కడ్తాల ప్రగతేది?
ABN, First Publish Date - 2021-08-16T05:05:24+05:30
హైదరాబాద్‌కు చేరువలో ఉన్న కడ్తాల అభివృద్ధిలో
- మండల కేంద్రంగా ఏర్పాటైనా ఒనగూరని వసతులు
- పూర్తిస్థాయిలో ఏర్పాటుకాని కార్యాలయాలు
కడ్తాల్: హైదరాబాద్‌కు చేరువలో ఉన్న కడ్తాల అభివృద్ధిలో వెనుకబడింది. మండల కేంద్రానికి అనుగుణంగా వసతులు లేవు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పట్టింపులేని ధోరణితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలాల పునర్విభజనలో ఆమనగల్లు నుంచి కడ్తాల మండలం ఏర్పాటైంది. ఆమనగల్లు మండలంలోని ఏడు, తలకొండపల్లి మండలంలోని నాలుగు పంచాయితీలతో 2016 అక్టోబర్ 11న కడ్తాల మండలం ఏర్పాటైంది. 2018లో కొత్తగా 13 పంచాయతీల ఏర్పాటుతో మండలంలో 24 పంచాయతీలయ్యాయి. ఐదేళ్లు అవుతున్నా అద్దె భవనంలో మండల పరిషత్, పాలశీతలీకరణ కేంద్రం సమావేశ భవనంలో తహసీల్దార్ కార్యాలయం, మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పోలీస్ స్టేషన్, పాత పశువుల ఆస్పత్రిలో వ్యవసాయ శాఖ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రంలో ఇందిర క్రాంతి పథం కార్యాలయం కొనసాగుతున్నాయి. కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలూ రూపొందించలేదు. జాగా చూడలేదు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో స్థలాల పరిశీల చేసినా తీరా ఒక్క కార్యాలయానికీ స్థలం ఎంపిక చేయలేదు. ఆయా కార్యాలయాలకు భవనాల నిర్మాణం, స్థలాల కేటాయింపునకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులకు విన్నవించినా స్పందన లేదు.
మండల కేంద్రంలో బస్టాండ్ లేక బస్సులు శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపైనే నిలుపుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పాలశీతలీకరణ కేంద్రం ఎదుట దుకాణ సముదాయ నిర్మాణం చేపట్టలేదు. 30పడకల ఆస్పత్రి ఏర్పాటు, 108 అంబులెన్స్, జూనియర్ కళాశాల, ఉపమార్కెట్ యార్డ్, బాలుర పాఠశాలకు ప్రహరీ నిర్మాణం, బీసీ, ఎస్సీ గురుకులాల ఏర్పాటు, రహదారిపై సెంట్రల్ లైటింగ్‌పై నేతల హామిలిచ్చి నెరవేర్చడం లేదు. కస్తూర్బా భవనం పిల్లర్లకే పరిమితమైంది. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం మండల కేంద్రంగా ఏర్పాటు చేసిందే తప్ప వసతులు కల్పించలేదు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
కడ్తాలకు ప్రభుత్వం మండలంగా ఏర్పాటు చేసి ఐదేళ్లు అవుతున్నా పూర్తి స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. సొంత భవనాలు లేక కార్యాలయాలు అరకొర వసతుల మధ్య నిర్వహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాల నిర్మాణం, కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా స్పందన లేదు.
- గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ, కడ్తాల్
విద్యారంగంలో వెనుకబాటు
కడ్తాల విద్యారంగంలో వెనుకబడింది. జూనియర్ కళాశాల లేక పదో తరగతి పూర్తిచేసిన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్ద కాలంగా కళశాల ఏర్పాటు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోవడం లేదు. కళాశాల, బీసీ, ఏస్సీ గురుకుల పాఠశాలల ఏర్పాటు, బాలుర పాఠశాలకు ప్రహ రీ, కస్తూర్బా భవనం నిర్మాణం కోసం అవసరమైతే ఆందోళనలకు వెనకాడం.
- అశోక్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు, కడ్తాల్
ప్రభుత్వానికి నివేదించాం
పునర్విభజనలో ఏర్పాటైన కడ్తాల మండలంలో వసతుల కల్పనకు, నిధుల కేటాయింపునకు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కేటాయించి భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్, కళాశాల ఏర్పాటు వంటి వాటికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ద్వారా మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించాం.
- దశరథ్‌నాయక్, జడ్పీటీసీ, కడ్తాల్
Updated Date - 2021-08-16T05:05:24+05:30 IST