ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల బియ్యంతో కోట్లు!

ABN, First Publish Date - 2021-08-09T04:47:15+05:30

పేదల బియ్యం పక్కదారి పడుతోంది. వికారాబాద్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

పరిగిలో పట్టుబడిన రేషన్‌ బియ్యం లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పరిగి కేంద్రంగా రేషన్‌ బియ్యం దందా
  • రైస్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌.. లారీల్లో రవాణా
  • రూ.కోట్లులో వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు
  • చూసీచూడనట్లుగా అధికారులు


పేదల బియ్యం పక్కదారి పడుతోంది. వికారాబాద్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాయితీ బియ్యాన్ని సేకరించి కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా రీసైక్లింగ్‌ చేసి వాటిని ఎక్కువ ధరకు ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ కాసుల పంట పండించుకుంటున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 


పరిగి: వికారాబాద్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది.  ఆహారభద్రత పథకం ద్వారా పేదలకు ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని కొందరు వ్యాపారులు పక్కదారిపట్టిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌ బియ్యం కోటాను రెట్టింపు చేసింది. గత రెండు నెలల నుంచి ఏకంగా మూడింతలు అంటే ఒక వ్యక్తికి 15 కిలోల బియ్యం ఇస్తోంది. ఈ పేదల బియ్యంను కొందరు అక్రమార్కులు తన్నుకపోతున్నారు. ఎన్ని నిబంధనలు ఉన్నప్పటీకీ దందా ఆగడం లేదు. ప్రభుత్వం రూ.26కి కిలో బియ్యం కొనుగోలు చేసి లబ్దిదారులకు రూపాయికే అందిస్తోంది. ఈ బియ్యాన్ని పాలిషింగ్‌ చేసి ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చీకటి దందా నడిపిస్తున్నారు. రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రజాప్రతినిధులు ఓ వైపు ఊదరగోడుతుంటే.. అక్రమార్కులేమో కాసుల పంట పండించుకుంటున్నారు.  రాయితీ బియ్యాన్ని కొందరు వ్యాపారులు రీసైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి కొంత, మరి కొందరు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ పరిగి కేంద్రంగా నిరాటకంగా దందా నడిపిస్తున్నారు. అక్రమాలను నియంత్రించే కొందరు అధికారులు కూడా వ్యాపారులకు సహకరిస్తుండడంతోనే దందా భారీ స్థాయిలో జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

భారీ స్థాయిలో సేకరణ..

రేషన్‌ బియ్యం దందా పరిగి కేంద్రంగా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు వ్యాపారులు భారీ స్థాయిలో రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. పరిగి పరిసరాల నుంచే కాకుండా చౌదరిగూడ, కొందర్గు, కులకచర్ల, మహ్మదాబాద్‌, కొడంగల్‌, బొంరాసిపేట్‌, దౌల్తాబాద్‌, వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌, ధారూర్‌, తాండూరు, బషీరాబాద్‌, పొరుగు జిల్లాలోని శంకర్‌పల్లి, శంషాబాద్‌, షాబాద్‌, షాద్‌నగర్‌, కొందుర్గు, నవాబ్‌పేట, కోస్గి, మద్దూర్‌, దామరగిద్ద, కోహిర్‌, జహిరాబాద్‌ ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి పరిగికి తీసుకవస్తున్నట్లు తెలుస్తోంది. డీలర్లతోపాటు, అంగళ్ళలో సేకరించిన బియ్యాన్ని పరిగి, దోమ, ధారూర్‌ మండలాల్లోని కొన్ని రైస్‌ మిల్లులతోపాటు, కొడంగల్‌ ప్రాంతంలోని రైస్‌ మిల్లులకు తరలించి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సేకరించిన సరుకును రెండు, మూడు రోజుల్లో లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీలో 204 క్వింటాళ్ల బియ్యం లెక్కన నెలకు 30 నుంచి 60 లారీల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. అక్రమ దందా రూ.లక్షలు దాటి రూ.కోట్లకు చేరుకుంది. గతంలో పరిగి శివారులోని ఓ ఫీడ్‌ కంపెనీలో వెయ్యి క్వింటాళ్ల వరకు రేషన్‌ బియ్యం పట్టుబడిన విషయం విధితమే. అంతేకాకుండా పరిగి,తాండూరు ప్రాంతాల్లో కూడా పలుమార్లు బియ్యం పట్టుబడినా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

విచిత్రంగా అధికారుల వైఖరి..

