చలిలో విషపు గాలి!
ABN, First Publish Date - 2021-02-03T09:10:29+05:30
చలికాలంలో హైదరాబాద్‌లో వాయుకాలుష్యం అత్యధికంగా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల రాజధానులు చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం కంటే భాగ్యనగరినే అత్యధికంగా గాలి కాలుష్యం కమ్మేసిందని సెంటర్ ఫర్ సైన్స్
హైదరాబాద్‌లో పెరిగిన వాయుకాలుష్యం
దక్షిణాదిన ఇక్కడే అత్యధికం: సీఎస్సీ నివేదిక
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చలికాలంలో హైదరాబాద్‌లో వాయుకాలుష్యం అత్యధికంగా నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల రాజధానులు చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం కంటే భాగ్యనగరినే అత్యధికంగా గాలి కాలుష్యం కమ్మేసిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్సీ) నివేదిక తెలిపింది. 2019 సంవత్సరంతో పోలిస్తే 2020లో చలికాలంలో 7.5 శాతం మేర వాయుకాలుష్యం పెరిగినట్లు పేర్కొంది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. దాని ప్రకారం.. హైదరాబాద్‌లోని ఆరు ప్రాంతాల్లో వాయు నాణ్యతను కొలిచే కేంద్రాలు ఉండగా.. వాటిలో సనత్‌నగర్‌లో అత్యధికంగా, సెంట్రల్ వర్సిటీలో అత్యల్పంగా వాయుకాలుష్యం నమోదైంది.
గాలిలోని పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) మోతాదు ఆధారంగా వాయు కాలుష్య స్థాయిని అంచనా వేశారు. పీఎం 2.5 స్థాయి చెన్నైలో 33, బెంగళూరులో 30, తిరువనంతపురంలో 25 ఉండగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా 36గా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే.. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారి ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదముందని సీఎస్సీ ప్రోగ్రామ్ మేనేజర్ అవికల్ సోమవంశీ తెలిపారు. జనవరి మొదటివారంలో హైదరాబాద్, అమరావతి, రాజమహేంద్రవరం, చిక్‌బళ్లాపూర్, యాద్గిర్‌లలో వాయుకాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని, అది డర్టీయెస్ట్ వీక్‌గా సీఎస్సీ నివేదిక అభివర్ణించింది.
Updated Date - 2021-02-03T09:10:29+05:30 IST