హాజరు శాతం.. అంతంతే!
ABN, First Publish Date - 2021-10-30T04:23:36+05:30
కొవిడ్ భయం విద్యార్థులను ఇంకా వెంటాడుతూనే ఉంది.
- సంక్షేమ వసతి గృహాలు తెరుచుకున్నా... ఇంకా చేరుకోని విద్యార్థులు
- వెంటాడుతున్న కొవిడ్ భయం
- విద్యార్థుల పేరెంట్స్‌కు ఫోన్లు చేసి రప్పించుకుంటున్న వార్డెన్లు
- తెరుచుకోని చేవెళ్ల, శంకర్‌పల్లి బీసీ బాలుర హాస్టళ్లు
- చంపేస్తున్న చలి... విద్యార్థులకు నేటికీ అందని దుప్పట్లు
- అపరిశుభ్రంగా వసతిగృహాలు.. విజృంభిస్తున్న దోమలు
కొవిడ్ భయం విద్యార్థులను ఇంకా వెంటాడుతూనే ఉంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ముందుగా స్కూళ్లు.. ఇటీవల వసతిగృహాలు తెరిచారు. కానీ హాస్టళ్లకు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు. ఓపెన్ అయిన వసతిగృహాలకు చాలాతక్కువ మంది చేరుకున్నారు. మరికొన్ని హాస్టళ్లకు విద్యార్థులు రాక ఇంకా తాళాలు కూడా తీయలేదు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : విద్యార్థులను కొవిడ్ భయం వెంటాడుతోంది. హాస్టల్ బాట పట్టాల్సిన విద్యార్థులు చాలావరకు ఇంటి వద్దే ఉంటున్నారు. వసతిగృహంలో ఉండి పాఠశాలకు వెళ్లా ల్సిన విద్యార్థులు నేరుగా ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. వసతి గృహాలు తెరుచుకున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య చాలాతక్కువగా కనిపిస్తోంది. కొన్నిచోట్ల వసతి గృహాల తలుపులు ఇంకా తెరుచుకోనే లేదు. ఓపెన్ చేసిన వసతి గృహాల్లో వార్డన్లు పిల్లల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి రప్పిస్తు న్నారు. వసతిగృహాలు ఓపెన్ అయిన సంగతే గ్రామీణ ప్రాంతాల్లో తెలియదంటున్నారు. విద్యార్థులు రాకపోవడంతో చేవెళ్ల మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంతోపాటు శంకర్‌పల్లిలోని బీసీ బాలుర వసతి గృహం తెరుచుకోలేవు. చేవెళ్లలోని ఎస్సీ వసతి గృహంలో 42 మంది విద్యార్థులకుగాను కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అలాగే బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థులకు తొమ్మిది మందే ఉన్నారు. శంకర్‌పల్లి బాలికల వసతి గృహంలో 40 మంది విద్యార్థులకు అందులో 20 మంది మాత్రమే ఉన్నారు. ఆమ నగల్లు ఎస్సీ వసతి గృహంలో 16 మంది విద్యార్థులకు ఆరుగు మాత్రమే ఉన్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో గదిలో ఉంటున్నారు. కడ్తాల గిరిజన బాలుర వసతి గృహంలో 200 మంది విద్యార్థులకు గాను 23 మంది ఉన్నారు. ఆమనగల్లు ఎస్సీ వసతి గృహంలో 226 మంది విద్యార్థులకు గాను 78 మంది నమోద య్యారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో ఆరు ప్రిమెట్రిక్, రెండు పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉండగా, ఒక్కో వసతి గృహంలో 40 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 18 నుంచి 20 మంది విద్యార్థులే దర్శనమిస్తున్నారు. షాబాద్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో 45 మంది విద్యార్థులకుగాను 15 మంది విద్యార్థులున్నారు. ఎస్సీ వసతి గృహంలో 50 మంది విద్యార్థులకు 26 మంది, హైతాబాద్‌లోని బీసీ వసతి గృహంలో 62 మంది విద్యార్థులకు 25 మంది విద్యార్థులున్నారు. గురుకులాల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య ఆశాజన కంగానే ఉంది. ఒక్కో గురు కులంలో 70-80 శాతం వరకు హాజరయ్యారు.
చంపేస్తున్న చలి
చలి పులి చంపేస్తుంది. మూడురోజుల నుంచి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. చలికి విద్యా ర్థులు గజగజ వణుకుతున్నారు. బయటకు రావాలంటే భయప డుతున్నారు. ఉదయం 10గంటల వరకు చలి తీవ్రత ఉంటుంది. పొగమంచు కమ్ముకుంటుంది. విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వకపోవ డంతో చలికి వణుతున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా దుప్పట్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఇంటి నుంచి తెచ్చుకున్నవే కప్పుకుంటున్నారు.
కొవిడ్ నిబంధనలతో.
సంక్షేమ వసతి గృహాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలుచేస్తున్నారు. భౌతికదూరం పాటించే విధంగా వార్డెన్లు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఒక్కో గదిలో నలుగురు ఉండేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఆరోగ్య విషయంతో వార్డెన్లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెనూ ప్రకారం భోజ నం వడ్డిస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం, గుడ్డు, మాంసం అంది స్తున్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. హాస్టళ్లలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రక్తం పీలుస్తున్న దోమలు
జిల్లాలోని కొన్ని వసతిగృహాలు అపరిశుభ్రంగా మారాయి. మరుగుదొడ్లు క్లీనింగ్ లేక దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహ ఆవరణంలో పిచ్చిమెక్కలు, గడ్డి విపరీతంగా పెరిగాయి. దీన్ని తొలగించక పోవడంతో దోమల బాధ తప్పటడం లేదని విద్యార్థులు అంటున్నారు. ఓవైపు చలి.. మరోవైపు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు.
పెరగని విద్యార్థుల సంఖ్య
సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. విద్యార్థులకు మెస్‌చార్జీలు, ఇతరత్రా సౌకర్యాలు, అధికారుల జీతభత్యాలకు ఖర్చు పెడుతోంది. అయితే ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు ఇటు హాస్టల్ వార్డెన్లు గానీ, అధికారులు గానీ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. విద్యార్థులకు అవగాహన కల్పించి తల్లిదండ్రులను ఒప్పించి హాస్టళ్లలో చేర్పించడంలో ఆయా సంక్షేమశాఖల అధికారులు విఫలమయ్యారు.
Updated Date - 2021-10-30T04:23:36+05:30 IST