గొర్రెలేవి?
ABN, First Publish Date - 2021-07-14T05:02:10+05:30
రాష్ట్రంలోని వివిధ కుల వృత్తులను ప్రోత్సహించాలనే
- నిలిచిన రెండో విడత గొర్రెల పంపిణీ
- రెండేళ్లుగా ఎదురుచూస్తున్న గొల్ల కురుమలు
- పంద్రాగస్టు తర్వాతనే అంటున్న అధికారులు
- మొదటి విడతలో మిగిలిన 73 మంది లబ్ధిదారులకు పంపిణీకి చర్యలు
రంగారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం తీరు ఇలా..
జిల్లాలో సొసైటీలు : 368
సభ్యులు : 41,964
మొదటి విడత లక్ష్యం : 20,927
పంపిణీ చేసిన యూనిట్లు : 11,312
ఖర్చు చేసింది : రూ. 125 కోట్లు
పంపిణీ చేసిన గొర్రెలు : 2.36 లక్షలు
ఇప్పటి వరకు చనిపోయిన గొర్రెలు : 2,956
ఇన్సూరెన్స్ వారి ద్వారా విడుదలైన రూ. 1,56,08,800
చనిపోయిన గొర్రెల స్థానంలో పంపిణీ చేసిన గొర్రెలు ః 2,709
రెండో విడత పంపిణీ లక్ష్యం : 21,037
ఇప్పటి వరకు పంపిణీ చేసినవి ః శూన్యం
రాష్ట్రంలోని వివిధ కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. గొర్రెల పంపిణీకి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొదటి విడతలో మిగిలి పోయిన లబ్ధిదారులకు ఇంకా పూర్తి స్థాయిలో గొర్రెలను పంపిణీ చేయలేకపోయారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లుగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఈనెల 2వ తేదీ నుంచి షురూ చేశారు. మొదటి విడతలో మిగిలి పోయిన లబ్ధిదారులందరికీ ఈ నెలాఖరు వరకు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. రెండో విడత కోసం మాత్రం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పేట్టు లేదు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 11 మండలాలకు చెందిన 373 మంది లబ్ధిదారులు డీడీ తీసి గొర్రెల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గొర్రెల యూనిట్లు అందజేస్తున్నారు. డీడీలు తీసిన 373 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 270 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. యాచారం, మంచాల మండలాల్లో ఇంకా మిగిలిపోయిన 73 మంది లబ్ధిదారులకు వారంలో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
రెండో విడత పంద్రాగస్టు తర్వాతనే..
వరుస ఎన్నికలు, ఈ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రెండో విడత పంపిణీకి బ్రేక్ పడిందంటూ అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. కానీ.. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో గొర్రెల పంపిణీ నిలిచినట్లు తెలుస్తోంది. నిధుల కొరత కారణంగా రెండో విడత గొర్రెల పంపిణీ నిస్తేజంగా మారింది. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ జిల్లాకు పం పిణీ చేసిన తర్వాతనే మిగతా జిల్లాలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. పంద్రాగస్టు తర్వాతనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు..
రంగారెడ్డి జిల్లాలో గొర్రెల పెంచేందుకు ఆసక్తిగల గొల్ల కురుమ కుటుంబాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి మొదటి విడతలోనే దరఖాస్తులు స్వీకరించారు. వారికి నూతన సంఘాలను రిజిస్ర్టేషన్ చేయించారు. అన్ని మండలాల్లో గ్రామ సభలు జరిపి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ విడతలవారీగా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. తొలివిడత పంపిణీలో ఇంకా మిగిలిపోయిన వారంతా గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. రెండో విడత లక్ష్యం 21,037 యూనిట్లు కాగా, ఇవి ఎప్పుడు పంపిణీ చేస్తారో ఇక వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
పక్క రాష్ర్టాల నుంచి గొర్రెల కొనుగోలు
జిల్లాలో మొదటి విడతలో భాగంగా గొర్రెల పంపిణీ కోసం పక్క రాష్ర్టాల్లోని జిల్లాల నుంచి గొర్రెలను తీసుకు వచ్చారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, వెటర్నరీ వైద్యుల బృందం కొనుగోలు ప్రాంతాలను పర్యవేక్షించారు. వీరు తమ పరిధిలో ఉన్న సబ్సిడీ డీడీలు చెల్లించిన లబ్ధిదారులను తీసుకెళ్లి నేరుగా గొర్రెలు కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అనంతరం లబ్ధిదారులకు యూనిట్‌లను పంపిణీ చేశారు. గొర్రెల యూనిట్ల కోసం అధికారులు, వైద్య బృందం నెలల తరబడి అక్కడే ఉండి అనేక ఆటంకాలను, కష్టనష్టాలను భరించి విజయవంతమయ్యారు. కానీ.. రెండో విడతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
75శాతం రాయితీపై..
