కరుణించమ్మా..గట్టుమైసమ్మ
ABN, First Publish Date - 2021-01-25T05:12:27+05:30
కరుణించమ్మా..గట్టుమైసమ్మ
- ఘట్‌కేసర్‌లో గట్టు మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
- కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
- తెల్లవారు జాము నుంచే పూజలు
- బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు
- భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
- అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ గట్టు మైసమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. కొవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన జాతర క్రతువు ఆదివారం రాత్రి పొద్దుపోయేదాక కొనసాగింది. ఆదివారం తెల్లవారు జామునుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించు కోవడం ప్రారంభించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకువచ్చి సమర్పించడం ప్రారంభించారు. గట్టుమైసమ్మ ఆలయం ఈఓ భాగ్యలక్ష్మీ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ, మున్సిపాలిటీ అధికారుల, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయా కుల సంఘాల పెద్దలు జాతర క్రతువును పూర్తిచేశారు. జాతర సందర్భంగా బైపా్‌సరోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో బైపాస్ రోడ్డును మూసివేసి ట్రాఫిక్‌ను ఘట్‌కేసర్ పట్టణం మీదుగా మళ్లించేవారు. ఈసారి భక్తులు రోడ్డును దాటే చోట ఇరువైపులా పోలీసులను ఏర్పాటు చేసి కొద్దిసేపు వాహనాలను నిలిపివేసి భక్తులు రోడ్డు దాటిన తర్వాత తిరిగి వాహనాలను పంపించారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి అదనపు బలగాలతో పెద్దఎత్తున పోలీసు గస్తీ నిర్వహించారు.
అంటువ్యాధుల ముప్పు: భవిష్యవాణిలో హెచ్చరిక
ఘట్‌కేసర్ గట్టుమైసమ్మ జాతరలో ప్రధాన ఘట్టాలలో ఒకటైన భవిష్యవాణిలో అంటు వ్యాధుల ముప్పు పొంచి ఉందని అమ్మవారు హెచ్చరించింది. అంటు వ్యాది వ్యాపించి జనాలు పిట్టల్ల రాలిపోతారని వివరించింది. భక్తులు ఐదు వారాలు వనభోజనాలు చేయాలని సూచించింది. అందులో రెండు వారాలు అమ్మవారికి తీపి బోనాలు చేసి పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తే మంచి జరుగుతుందన్నారు. రెండు వారాల్లో ఎలాంటి జంతు బలులు చేయరాదని అమ్మవారు హెచ్చరించింది. జాతరలో ఏర్పుల జగదీష్ అనే వ్యక్తి పచ్చికుండపై కొత్త చాటను పెట్టి భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారి ఎదురుగా ధ్వజస్తంభం ముందు నిలబడి పూనకంతో ఊగిపోతూ వినిపించే భవిష్యవాణిని వినేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తారు.
ఆకట్టుకున్న పోతరాజు విన్యాసం
ఘట్‌కేసర్ గట్టుమైసమ్మ జాతరలో పోతరాజు విన్యాసానికి ఎంతో ఆదరణ ఉంటుంది. అలయానికి దూరంగా ఉండే పోతరాజును డప్పుల చప్పుళ్లతో భవిష్యవాణి వినిపించే ధ్వజస్తంభం వద్దకు తీసుకువస్తారు. పోతరాజుకు ముందు ఓవ్యక్తి గుమ్మడి కాయతో తిరుగుతుంటాడు. ఆగుమ్మడికాయను స్వాధీనం చేసుకోని అమ్మవారికి సమర్పిస్తారు. అప్పటికే పోతరాజు రాక కోసం పదుల సంఖ్యలో ఉండే శివసత్తులు పోతరాజురాకతో పూనకంతో ఊగిపోతూ ఆయనతో కలిసి నృత్యాలు చేస్తారు. అరగంటపాటు పోతరాజు, శివసత్తుల ఆటలతో ఆప్రాంతం మారుమ్రోగింది.
అమ్మవారిని దర్శించున్న మంత్రి మల్లారెడ్డి
గట్టు మైసమ్మ అమ్మవారిని ఆదివారం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీరెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్‌చైర్మన్ పల్గుల మాదవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వసంత, మెనేజర్ శ్రీదర్‌రెడ్డి, నాయకులు కె.పద్మారెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, ఎం.శ్రీనివా్‌సరెడ్డి, సారా శ్రీనివా్‌సగౌడ్, వి సంజీవ గౌడ్, దర్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, సుధాకర్‌రెడ్డి, బర్ల హరిశంకర్, పైళ్ల అండాలు, కమలమ్మ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-25T05:12:27+05:30 IST