పేదల బియ్యం దందా వ్యవహారంలో రెవెన్యూ, పోలీసు అధికారుల వైఖరి విచిత్రంగా ఉంటోంది. ఏ కిరాణ షాపులో చిన్న మొత్తంలో రేషన్‌ బియ్యం లభిస్తే పట్టుకుని జైలుకు పంపించే అధికారులు బడా అక్రమారులపట్ల ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తును అక్రమ రేషన్‌ బియ్యం పట్టుబడినా నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. గతంలో  పరిగిలో డీసీఎంలో తరలిస్తున్న 18 క్వింటాళ్ల బియ్యం, శివారులోని ఓ వ్యవసాయక్షేత్రంలో 183 క్వింటాళ్లు, బొంరాసిపేట్‌ శివారులో 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడింది. వారం వ్యవధిలోనే నాలుగు చోట్ల పట్టుబడ్డాయి. ఇదిలా ఉండగా,  పరిగి మండలం మాదారంలో 40 క్వింటాళ్లు, గడిసింగాపూర్‌ రేషన్‌షాపులో 101 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. అయితే నెలా వ్యవధిలోనే పరిగి ప్రాంతంలో ఐదుసార్లు రేషన్‌ బియ్యం పట్టుబడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్న మొత్తంలో రేషన్‌ బియ్యం పట్టుబడితే పీడీయాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపిస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు పరిగిలో ఇంత పెద్ద ఎత్తున బియ్యం పట్టుబడినా కఠిన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ బియ్యం తరలుతున్నట్లు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించరనే విమర్శలు కూడా ఉన్నాయి. 

రూ.కోట్లలో వ్యాపారం

సబ్సిడీ ద్వారా పేదలకు రూపాయికే కిలో బియ్యం లభిస్తోంది. అయితే అక్రమ దందా పరిస్థితిని బట్టి వ్యాపారులు కిలో బియ్యం రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని రూ.22 నుంచి రూ.25ల వరకు మిల్లర్లకు విక్రయిస్తున్నారు.  అయితే ఈ రేషన్‌ బియ్యాన్ని గోనె సంచి నుంచి ప్లాస్టిక్‌ బస్తాలోకి మార్చడానికి రూ.25ల చొప్పున ఖర్చవుతోంది. తర్వాత  ఖాళీ బస్తా అమ్మితే రూ.20లు రికవరి వస్తుంది. రవాణ ఖర్చు రూ.100 నుంచి రూ.120లు అవుతోంది. పనులు, ఇరత ఖర్చులు పోను మరో రూ.200లు అవుతున్నాయి. అంతా కలిపితే రూ.1700 నుంచి రూ.1900ల వరకు అవుతోంది. మార్కెట్‌లో రూ.2500ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చేతులు, స్థలాలు మారిన తర్వాత కూడా ప్రతి క్వింటాలుకు కనీసం రూ.500 నుంచి రూ.600లకుపైగా గిట్టుబాటు అవుతుందంటే దందా ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. 

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

రేషన్‌ బియ్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్‌ ద్వారా నిఘా, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇటీవల పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయించాం. ఒకే వ్యక్తి మూడుసార్లు రేషన్‌ బియ్యం తరలిస్తూ పట్టుబడితే పీడీయాక్టు నమోదు కోసం పోలీసులకు రేఫర్‌ చేస్తున్నాం. అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించేంది లేదు. 

-కేవీ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో వికారాబాద్‌ 

Updated Date - 2021-08-09T04:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising