ధాన్యం దిగుబడి పెరిగిపోతు న్న నేపథ్యంలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తొలిదశలో కనీసం 10.. ఒక్కోటి 500 ఎకరాలకు తగ్గకుండా, 1000 ఎకరాల్లోపు ఉండేలా ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్’లను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 2024-25 నాటికి 10 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పని చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వమే భూమిని సేకరించి జోన్లను ఏర్పాటు చేయాలని, వీటిలో అన్ని మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు. ఇలా అభివృద్ధి చేసిన జోన్లలో అర్హులకు భూమిని కేటాయిస్తారు. తద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని..
70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులు అందించే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వనుంది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసక్తి గల వ్యాపారవేత్తలు, ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును జూలై 31 వరకు పొడిగించాలని అధికారులను ఆదేశించింది.
పాలసీ మార్గదర్శకాలపై చర్చ
రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు పెరిగినందున వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, పాడి, మత్స్య రం గాల్లో సాధించే అదనపు ఉత్పత్తులను ప్రాసెస్ చేసేలా యూనిట్ల సామర్థ్యం ఉంటుందని కేబినెట్ తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా వాల్యూ చెయిన్ ముందుకు సాగడానికి ఉత్పత్తిదారులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రో త్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరగనున్నందున నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూత న పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించింది. ఆయిల్‌పామ్‌ను సాగు చేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000, రెండో సంవత్సరం రూ.5000, మూడో సంవత్సరం రూ.5,000 చొప్పున పెట్టుబడిని అందించాలని నిర్ణయించింది. ఆయిల్‌పామ్ సాగుపై మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం కోస్టారికా, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో పర్యటనలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
ఎస్సారెస్పీ అంచనాలు1999 కోట్లకు పెంపు
శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పునరుజ్జీవ పథకం అంచనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలుత ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనా రూ.1091 కోట్లుగా ఉండగా.. తర్వాత దీన్ని రూ.1751 కోట్లకు సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ.1999 కోట్లకు పెంచడానికి ఆమోద ముద్ర వేశారు.
నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టండి: సీఎం
ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ఘన విజయాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నదీ జలాలను చెరువులు, కుంటలు, బీడు భూములకు మళ్లించినట్లు చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు. అదే సమయంలో ప్రభుత్వం రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం చేస్తోందని, ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచి రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఫలితంగా గత ఏడాది 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని సీఎం తెలిపారు. వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిల్వ, మార్కెటింగ్ సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత వానాకాలం 1.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో పండనున్నాయని సీఎం తెలిపారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని, నిరంతరం రైతులకు శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగ ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను భర్తీ చేసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని చెప్పింది.
లాజిస్టిక్స్‌కు ప్రోత్సాహం
పారిశ్రామిక, ఇ-కామర్స్, సేవా రంగాల్లో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి ఆమోదం తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అదనపు ఉత్పత్తులకు లాజిస్టిక్ రంగం అత్యవసరమని గుర్తించింది. రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలని నిర్ణయించింది. దాదాపు 1400 ఎకరాల్లో, భారీ స్థాయిలో డ్రై పోర్టు (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు)ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో సనత్‌నగర్‌లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే రాష్ట్రంలో మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ స్థాయిలో ‘టాస్క్’ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగంలో ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపింది. ఈ రంగంలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది. పారిశ్రామిక, ఇ-కామర్స్, సేవా రంగాల్లో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి ఆమోదం తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా సాధించే అదనపు ఉత్పత్తులకు లాజిస్టిక్ రంగం అత్యవసరమని గుర్తించింది. రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలని నిర్ణయించింది. దాదాపు 1400 ఎకరాల్లో, భారీ స్థాయిలో డ్రై పోర్టు (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు)ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో సనత్‌నగర్‌లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)లను స్థాపించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
బాటసింగారంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే రాష్ట్రంలో మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి అంతర్జాతీయ స్థాయిలో ‘టాస్క్’ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగంలో ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపింది. ఈ రంగంలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రాయితీలు..
- ప్రతి యూనిట్‌కు రూ.2 చొప్పున ఐదేళ్లు విద్యుత్తు సబ్సిడీ
- పెట్టుబడి కోసం తీసుకున్న టెర్మ్ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం (రూ.2 కోట్లకు మించకుండా) రీయింబర్స్
- మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును ఏడేళ్ల వరకు 100 శాతం రీయింబర్స్
- ఆహార ఉత్పత్తులను స్టోరేజీకి తరలింపు, ఇతర లాజిస్టిక్స్ కోసం జోన్లలో భూమి కేటాయింపు
- ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రోత్సాహకాలు
- 15 శాతం మూలధనం (రూ.20 లక్షలకు మించకుండా) మంజూరు
- మూలధన రుణంపై వడ్డీలో 10 శాతం రీయింబర్స్‌మెంట్ (రూ.2 కోట్లకు మించకుండా)
- అర్హులైనవారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ(రూ.20 లక్షలకు మించకుండా)
ఎస్‌హెచ్‌జీలు, రైతు సంఘాలకు..
- 15% మూలధనం మంజూరు (రూ.కోటి మించకుండా)
- మూలధన రుణంపై వడ్డీలో 10 శాతం రీయింబర్స్‌మెంట్ (రూ.2 కోట్లకు మించకుండా)
- భూమి విలువపై 33% వరకు సబ్సిడీ (రూ.20 లక్షలకు మించకుండా)
Updated Date - 2021-07-15T08:10:09+05:30 IST