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 75 శాతం రాయితీపై గొర్రెలను అందిస్తోంది. ఒక్కో యూనిట్‌పై 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉంటుంది. స్థానికంగా లభించే జీవాలు కాకుండా ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక యూనిట్ విలువ రూ. 1.25 లక్షలు కాగా, అందులో ప్రభుత్వం యూనిట్‌కు 75 శాతం (రూ.93,750) రాయితీ ఇస్తుండగా.. మిగతా 25శాతం (రూ.31,250) లబ్ధిదారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. గొర్రెల కొనుగోలుతోపాటు రవాణా చార్జీలు, బీమాకు అయ్యే ఖర్చులు ఇందులోనే ఉంటాయి.
పెరిగిన గొర్రె కాస్ట్...!
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం 2017-18లో ప్రవేశ పెట్టింది. అప్పట్లో గొర్రెల కాస్ట్ తక్కువగా ఉండేది. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా నిత్యావసర ధరలతోపాటు గొర్రెల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో గొర్రెల ధర పెరిగి పోవడంతో ఈ ఎఫెక్ట్ గొర్రెల పంపిణీకి పథకంపై పడింది. లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకునేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసే ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టేలు ఉంటుంది. అయితే.. ప్రభుత్వం ఒక గొర్రెకు రూ. 5,200 చెల్లిస్తుంది. ఈ ధరకు ఇతర జిల్లాలో గొర్రె రావడం లేదు. అలాగే విత్తన పొట్టేలుకు రూ. 7 వేలు చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించే ఈ ధరకు విత్తన పొట్టేలు రావడం లేదు. ఈసారి రైతుల చెల్లించే 25 శాతం (రూ.31,250) పెరిగే అవకాశం కనిపిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
పంద్రాగస్టు తర్వాతే రెండో విడత..
పంద్రాగస్టు తర్వాతే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం రెండో విడతకు సంబం ధించిన లబ్ధిదారుల వివరాలను కంప్యూ టర్‌లో పొందుపర్చుతున్నాము. డీడీలు చెల్లించన వారందరికి రెండో విడతలో గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. యాచారం, మంచాల మండలాల్లో ఇంకా మిగిలిపోయిన 73 మంది లబ్ధిదారులకు వారంలో పంపిణీ చేస్తాం.
- అంజలప్ప, జిల్లా పశువైద్యాధికారి
గొర్రెల పంపిణీలో తీవ్ర జాప్యం
మూడేళ్ల క్రితం మొదటి విడతలో పంపిణీ చేయాల్సిన గొర్రెలను నేటికీ పంపిణీ చేయలేదు. ఇతర జిల్లాల నుంచి గొర్రెలను తీసుకు రావడం వల్ల చాలా గొర్రెలు చనిపోయాయి. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పోయాయి. గొర్రెల యూనిట్‌లో 50 గొర్రెలు, రెండు విత్తన పొట్టేలు ఉండేలా చూడాలి. రెండో విడతలో లబ్ధిదారుడు చెల్లించే వాటాను పెంచితే ఊరుకునేది లేదు. గొర్రెల కాస్ట్ పెరిగితే ప్రభుత్వమే భరించాలి. వెంటనే రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించాలి.
- రావుల జంగయ్య, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
Updated Date - 2021-07-14T05:02:10+05:30 IST