ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో పుట్ట మధు

ABN, First Publish Date - 2021-05-09T08:02:10+05:30

అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏపీలోని భీమవరంలో అదుపులోకి 
  • న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ
  • మాజీ మంత్రి ఈటల ప్రమేయం ఉందన్న కోణంలోనూ పోలీసుల ఆరా?
  • వరంగల్‌ ఐజీకి లాయర్‌ తండ్రి ఫిర్యాదు
  • ‘పెద్ద తలకాయలు’ అంటూ ప్రస్తావన
  • ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు సర్కార్‌ వినతి 


పెద్దపల్లి/హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయనను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ప్రకటించింది. వారం రోజుల అదృశ్యంపై, హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును విచారిస్తున్నట్లు పేర్కొంది. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఇటీవల వరంగల్‌ ఐజీకి చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. అయుతే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణ లు వచ్చిన మరుసటి రోజే పుట్ట మధు అదృశ్యం కావడం గమనార్హం. ఈటలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పుట్ట మధు.. ఆయనతో కలిసి పలు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ క్రమంలోనే వారు పుట్ట మధుకు ఫోన్‌చేసి.. ఒకసారి హైదరాబాద్‌కు రావాలని చెప్పినట్లు, దీంతో ఆయన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు పుట్ట మధు వెన్నంటి ఉండే పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడిని రామగుండం కమిషనరేట్‌కు రప్పించి ఆయన గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో పుట్ట మధును విచారిస్తున్నామని పోలీసులు ప్రకటించడం కలకలం రేపుతోంది. కాగా, వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఏప్రిల్‌ 16న వరంగల్‌ ఐజీకి ఇచ్చిన ఫిర్యాదులో.. తన కుమారుడు, కోడలి హత్య వెనుక పుట్ట మధు, ఆయన భార్య శైలజ, కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ ఉన్నట్లు పేర్కొన్నారు. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఓడిన నాటి నుంచి తన కుమారుడిపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. ఈ హత్యలో స్థానిక నేతల నుంచి హైదరాబాద్‌ స్థాయి వరకు పెద్ద తలకాయలు, అధికారుల ప్రమేయం ఉందన్నారు.


ఈటల ఎపిసోడ్‌ తర్వాతే ఫోకస్‌..

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు, శైలజ, మరికొందరి ప్రమేయం ఉందని కిషన్‌రావు ఏప్రిల్‌ 16నే ఫిర్యాదు చేసినప్పటికీ, ఈటలకు మధు అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే కేసుపై ఫోకస్‌ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. పైగా గట్టు కిషన్‌రావు ఐజీకి ఇచ్చిన ఫిర్యాదు అంశం ఇప్పటివరకూ వెలుగులోకి రాలేదు. మొత్తమ్మీద పుట్ట మధు మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లేననే ప్రచారం జరుగుతోంది. వామన్‌రావు దంపతులు ఫిబ్రవరి 17న హత్యకు గురికాగా.. ఈ కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను, మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ, ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా చార్జీషీట్‌ దాఖలు కాలేదు. అయితే వామన్‌రావు తండ్రి  చేసిన ఫిర్యాదులో ‘పెద్ద తలకాయల ప్రమేయం’ అని ప్రస్తావించడంతో ఇందులో మాజీ మంత్రి ఈటల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు  సమాచారం. ఇదిలా ఉండగా.. వామన్‌రావు, నాగమణి హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డీజీపీ మహేందర్‌ రెడ్డి వినతి మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రారుకు లేఖ రాశారు. 


సినీ ఫక్కీలో కార్లు మార్చి..

భీమవరం: పుట్ట మధుకర్‌ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది. వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మధు.. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తెలంగాణ సరిహద్దులు దాటి ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. వారం రోజుల్లో ఆరు సెల్‌ ఫోన్లతోపాటు నాలుగు కార్లను మార్చారు. తొలుత తెలంగాణ నుంచి ఛత్తీ్‌సగఢ్‌కు పారిపోయి.. అక్కడినుంచి రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొద్ది రోజులు అక్కడే గడిపి ఆ తర్వాత భీమవరం చేరుకున్నారు. ఈ క్రమంలో మధు ఎన్ని ఫోన్లు మార్చినా.. తెలంగాణ పోలీసులు ఆచూకీ గుర్తించారు. ఆ వెంటనే భీమవరంలోని ఓ లాడ్జీ వద్ద ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-05-09T08:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising