యువతిపై అత్యాచారం?
ABN, First Publish Date - 2021-08-19T08:07:51+05:30
ఆటోడ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ ఓ యువతి తన తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ యువతిపై అత్యాచారం జరిగిందన్న..
ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు కలిసి అఘాయిత్యం?
సీసీ ఫుటేజీ పరిశీలిస్తోన్న పోలీసులు
హైదరాబాద్ సిటీ/సంతోష్‌నగర్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఆటోడ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ ఓ యువతి తన తల్లితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ యువతిపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించడం లేదు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పాతనగరం చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన యువతి (20) కొన్ని రోజులుగా సంతోష్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా శిక్షణ పొందుతోంది. మంగళవారం మధ్యాహ్నం యువతి సోదరుడు ఆమెను వాహనంలో ఆస్పత్రి వద్ద దించి వెళ్లాడు. ఆమె ఒంట్లో నలతగా ఉండడంతో రాత్రి 9 గంటలకు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. కాస్త దూరం వెళ్లిన తర్వాత ఆటోలో ఆమెకు నిద్ర పట్టింది. అంతలోనే ఆటో డ్రైవర్‌కు పరిచయమున్న మరో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి ఆమెను బెదిరిస్తూ చాంద్రాయణగుట్ట దాటి శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. ఎలాగోలా ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చి మరో ఆటోలో ఆమె మిధాని డిపో వద్ద ఉన్న తన ఇంటికి చేరుకుంది. జరిగిన ఘటన గురించి తల్లికి వివరించింది. అనంతరం వారిద్దరు సంతోష్ నగర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు అన్నారు. నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వెళ్లిన మార్గం.. ఎక్కిన ఆటో వివరాలు.. ఆటో వెళ్లిన రూటు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆటో వివరాలు దొరికితే నిందితులు చిక్కే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. బాధిత యువతి చెప్పి వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆ యువతిని వైద్య పరీక్షల కోసం పంపారు. సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
Updated Date - 2021-08-19T08:07:51+05:30 IST