ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి కోతలు కోసేదెలా?

ABN, First Publish Date - 2021-11-15T04:49:10+05:30

రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు.

పెరిగిన ఖర్చులతో కోయకుండానే ఉంచిన వరి పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏటా పెరుగుతున్న పంట పెట్టుబడులు
  • వరి కోయకుండానే చేనులో వదిలేస్తున్న రైతులు
  • పెరిగిన డీజిల్‌ ధరలతో రేట్లు పెంచేసిన హార్వెస్టర్ల యజమానులు
  • వరి కోతలకు ఏర్పడిన కూలీల కొరత, పెరిగిన డిమాండ్‌
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి  వరి కోతలపై స్పస్టత కరువు 
  • జిల్లాలో నేటికీ తెరుచుకోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు


రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. నారు పోసిన నాటి నుంచి వరి కోసి ధాన్యం అమ్మే వరకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. పెట్టుబడి ఖర్చులు పెరిగి అన్నదాత దిగాలు పడాల్సి వస్తుంది. గతేడాది కంటే ఈ ఏడాది వరి సాగుపై పెట్టుబడి భారం పెరిగింది. డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లు ఇతర యంత్ర పరికరాలు, కూలీల చార్జీలు పెరిగి వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  చివరికి పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కోతల భారంతో కొందరు రైతులు చేనుల్లోనే వరిని వదిలి పెడుతున్నారు. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/ షాద్‌నగర్‌ : పంటల సాగు ఏటా భారమవుతోంది. ఓ పక్క కూలీల కొరత, మరో పక్క యంత్రాల వినియోగం పెరగడం, డీజిల్‌ ధరలు రోజురోజుకూ అధికమవుతుండటంతో రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతేడాదితో  పోలిస్తే ఈసారి వరి సాగుపై సుమారు 15శాతం పెట్టుబడి ఖర్చులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. గతేడాది (2020) వానాకాలంలో 36,000 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతుందని అంచనా వేయగా 71,613 ఎకరాలు సాగైంది. వాతావరణం అనుకూలించడంతో 2021 సంవత్సరం వానాకాలంలో అత్యధికంగా వరి సాగు చేశారు. జిల్లాలో సాగు అంచనా 45,573 ఎకరాలు. కాగా, అంచనాలకు మించి 1,29,215 ఎకరాలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎరువుల ధరలు, కూలీల రేట్లు పెరగడంతో పెట్టుబడి అధికమైంది. వీటికితోడు రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతులకు గుదిబండగా మారుతున్నాయి. సాగులో ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లు ఇతర యంత్ర పరికరాలను వినియోగిస్తుండటంతో పెరిగిన ధరలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ట్రాక్టర్‌ యజమానులు పొలం దున్ని కరిగేడు చేసేందుకు రూ.2,500, నాట్లు వేసేందుకు రూ.3,500, ఫర్టిలైజర్‌కు రూ.3,800 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కూలీల కొరత తీవ్రం కావడంతో.. కొంతమంది రైతులు వరి కోత యంత్రాలపై ఆధార పడుతున్నారు. ఎకరం సాగు చేసిన రైతులు కూలీలచే వరిని కోయిస్తున్నారు. వరి సాగు ఎక్కువ చేసిన రైతులు యంత్రాలతో కోయిస్తున్నారు. కూలీలతో వరిని కోయిస్తే.. రూ.3 వేలు ఖర్చు అవుతుండగా.. వరి కోత యంత్రం ద్వారా కోయిస్తే.. గంటకు రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. గతేడాది వరి కోతకు ఎకరానికి రూ.1,800 ఉండగా, ఈసారి రూ.200 పెంచేశారు. కోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అదనంగా ట్రాక్టర్‌కు రూ.2వేలు తీసుకుంటున్నారు. కోతల భారంతో కొందరు రైతులు చేనుల్లోనే వరిని వదిలి పెడుతున్నారు. 


వరి కొయ్యాలా వద్దా.! 

వరి పంట చేతికి వచ్చింది. పంటను కొయ్యాలా.. వద్దా..? అనే విషయంలో రైతులు సందిగ్ధంలో ఉన్నారు. వరి కోతలపై అధికారులు స్పష్టత ఇవ్వలేదంటున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటున్నాయని పేర్కొంటున్నారు. 


తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు

2021 వానాకాలంలో జిల్లాలో 45,573 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు లక్ష్యం కాగా.. 1,29,215 ఎకరాల్లో సాగు చేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 1,70,000 టన్నులు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. 38 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా తెరుచుకోలేదు.


కల్లాల వద్దకు వెళ్లి వడ్లు కొనేనా?

వరి సాగు చేసిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండానే నేరుగా కల్లాల వద్దకే వచ్చి ప్రతి గింజా కొంటామని ప్రజాప్రతినిధులు చెప్పారు. సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాలిచ్చిన వారంతా ఇప్పటివరకు కళ్లాల వద్దకు తొంగి చూసిన పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. 


కోతలకు డబ్బుల్లేవు..

నాకు ఉన్న రెండెకరాల్లో వరి పంట వేశాను. పంట చేతికి వచ్చే సరికి ఖర్చులు పెరిగిపోయాయి. కోతలు కోయడానికి ఎకరానికి రూ.500అడుగుతున్నారు. ఎకరం పొలంలో వరి కోత కోయాలంటే రూ.3వేల ఖర్చు వస్తుంది. ఉన్న పైసలన్నీ పంట పెట్టుబడులకే సరిపోయాయి. ఇప్పుడు చేతుల్లో పైసల్లేవు. వరి కోతకు వచ్చినా కోయలేని పరిస్థితి వచ్చింది. మిషన్‌లతో కోపిద్దామంటే గంటకు రూ.2వేలు అడుగుతున్నారు. రెండెకరాల పంటకొస్తే రూ.4 వేలు అవుతుంది. అందుకే ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇంత ఖర్చు చేసినా పెట్టిన పెట్టుబడి కూడా రాదు. సర్కారోళ్లు కొంటరో.. కొనరో తెలువదు. కొంతవరకు కోయించినా ఎక్కడ ఎండపోయాలో తెలుస్తలేదు. 

- చాందీ నాయక్‌ 


సర్కారోల్లే రోడ్డెక్కుతున్నారు..!

రెక్కలు ముక్కలు చేసు కుని పండించిన పంటను కొనడానికి సర్కారోల్లే పీకులాడుకుం టున్నారు. మా బాధలు ఎవరికి చెప్పాలి. రెండె కరాల్లో సన్న వడ్లు పండించాను. కోతలు కోసి పది రోజులైంది. ఇప్పటికీ కొనుగోలు దుకాణాలు తెరవ లేదు. వర్షాలు పడుతున్నాయి. వడ్లన్నీ పచ్చిగా అవుతున్నాయి. సర్కారోళ్లు రేపూ మాపంటున్నారు. ఇప్పటికే పంట పండించడానికి రూ.30వేల ఖర్చయింది. వానకు తడిస్తే ఇచ్చే పైసలు కూడా ఇవ్వరు. గోనెసంచులు లేక ప్లాట్లలో అద్దె చెల్లించి పంటను రాసులుగా పోశాం. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు ఇప్పటికే సగం పంట తడిసింది. మాకు చదువు రాదు. వ్యవసాయాన్ని నమ్ముకునే బతుకు తున్నాం. మా బాధలను పట్టించుకోకుండా ‘కారు గుర్తు.. పువ్వు గుర్తులోల్లు’ పంచాయతీ పెట్టుకుంటు న్నారు. అసలు పంటను కొంటారో లేదో తెలుస్త లేదు. అప్పులు చేసి పంటను పండించాం. మిత్తీలు పెరుగుతున్నాయి. సర్కారోళ్లు కొనేసరికి వచ్చిన పైసలన్నీ మిత్తీలకే పోతాయి. మమ్ముల్ని ఆగం చేస్తున్నరు. సన్నవడ్లు కొనమని పెద్దసార్లు అంటున్నరు. పెట్టిన పెట్టుబడి కూడా వస్తదో.. లేదో.. ఏమో సారు మీరే చెప్పండి అంటూ షాద్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన గిరిజన రైతు తుల్సినాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’ తో మొర పెట్టుకున్నారు.  

- తుల్సినాయక్‌, రైతు కిషన్‌నగర్‌



Updated Date - 2021-11-15T04:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising